పల్లెల్లో కోతలే కోతలు

ABN , First Publish Date - 2022-02-06T08:37:40+05:30 IST

కరెంటు కోతలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు అల్లాడుతున్నాయి. వేసవి గాలులు ప్రారంభం కాకుండానే మూడు రోజులుగా అకస్మాత్తు విద్యుత్‌ అంతరాయాలతో గ్రామాలు ఉక్కపోతకు గురవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలు విధిస్తే .. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ..

పల్లెల్లో కోతలే కోతలు

  • ఏకబిగిన ఏడేసి గంటలు
  • పలు ప్రాంతాల్లో రోడ్డెక్కిన రైతులు
  • ఎన్‌టీపీసీకి 300 కోట్లు చెల్లింపు
  • విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ
  • 24లోగా మరో 400 కోట్లు కట్టాలి
  • లేదంటే మళ్లీ సరఫరా నిలిపివేత
  • బహిరంగ మార్కెట్లోనూ కొనుగోళ్లు


అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కరెంటు కోతలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు అల్లాడుతున్నాయి. వేసవి గాలులు ప్రారంభం కాకుండానే మూడు రోజులుగా అకస్మాత్తు విద్యుత్‌ అంతరాయాలతో గ్రామాలు ఉక్కపోతకు గురవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలు విధిస్తే .. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతోనే విద్యుత్‌ పంపిణీ సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో సర్దుబాటు పేరిట విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నాయి. ఏకబిగిన ఏడేసి గంటలు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నాయి. దీనికి నిరసనగా రైతులు పలు ప్రాంతాల్లో రోడ్డెక్కారు. అయినా, అకస్మాత్తు, అకారణ కరెంటు కోతలకు కారణమేమిటో ఇంధన శాఖ ప్రకటించలేదు. మరోవైపు బకాయిలు చెల్లించలేదని విద్యుత్‌ సరఫరాను నిలిపేసిన నేషనల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాని(ఎన్‌టీపీసీ)కి శనివారం ట్రాన్స్‌కో రూ.300 కోట్లు చెల్లించింది. మరో రూ.400 కోట్లు ఈ నెల 24లోగా చెల్లిస్తామని విన్నవించుకుంది.


దీంతో ఎన్‌టీపీసీ విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించింది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, ఈ నెల 24వ తేదీలోగా రూ.400 కోట్లు చెల్లించకుంటే, మళ్లీ విద్యుత్‌ సరఫరాను నిలిపేస్తామని రాష్ట్ర ఇంధనశాఖను ఎన్‌టీపీసీ హెచ్చరించింది. ఇక కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్కేంద్రం ఒక ప్లాంటు బ్లాయిలర్‌లో ఏర్పడిన చిల్లుకు శనివారం రాత్రి దాకా మరమ్మతులు కొనసాగాయి. వీటీపీఎ్‌సలోనూ విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ ప్రారంభమైంది. రాష్ట్రంలో జెన్కో విద్యుత్కేంద్రాలలో 5,010 మెగావాట్ల పూర్తి సామర్థ్యం అందుబాటులో లేకపోవడంతో హిందూజాను విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆశ్రయించాయి. అదీ చాలదన్నట్లుగా బహిరంగ మార్కెట్‌కు వెళ్లాయి. బహిరంగ మార్కెట్లో ఎంత కొంటున్నారో? ఎంతకు కొంటున్నారో? సమాచారాన్ని బహిర్గతం చేయడం లేదు. శనివారం నాటికి విద్యుత్‌ సరఫరా పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా కనిపించలేదు.

Updated Date - 2022-02-06T08:37:40+05:30 IST