వర్సిటీలకు గ్రాంట్‌లో కోత

ABN , First Publish Date - 2021-05-21T07:14:45+05:30 IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు 2021-22 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా తగ్గాయి. ఒక్క పద్మావతి మహిళా వర్సిటీకి తప్ప మిగిలిన అన్నింటికీ గ్రాంట్‌లో కోత పెట్టారు. సవరించిన అంచనా ప్రకారం...

వర్సిటీలకు గ్రాంట్‌లో కోత

గతేడాదితో పోలిస్తే తగ్గిన కేటాయింపులు 


అమరావతి, మే 20(ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు 2021-22 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా తగ్గాయి. ఒక్క పద్మావతి మహిళా వర్సిటీకి తప్ప మిగిలిన అన్నింటికీ గ్రాంట్‌లో కోత పెట్టారు. సవరించిన అంచనా ప్రకారం... ఆంధ్రా విశ్వవిద్యాలయానికి రూ.228.89 కోట్లు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి రూ.135.67 కోట్లు, నాగార్జున విశ్వవిద్యాలయానికి రూ.39.67 కోట్లు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి రూ.51.68 కోట్లు, బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి రూ.4.33 కోట్లు,  పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి రూ.3.8 కోట్లు, ద్రవిడ వర్సిటీకి రూ.18.15 కోట్లు, ఆదికవి నన్నయ వర్సిటీకి రూ.7.82 కోట్లు, యోగి వేమన విశ్వవిద్యాలయానికి రూ.22.14 కోట్లు కేటాయించారు. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయానికి రూ.6 కోట్లు, కృష్ణా వర్సిటీకి రూ.5కోట్లు, రాయలసీమ వర్సిటీకి రూ.7.44 కోట్లు, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి రూ.12.05 కోట్లు, వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీకి రూ.4.98 కోట్లు, ఉర్దూ వర్సిటీకి రూ.92.51 లక్షలు కేటాయించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం వర్సిటీకి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 2020-21 బడ్జెట్‌లో రూ.42.41 కోట్లు కేటాయించగా 2021-22లో రూ.44.61 కోట్లు కేటాయించారు.


బడ్జెట్‌లో పస కన్నా బుగ్గన నస ఎక్కువ: లంకా 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పస కన్నా బుగ్గన నస ఎక్కువగా ఉందని బీజేపీ నేత లంకా దినకర్‌ విమర్శించారు. బడ్జెట్‌లో విషయం లేకపోవడంతో ఈ ప్రభుత్వ సహజధోరణికి దూరంగా ఉండే మహానుభావుల కోట్‌లతో మాటల కోతలు కోటలు దాటాయన్నారు. ఇప్పటివరకు బుగ్గన ప్రవేశపెట్టిన 3 బడ్జెట్లను సమీక్ష చేసి, సరైన రీతిలో అర్థమయ్యే విధంగా నివేదిక ఇవ్వగలిగితే, 3 నోబెల్‌ బహుమతులు ఇవ్వొచ్చన్నారు. 

Updated Date - 2021-05-21T07:14:45+05:30 IST