దళిత బంధు పథకం లబ్ధిదారులందరికీ దళిత బీమా

ABN , First Publish Date - 2021-07-27T08:03:54+05:30 IST

దళిత బంధు పథకం లబ్ధిదారులకు కొత్తగా ‘దళిత బీమా’ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

దళిత బంధు పథకం లబ్ధిదారులందరికీ దళిత బీమా

  • ప్రభుత్వ లైసెన్సులిచ్చే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు
  • ఎరువులు, వైన్‌ షాపులు, రైస్‌ మిల్లులు తదితరాల్లో..
  • పారిశ్రామిక, వ్యాపార, ఉపాధి రంగాల్లో సాయం
  • అసైన్డ్‌ సహా అన్ని భూముల సమస్యలకు పరిష్కారం
  • శాశ్వత ప్రాతిపదికన ‘దళిత రక్షణ నిధి’ ఏర్పాటు
  • దళితులు వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందాలి
  • దళిత బంధు పథకం కాదు.. ఉద్యమంలా సాగాలి
  • హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దు
  • నియోజకవర్గ ప్రతినిధులతో సదస్సులో సీఎం కేసీఆర్‌

‘‘తెలంగాణ దళిత బంధు అనేది కేవలం ఒక కార్యక్రమమే కాదు. ఇదొక ఉద్యమం. 

సర్కారు అందించే ఆర్థిక సాయంతో దళితులు తమకిష్టమైన పరిశ్రమను, ఉపాధిని ఎంచుకోవచ్చు.

దళిత బంధు పథకం లబ్ధిదారులకు కొత్తగా ‘దళిత బీమా’ పథకాన్ని కూడా తీసుకొస్తాం.

హుజూరాబాద్‌ ప్రతినిధులు సాధించే విజయం మీదనే.. యావత్‌ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉంటది.

- సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): దళిత బంధు పథకం లబ్ధిదారులకు కొత్తగా ‘దళిత బీమా’ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. రైతు బీమా లాగే పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసి దళిత బీమాను అమలు చేస్తామన్నారు. మంత్రి సహా దళిత ప్రజా ప్రతినిధులు, ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఈ దిశగా కార్యాచరణపై కసరత్తు చేయాలని ఆదేశించారు. ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించుకొని, కొంచెం ఆలస్యమైనా దళిత బీమాను అమలు చేసుకుందామన్నారు. ‘తెలంగాణ దళిత బంధు’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో దళితులు తమకిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకోవచ్చని అన్నారు. తద్వారా తెలంగాణ దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల వద్దకే అప్పు కోసం వచ్చేలా ఆర్థిక సాధికారత సాధించాలని అభిలషించారు. ‘తెలంగాణ దళిత బంధు పథకం’పై ప్రగతి భవన్‌లో సోమవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సదస్సు రాత్రి 7 గంటల వరకు 8 గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగింది. 


ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను అమల్లోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం దళితాభివృద్ధి కోసం చేస్తున్న చరిత్రాత్మక కృషికి విద్యావంతులైన దళిత సమాజం కదిలి రావాలని పిలుపునిచ్చారు. దళితుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా దళిత బంధు పథకం అమలు సందర్భంగా మూడు దశలను పాటించాలన్నారు. దళితుల అసైన్డ్‌, గ్రామకంఠం తదితర భూ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, దళితవాడల్లో మౌలిక వసతులను సంపూర్ణ స్థాయిలో మెరుగుపరిచి, దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న దళిత బంధు పథకం  విజయవంతం కోసం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులంతా పట్టుబట్టి పని చేయాలన్నారు. దళితులను ఆర్థిక వివక్ష నుంచే కాకుండా, సామాజిక వివక్ష నుంచి కూడా దూరం చేసి.. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ‘‘తెలంగాణ దళిత బంధు అనేది కేవలం ఒక కార్యక్రమమే కాదు. ఇదొక ఉద్యమం. హుజూరాబాద్‌ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీదనే.. యావత్‌ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉంటది’’ అని కేసీఆర్‌ అన్నారు. 


కక్షలు, కార్పణ్యాలు పోవాలి..

‘‘మనలో కక్షలు, కార్పణ్యాలు ద్వేషాలు పోవాలె. పరస్పర విశ్వాసం పెరగాలె. ఒకరికొకరం సహకరించుకోవాలె. దళితవాడల్లో ఇప్పటికే నమోదై ఉన్న పరస్పర కేసులను పోలీస్‌ స్టేషన్లలో వాపస్‌ తీసుకోవాలె. దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరమవుతారు. ఈరోజు సదస్సులో పాల్గొన్న వాళ్లంతా, హుజూరాబాద్‌లో విజయం సాధించి, ముందు రోజుల్లో, తెలంగాణవ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలె. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని, అంటరానితనం పేరుతో ఊరవతల ఉంచి, ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరం. మహిళలను జెండర్‌ పేరుతో అనుత్పాదక రంగానికే పరిమితం చేయడం కూడా దుర్మార్గం. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఎరువుల దుకాణాలు, మెడికల్‌ షాపులు, రైస్‌ మిల్లులు, వైన్స్‌ షాపులు తదితర ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండే రంగాల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే ఇతర రంగాలను కూడా గుర్తించాలి. వాటిలో దళితులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. పవర్‌ టిల్లర్‌, హార్వెస్టర్‌, వరి నాటు వేసే వ్యవసాయ యంత్రాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కోళ్ల పెంపకం, టెంట్‌ హౌజ్‌, డెయిరీ పరిశ్రమ, ఆయిల్‌ మిల్లు, పిండి మిల్లు, సిమెంట్‌ ఇటుకల పరిశ్రమ, హోటల్‌, స్టీల్‌ సిమెంట్‌ వంటి బిల్డింగ్‌ మెటీరియల్‌ షాప్స్‌, ఫొటోగ్రఫీ వీడియోగ్రఫీ, సెల్‌ ఫోన్‌ షాప్స్‌, మొబైల్‌ టిఫిన్‌ సెంటర్స్‌, హోటల్స్‌, క్లాత్‌ ఎంపోరియం, ఫర్నిచర్‌ షాప్‌ వంటి పలు రకాల ఉపాధి, పరిశ్రమ, వ్యాపార రంగాలను గుర్తించి, వారి వారి ఇష్టాన్ని బట్టి, దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.


