దళిత బంధు ఆగదు

ABN , First Publish Date - 2021-07-31T08:00:10+05:30 IST

దళిత బంధు పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోదని, వంద శాతం అమలు చేసి తీరతామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తాను ఒక్కసారి చెప్పానంటే ఆరు నూరైనా అమలు జరిగి తీరాల్సిందేనన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిమితులను బట్టి.. దశల వారీగా ఏటా రెండు నుంచి మూడు లక్షల..

దళిత బంధు ఆగదు

    • ఆరు నూరైనా అమలు చేసి తీరతాం..
    • కేసీఆర్‌ ఒకసారి చెప్పాడంటే అంతే
  • ఏటా 2-3 లక్షల కుటుంబాలకు 10 లక్షలు
  • ఏడాది క్రితమే పథకం మొదలు కావాల్సింది
  • కరోనా సంక్షోభం వల్ల ఆలస్యమయింది
  • తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు లైన్‌లో పడ్డది 
  • ప్రజలే దానిని కాపాడుకుంటారు
  • ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం కశ్మీర ఖండమే
  • చేనేత, దళిత బీమా పథకాల అమలుకు..
  • ఇంకా కొంత సమయం పడుతుంది
  • రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవు
  • జానా మాట తప్పి.. సాగర్‌లో పోటీ చేశారు
  • పెద్దిరెడ్డి నాకు సన్నిహితుడు: సీఎం కేసీఆర్‌

ఇన్నాళ్లూ దేశమంతా దోచి దళితులకే పెట్టినట్లు.. ఇతరులు అసూయ పడేట్లుగా ప్రచారం చేశారు. కానీ.. వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. దళితులు అలా మగ్గిపోవడం సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి మంచిదికాదు. దీనిని పరిష్కరించే బాధ్యత మనందరిపైనా ఉంది. కులం, మతం, జాతులకు అతీతంగా పేదలను ఆదుకోవడంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది.

సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): దళిత బంధు పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోదని, వంద శాతం అమలు చేసి తీరతామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తాను ఒక్కసారి చెప్పానంటే ఆరు నూరైనా అమలు జరిగి తీరాల్సిందేనన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిమితులను బట్టి.. దశల వారీగా ఏటా రెండు నుంచి మూడు లక్షల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. వాస్తవానికి ఏడాది క్రితమే ఈ పథకం ప్రారంభం కావాల్సిందని, కరోనా సంక్షోభం కారణంగా ఆలస్యమయిందని తెలిపారు. శుక్రవారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి, హుజూరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత స్వర్గం రవి తదితరులు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా ఆలోచన చేస్తూ సామాజిక అవసరాలను గుర్తించి పని చేసుకుంటూ పోతోంది. అందులో భాగంగానే దళిత బంధు పథకానికి ఒక స్వరూపం ఇచ్చి అమలు చేయాలని అధికారులకు చెప్పినం.


దానికి ఒకడు కా అంటే ఇంకొకడు కీ అంటున్నడు. బాంబు పడ్డట్టు అదిరి పడుతున్నరు. ఎందుకంత భయం? దళిత బంధు పథకం ఎవడైనా ఆపుతడా? ఎట్ల ఆపుతరు? కేసీఆర్‌ ఒకసారి చెప్పిండంటే ఆరు నూరైనా ఆగదు. వంద శాతం అమలు చేసి తీరుతం’’ అని అన్నారు. పేరుకు దళిత జనాభా 15 శాతం అని పెట్టారని, కానీ.. లెక్కలు తీస్తుంటే 18 నుంచి 19 శాతం వరకూ కనపడుతోందని తెలిపారు. అందుకే డబ్బు ఎక్కువ అవసరమయి.. రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పానన్నారు. దీనిని కూడా కొంత మంది జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు.  


ప్రజలు అమాయకంగా లేరు.. 

