Abn logo
May 4 2021 @ 20:07PM

అచ్చం జెర్సీ సినిమాలానే.. ఆడుతూనే చనిపోయిన క్రికెటర్లెవరో తెలుసా..?

మీలో చాలామంది నాని హీరోగా చేసిన జెర్సీ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో నాని క్రికెట్ ఆడుతూనే ప్రాణాలు కోల్పోతాడు. అలాగే భీమిలీ కబడ్డీ జట్టు సినిమాలో కూడా కబడ్డీ ఆడుతూ చనిపోతాడు. అయితే అది సినిమా. కానీ నిజజీవితంలో కూడా అలా కొంతమంది క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారని మీకు తెలుసా..? మిగతా క్రీడల విషయం అటుంచితే క్రికెట్లో కూడా ఇలాంటి మరణాలు సంభవించాయి. క్రికెట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 12 మంది క్రికెటర్లు మైదానంలోనే చనిపోయారు. గాయాల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ మైదానంలోనే కుప్పకూలిపోయి వారంతా ప్రాణాలొదిలారు. అలాంటి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జార్జ్ సమ్మర్స్:

క్రికెట్ మైదానంలో తొలి మరణం 1870లో సంభవించింది. ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ సమ్మర్స్ అనే ఆటగాడు 25ఏళ్ల వయసులో మరణించాడు. అది కూడా ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జార్జ్ మరణించాడు. నాటింఘమ్‌షైర్ తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. జార్జ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లండ్‌కే చెందిన పేసర్ జాన్ ప్లాట్స్ విసిరిన షార్ట్ పిచ్ బంతి అతడి తలకు నేరుగా తాకింది. దాంతో అతడికి తీవ్ర గాయమైంది. వెంటనే అతడికి మైదానం బయటకు తీసుకెళ్లినా సరైన సమయానికి చికిత్స అందకపోవడంతో చనిపోయాడు. జార్జ్ మరణంగా క్రికెట్ లోకం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటికే ఉన్న సేఫ్టీ పద్ధతులకు కొన్ని మార్పులు చేసి మరింత పటిష్ఠం చేయడం ప్రారంభించాయి క్రికెట్ యాజమాన్యాలు. 

ఆండీ డుకాట్:

క్రికెట్లో రెండు మరణం కూడా లార్డ్స్ మైదానంలోనే సంభవించింది. ఈ సారి కూడా ఇంగ్లండ్ ఆటగాడే బలయ్యాడు. 1942లో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాల్గొన్న  56 ఏళ్ల ఆండీ మైదానంలో మరణించాడు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలొదిలాడు. అయితే 1931లోనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండీ.. ఆ తర్వాత క్రికెట్ కోచ్‌గా ఐదేళ్ల పాటు పనిచేశారు. కొన్నేళ్లు స్పోర్ట్స్ రిపోర్టర్‌గా కూడా పనిచేశారు. అయితే 1942-రెండో ప్రపంచ యుద్ధ సమయంలో  సస్సెక్స్‌-సర్రే సైనిక బృందాల మధ్య జరిగిన మ్యాచ్‌లో డుకాటీ సర్రే తరపున బరిలోకి దిగారు. అయితే లంచ్ పూర్తయిన తర్వాత మైదానంలోకి వచ్చిన ఆయన కొద్ది సేపటికే మరణించారు. ఆయన మరణంతో మ్యాచ్‌ను సైతం రద్దు చేసి ఆయనకు అంతా శ్రద్ధాంజలి ఘటించారు. 

విల్ఫ్ స్లాక్:

1989లో విల్ఫ్ స్లాక్ అనే విండీస్ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. గాంబియాలోని బంజుల్‌లో జరిగిన దేశీయ మ్యాచ్‌లో స్లాక్ ఉన్నట్లుండి కుప్పకూలి పడిపోయాడు. వెంటనే సిబ్బంది అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా.. అప్పటికే అతడు మరణించాడు. అయితే అతడి మరణానికి కారణం ఏంటనేది ఇప్పటికీ తెలియరాలేదు. మైదానంలో మరణించిన వారందరిలో ఇప్పటికీ విల్ఫ్ మరణం మిస్టరీగానే ఉన్న ఏకైక మరణంగా నిలిచిపోయింది. అప్పుడాయన వయసు 30 ఏళ్లు.

ఇయాన్ ఫోలీ:

1993లో ఇయాన్ ఫోలీ డెర్బీషైర్‌ తరుపున బరిలోకి దిగాడు. వర్కింగ్‌టన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఫోలీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలర్ విసిరిన షార్ట్ పిచ్ బంతి నేరుగా అతడి కంటి కింద తగిలింది. దీంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ గుండెపోటుతో మరణించాడు. అప్పుడాయన వయసు 30 ఏళ్లు.