హుజూరాబాద్‌లో వారంలోగా స్పెషల్‌ డ్రైవ్‌

దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం, లబ్ధిదారుని భాగస్వామ్యంతో శాశ్వత ప్రాతిపదికన దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తాం. ఈ నిధిని ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణతో లబ్ధిదారుల కమిటీలతో నిర్వహిస్తాం. ప్రతి ఏటా కనీస డబ్బును జమ చేస్తూ నిరంతరంగా కొనసాగిస్తూ ఆర్థికంగా మరింత పటిష్టంగా నిలదొక్కుకునే దిశగా వినియోగించుకుంటాం. దళిత జాతి సముద్ధరణలో భాగంగా దళిత వాడల్లో మిగిలి ఉన్న తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు వెంటనే పూర్తి చేయాలి. రాష్ట్రంలోని దళితుల స్వాధీనంలో ఉన్న గ్రామ కంఠం భూముల జాబితా తయారు చేయాలి. దళితులకే హక్కులు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి. హుజూరాబాద్‌లో వారం రోజుల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి, అసైన్డ్‌ భూముల సమస్యలు సహా దళితులకు సంబంధించిన అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించాలి. దళిత ప్రజల డిజిటల్‌ సిగ్నేచర్‌ వంటి పెండింగ్‌ సమస్యలన్నీ గుర్తించి, వారిని కలెక్టర్‌ తన ఆఫీసుకు పిలిపించుకొని పరిష్కరించాలి. దళితవాడల స్థితిగతులను తెలియజేసేలా ప్రొఫైల్‌ తయారు చేయాలి.


జాగాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణానికి సాయం

హుజూరాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దు. ఖాళీ జాగాలు ఉన్న వారికీ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తది.  నియోజకవర్గంలోని దళిత వాడల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించాలి. నివేదిక తయారు చేసి అధికారులకు అందజేస్తే వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం అందిస్తుంది. రేషన్‌ కార్డులు, పింఛన్లు సహా అన్ని రకాల సమస్యలను గుర్తించి అధికారులకు నివేదిక అందజేయాలి. దళిత బంధు పథకం ద్వారా లద్ధి పొందే అర్హులకు గుర్తింపు కార్డులను అందిస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. దళితబంధు పథకంలో ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులుంటే ప్రతినిధులు సూచించాలని ప్రతినిధులను కోరారు. ఈ పథకంపై మీ కుటుంబ సభ్యులు ఏమని చర్చించుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. సీఎం అందించే ఆర్థిక సాయం ద్వారా దళిత జాతి అభివృద్ధి చెంది, పది మందికి ఆదర్శంగా నిలిచినప్పుడే వివక్షను అధిగమించినట్లవుతుందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. దళిత బంధు పథకం ద్వారా తెలంగాణ దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరుగుతారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకట్‌, సీపీఐ నేత బాలనర్సింహ మాట్లాడారు. 


దళిత బంధుతో యజమానులం అవుతాం..

ట్రాక్టర్‌ డ్రైవర్‌ను అయిన తాను దళిత బంధు పథకంలో ఆర్థిక సాయం అందితే ట్రాక్టర్‌ కొనుక్కొని స్వయంగా నడుపుకొంటానని వీణవంక మండలం కిష్టంపేట గ్రామ నివాసి కల్లెపల్లి సమ్మయ్య ముఖ్యమంత్రితో అన్నారు. కాగా, కార్‌ డ్రైవర్‌ అయిన తాను టాక్సీ మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కొనుక్కొని స్వయంగా కిరాయిలకు తిప్పుకొంటానని లస్మక్కపల్లి గ్రామవాసి దాసారపు చిరంజీవి అన్నారు. మెడికల్‌, జనరల్‌ స్టోర్స్‌ షాపు పెట్టుకుంటానని దరిపల్లి తిరుమల చెప్పడంతో ఆమెను ముఖ్యమంత్రి అభినందించారు. డోజర్‌ కొనుక్కుంటానని ఒకరు, డెయిరీ ఫామ్‌ పెట్టుకుంటానని మరొకరు, కిరాణ షాపు పెట్టుకుంటానని ఇంకొకరు తెలిపారు. ఎవరెవరు ఏయే పనులు చేసుకోవాలనుకుంటున్నారో వారి అభిప్రాయాలను సీఎం వద్ద వ్యక్తపరిచారు. కాగా, సదస్సుకు హాజరైన మహిళలు, యువకులు, ఇతర ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి భోజనం చేశారు. దళిత బంధు పథకం అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వివిధ రంగాలను ఉదహరిస్తూ... సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితాను ఎస్సీ అభివృద్ధి శాఖ సదస్సులోని ప్రతినిధులకు అందించింది. ఈ సదస్సులో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, హరీశ్‌రావు, దళిత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వివిధ శాఖ ముఖ్య కార్యదర్శులు, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన 450 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T08:03:54+05:30 IST