‘‘తెలంగాణ రాష్ట్రం లైన్లో పడింది. ప్రజలు దీనిని పోగొట్టుకోరు. వారు అంత అమాయకంగానూ లేరు. నల్లటిదేదో, తెల్లటిదేదో వారికి తెలుసుు. తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ప్రజలు దీనిని కాపాడుకుంటారు. దళిత బంధు కార్యక్రమం ఒక గొప్ప పథకం. అందరూ దీనికి మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలి. చేనేత, దళిత బీమా పథకాల అమలుకు ఇంకా కొంత సమయం పడుతుంది. రైతు బీమా చేపట్టడానికి సంవత్సర కాలం పట్టింది. వ్యవసాయ శాఖలో రైతు బీమా తరహాలోనే చేనేత, దళిత సంక్షేమ శాఖల్లోనూ బీమా అమలు కోసం వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించాం. ఉద్యమం చివర్లో తూతూ మంత్రంగా జాయిన్‌ అయినోళ్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింత పటిష్టమవుతుంది. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ.. కశ్మీర ఖండమే అవుతుంది.


దళితుల కోసం బడ్జెట్‌లో వెయ్యి కోట్లు  

తర తరాలుగా దోపిడీకి, వివక్షకు గురైన దళితుల కోసం మార్చిలోనే బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు పెట్టాం. దళిత బంధు పథకం ఏడాది ముందే మొదలు కావాల్సింది, కరోనాతో రాష్ట్రం నష్టపడి ఆలస్యమైంది. పెద్దలిచ్చిన ఆస్తులు లేక, వివక్షను, పేదరికాన్ని ఎదుర్కొంటూ రెక్కలే ఆస్తులుగా ఉన్న దళితులు పైకి రావాలంటే అద్భుతం జరగాల్సిన పరిస్థితి ఉంది. చాలా ఏళ్ల కిందట ప్రపంచ వ్యాప్తంగా 165 జాతుల అణిచివేతకు మూలాలపై మా మిత్రులతో కలిసి సెంటర్‌ ఫర్‌ సెబాల్టన్‌ స్టడీ్‌సతో అధ్యయనం చేశాం. ఇండియన్‌ దళిత్‌ కమ్యూనిటీపైనా అధ్యయనం జరిగింది. ఇన్నాళ్లూ దేశమంతా దోచి దళితులకే పెట్టినట్లు.. ఇతరులు అసూయ పడేట్లుగా ప్రచారం చేశారు. కానీ.. వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇప్పటికీ ఏ ఊరికి వెళ్లి అడిగినా కడుపేదలు ఎవరని అడిగితే దళితులేనన్నది కనిపిస్తుంది. దళితులు అలా మగ్గి పోవడం సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి మంచిదికాదు.


దీనిని పరిష్కరించుకునే బాధ్యత మనందరిపైనా ఉంది. కులం, మతం, జాతులకు అతీతంగా పేదలను ఆదుకోవడంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవు. దేశ తలసరి ఆదాయానికి దాదాపు రెట్టింపు ఉన్న తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా ధనిక రాష్ట్రమే. పెద్దిరెడ్డి నాకు సన్నిహిత మిత్రుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి మంత్రులం అయ్యే వరకూ కలిసి పనిచేశాం. తెలంగాణ రాష్ట్రం సాగిస్తున్న ప్రగతి ప్రస్థానంలో ఆయన చేదోడు ఎంతగానో ఉపయోగపడుతుంది. చేనేత వర్గం నుంచి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటూ ప్రజా సంక్షేమానికి పాటుపడాలన్న ఉద్దేశంతో స్వర్గం రవి టీఆర్‌ఎ్‌సలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘ప్రధాన ప్రతిపక్ష నేతగా జానారెడ్డి ఉన్నప్పుడు.. రెండేళ్ల నాటికి 24 గంటల కరెంటు ఇస్తానని అసెంబ్లీలో చెప్పాను. ఇది జరిగితే గులాబీ కండువా కప్పుకొని నాకే ప్రచారం చేస్తానని జానారెడ్డి చెప్పారు. కానీ, జానారెడ్డి తన మాట తప్పి నాగార్జునసాగర్‌లో పోటీ చేశారు’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, తదితరులు పాల్గొన్నారు. 


‘దళితబంధు’పై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలు 

హైదరాబాద్‌, జూలై 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకంపై హైకోర్టులో శుక్రవారం రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. జనవాహిని పార్టీ, జైస్వరాజ్‌ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్‌ పార్టీలు ఈ వ్యాజ్యాలు వేశాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉపఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఈ పథకాన్ని ప్రకటించారని పిటిషన్లలో ఆరోపించాయి. ప్రభుత్వ నిధులతో చేపట్టే పైలట్‌ ప్రాజెక్ట్‌ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నాయి.

Updated Date - 2021-07-31T08:00:10+05:30 IST