నమ్మించి మోసం.. ముగ్గురి ఖాతాల్లో డబ్బు మాయం

ABN , First Publish Date - 2021-04-24T16:33:00+05:30 IST

నకిలీ ఫోన్‌ కాల్‌ నమ్మి ఒకరు, ఐఫోన్‌ రిపేర్‌ కేంద్రం కోసం

నమ్మించి మోసం.. ముగ్గురి ఖాతాల్లో డబ్బు మాయం

హైదరాబాద్/కుత్బుల్లాపూర్‌ : నకిలీ ఫోన్‌ కాల్‌ నమ్మి ఒకరు, ఐఫోన్‌ రిపేర్‌ కేంద్రం కోసం నెట్‌లో వెతికి మకొకరు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసి ఇంకొకరు మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నారు. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తికి ఈనెల 18వ తేదీ రాత్రి 8.30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి జియో నెట్‌వర్క్‌ ద్వారా వచ్చిన ఓటీపీ పంపమన్నాడు. ఓటీపీ పంపగానే బాధితుడి వాట్సాప్‌ ఆగిపోవడంతోపాటు ఫోన్‌లో ఉన్న అన్ని నంబర్లకు డబ్బులు పంపాలనే సందేశాలు వెళ్లాయి. బాధితుడి స్నేహితుడొకరు సదరు ఫోన్‌ నంబర్‌కు గూగుల్‌ పే ద్వారా రూ. 10 వేలు పంపాడు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


మరో వ్యక్తి ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఐ ఫోన్‌ రిపేర్‌ కేంద్రం కోసం నెట్‌లో వెతుకుతుంటే ఓ నంబర్‌ కనిపించింది. ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్య చెబితే సదరు వ్యక్తి ఫోన్‌ పే ద్వారా రూ.10 వేలు పంపాలని లింక్‌ పంపాడు. రూ. 10 పంపే సమయంలో తన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.4,998 మాయమయ్యాయని, మరో లింక్‌ పంపగా మరోసారి రూ. 9,987 మాయమవడం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  


ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు ఓ వ్యక్తి తన మొబైల్‌ నంబర్‌కు రూ.15 వేలు రుణం ఇచ్చిన జస్ట్‌ మనీ ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేశాడు. రుణానికి ప్రతినెలా జస్ట్‌ మనీకి రూ. 1,194 చెల్లిస్తున్నాడు. అతడి జస్ట్‌ మనీ ఖాతా నుంచి ఒకేసారి రూ. 12,497 కట్‌ అవడంతో కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేశాడు. సాంకేతిక కారణాలవల్ల అలా జరిగిందని, కొద్ది రోజులు వేచి ఉండాలని చెప్పారు. రెండు నెలల నుంచి ఎలాంటి స్పందన రాకపోగా ప్రతినెలా వాయిదాలు పెరుగుతున్నాయి. మరో నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి వాయిదాలు వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితుడు పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-04-24T16:33:00+05:30 IST