రామన్ లాంబా:

1998లో భారతదేశానికి చెందిన క్రికెటర్ రామన్ లాంబా మైదానంలో మరణించాడు.  బంగ్లాదేశ్-ఢాకా మధ్య జరిగిన ఓ క్లబ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు లాంబా తలకు తగిలింది. దాంతో అక్కడే కుప్పకూలిపోయాడు. సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. కోమాలో మూడు రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ప్రాణాలొదిలాడు. దీంతో భారత్ తరపున మైదనాంలో మరణించిన తొలి క్రికెటర్‌గా లాంబా ఉన్నాడు. అప్పుడు ఆయన వయసు 38ఏళ్లు.

వసీం రాజా:

2006లో పాకిస్తాన్‌కు చెందిన మరో ఆటగాడు క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. వసీం రజా అనే క్రికెటర్ 54 ఏళ్ల వయసులో మరణించాడు. బకింగ్‌హామ్‌షైర్‌లో మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా మైదానంలోనే గుండెపోటుతో మరణించాడు.

ఆల్క్‌ విన్ జెంకిన్స్:

2009లో తొలిసారిగా ఓ క్రికెట్ అంపైర్ మరణించాడు. ఇంగ్లండ్‌కు చెందిన అంపైర్ ఆల్క్‌ విన్ జెంకిన్స్ మైదానంలో తీవ్రంగా గాయపడి ఆ తరువాత మరణించిన ఘటన చోటు చేసుకుంది. ఓ ఫీల్డర్ విసిరిన బంతి తలపై తగలడంతో జెంకిన్స్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా.. కోలుకోలేకపోయాడు. చివరిగి ఆ గాయం కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు ఆయన వయసు 72 ఏళ్లు.

రిచర్డ్ బ్యూమౌంట్: 

2012లో ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కూడా మైదానంలో గుండె పోటు కారణంగానే మరణించాడు. 33 ఏళ్ల వయసులో క్లబ్ క్రికెట్ ఆడుతున్న రిచర్డ్ బ్యూమౌంట్ 5 వికెట్లతో ప్రత్యర్థి జట్టును వణికించాడు. కానీ ఆ తర్వాత కొద్ది సేపటికే మైదానంలో ఫీల్డింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే సిబ్బంది అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా రిచర్డ్ అప్పటికే మరణించాడు. అయితే అతడు గుండెపోటు వల్ల మరణించినట్లు అనుమానాలున్నాయి.

జుల్ఫికర్ భట్టి:

పాకిస్తాన్‌కు చెందిన జుల్ఫికర్ భట్టి కూడా అచ్చం అబ్దుల్ అజీజ్ లానే ఛీతీపై బంతి తగలడంతో మరణించాడు. భట్టి కూడా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. 22 ఏళ్ల జుల్ఫికర్ భట్టి 2013లో జరిగిన ఓ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ మరణించాడు. బంతి ఛాతీపై బలంగా తగలడంతో కుప్పకూలిపోయిన అతడు.. వెంటనే ఆసుపత్రికి తరలించినా మరణించాడు.

డారిన్ రాండాల్:

2013లోనే సౌత్‌ఆఫ్రికాకు చెందిన 32 ఏళ్ల క్రికెటర్ డారెన్ రాండాల్.. మైదానంలోనే మరణించిన తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. బౌలర్ విసిరిన ఓ షార్ట్ పిచ్ బంతి రాండాల్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే షాట్ మిస్ కావడంతో నేరుతా అతడి తలకు బంతి తగిలింది. గాయం బలంగా కావడంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే గాయం బలమైంది కావడంతో అతడే మరణించారు.

ఫిల్ హ్యూస్:

2014లో ఆస్ట్రేలియాకు చెందిన 25 ఏళ్ల ఫిల్ హ్యూస్ కూడా బంతి మెడ పై భాగంలో తగలడంతో మరణించాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా సౌత్‌ఆప్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున బరిలోకి దిగిన 25ఏళ్ల ఫిల్.. భారీ గాయానికి గురయ్యాడు. బౌలర్ విసిరిన బంతి అతడి మెడపై భాగంలో బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే సిడ్నీ ఆసుపత్రికి తరలించగా మెదడులో ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. అంతేకాకుండా భారీ రక్త స్రావం కూడా కావడంతో వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేశారు. అయినా ఫిల్ కోలుకోలేకపోయాడు. రెండు రోజుల తర్వాత ప్రాణాలొదిలాడు.

కొద్ది నెలల క్రితం మహారాష్ట్రలో జరిగిన ఓ లోకల్ మ్యాచ్ సందర్భంగా కూడా ఓ బ్యాట్స్‌మన్ మరణించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్ ఉన్నట్లుండి కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కూడా బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి అత్యంత వేగంగా వచ్చి నేరుగా బౌలర్‌ తలకు తగలడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని వైద్య సహాయం కోసం తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా అప్పటికే మరణించాడు.

Advertisement
Advertisement
Advertisement