ఫిట్‌మెంట్‌పై ముందడుగు!

ABN , First Publish Date - 2021-01-21T07:34:23+05:30 IST

ఉద్యోగులు, పింఛనుదార్ల ఫిట్‌మెంట్‌పై ముందడుగు పడింది. రెండు వారాలుగా స్తబ్ధుగా ఉన్న ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యోగుల డిమాండ్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఫిట్‌మెంట్‌పై ముందడుగు!

రేపో మాపో సీఎంతో సీఎస్‌ సోమేశ్‌ భేటీ

ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు

ఉద్యోగుల డిమాండ్లు సీఎం కేసీఆర్‌ దృష్టికి

ఫిట్‌మెంట్‌పై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం

సీఎస్‌తో ఉద్యోగ జేఏసీ భేటీలో చర్చ

పీఆర్సీ, మూల వేతనం, వయసు పెంపు, 

ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌

ఏపీ నుంచి ఉద్యోగులను రప్పించాలని విజ్ఞప్తి


హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, పింఛనుదార్ల ఫిట్‌మెంట్‌పై ముందడుగు పడింది. రెండు వారాలుగా స్తబ్ధుగా ఉన్న ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యోగుల డిమాండ్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అంగీకరించారు. సీఎం ఇచ్చే ఆదేశాల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చిస్తానంటూ భరోసా ఇచ్చారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయడానికీ అంగీకరించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున టీజీవోల సంఘం అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ బుధవారం బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3.10 గంటల నుంచి 4 గంటల వరకు వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. ముఖ్యంగా పీఆర్సీ ఫిట్‌మెంట్‌, నివేదికను బహిర్గతం చేయడం, మూల వేతనాల పెంపు, ఫిట్‌మెంట్‌ అమలు తేదీ, పదవీ విరమణ వయసు పెంపు, ఏపీ నుంచి ఉద్యోగులను తెలంగాణకు రప్పించడం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని జేఏసీ నేతలు సీఎ్‌సను కోరారు. 


ప్రధానంగా ఫిట్‌మెంట్‌పై ఏదో ఒకటి తేల్చాలని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని వివరించారు. 2018 జూలై 1 నుంచి ఫిట్‌మెంట్‌ రావాల్సి ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 జూలై 1 నుంచే 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌)ని అమలు చేస్తున్నారని, ఇక్కడ ఐఆర్‌ లేదు సరికదా ఫిట్‌మెంట్‌ను కూడా ప్రకటించలేదని తెలిపారు. ఇప్పటివరకు త్రిసభ్య కమిటీ తమను సమావేశానికి పిలవలేదన్నారు. పీఆర్సీ ఎంత మేర ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసింది? ఆర్థిక శాఖ ఎంత ప్రతిపాదించింది? ఉద్యోగ సంఘాలు ఎంత డిమాండ్‌ చేస్తున్నాయన్న వివరాలను సీఎంకు నివేదించాలని సీఎ్‌సను కోరారు. ఫిట్‌మెంట్‌ న్యాయసమ్మతంగా లేకపోతే ఆయన్ను కలిసి మరింత పెంచాలని కోరతామని తెలిపారు.  అయితే మధ్యలో సంక్రాంతి సెలవులు, కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సన్నద్ధత వంటి కారణాల వల్ల పీఆర్సీపై ముందడుగు వేయలేకపోయామని సీఎస్‌ అన్నట్లు తెలిసింది. పీఆర్సీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌, ఆర్థిక శాఖ ప్రతిపాదన, ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను సీఎంకు వివరిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలతో మళ్లీ ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ సమావేశం పెడతామని చెప్పినట్లు తెలిసింది. ఫిట్‌మెంట్‌పై ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారని అన్నట్లు సమాచారం. 


ఓపిక పట్టండి..

సీఎం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి కలుస్తానని, అప్పటివరకు ఓపిక పట్టాలని నేతలకు సీఎస్‌ సూచించారు. సీఎంను కలిసి వచ్చిన తర్వాత పీఆర్సీ నివేదికను బహిర్గతం చేస్తామని తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన 847 ఉద్యోగుల విషయాన్ని త్వరగా తేల్చాలని నేతలు కోరారు. ఈ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళతానంటూ సీఎస్‌ భరోసా ఇచ్చారని వివరించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా వెంటనే 50 వేల ఖాళీలను భర్తీ చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. ఇక పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేస్తామంటూ లీకులొస్తున్నాయని, అదే జరిగితే 2018 జూలై 1 నుంచి రావాల్సిన బకాయిలను ఎలా చెల్లిస్తారో స్పష్టతనివ్వాలని నేతలు కోరారు. ఫిట్‌మెంట్‌పై ఇప్పటికే లెక్కలు వేస్తున్నామని, ఎంత పెంచితే ఖజానాపై ఎంత భారం పడుతుందన్నది చూస్తున్నామని సీఎస్‌ వారికి చెప్పినట్లు తెలిసింది. 


భేటీకి అన్ని సంఘాలను పిలవాలి: జేఏసీ

పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై త్రిసభ్య కమిటీతో చర్చించడానికి గుర్తింపు పొందిన అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను పిలవాలని జేఏసీ నేతలు మామిళ్ల రాజేందర్‌, వి.మమత, ఎ.సత్యనారాయణ, రాయకంటి ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. త్వరలో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఫిట్‌మెంట్‌ను తేల్చాలన్నారు. పదోన్నతుల ప్రక్రియ వేగవంతంగా సాగుతుండడం, ఏపీ నుంచి తెలంగాణ ఉద్యోగులను రప్పించడంపై చర్యలు తీసుకుంటున్నందుకు సీఎం కేసీఆర్‌కు జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.


త్వరగా ప్రకటించండి: సమాఖ్య

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. ఫెడరేషన్‌ చైర్మన్‌ బి.రాజేశం, సెక్రటరీ జనరల్‌ జి.టి.జీవన్‌లు బుధవారం సీఎస్‌ సోమేశ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికైనా ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని, పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచాలని కోరారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో ఇంకా పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించలేదని, ఆ సంస్థల్లోనూ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-01-21T07:34:23+05:30 IST