వెలుగులో చీకట్లు

ABN , First Publish Date - 2021-07-26T07:49:57+05:30 IST

రాష్ట్రంలో వెలుగు పథకంలో పనిచేస్తున్న విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్లు(వీవోఏ) ఉద్యోగాలకు ప్రభుత్వం మరోసారి ఎసరు పెట్టింది.

వెలుగులో చీకట్లు

  • జీతం పెంచినట్లే పెంచి కొలువుకే ఎసరు 
  • వెలుగు వీవోఏలకు ఉద్వాసన!
  • పనితీరు ఆధారంగా గ్రేడింగ్‌
  • సీ, డీ గ్రేడ్‌ వచ్చిన 2,833 మందిపై వేటు
  • మూడేళ్లు పూర్తి కాకుండానే తొలగింపు
  • 30 కంటే తక్కువ సంఘాలున్నా ఇంటికే
  • 27 వేల సిబ్బంది భవిత ప్రశ్నార్థకం
  • పోరాటానికి నడుం బిగించిన వీవోఏలు
  • ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు
  • అప్పటికీ దిగిరాకుంటే సీఎం ఇంటి ముట్టడే


జీతం పెంచినట్టే పెంచి.. తమ ఉద్యోగాలకే ఎసరు పెట్టేందుకు జగన్‌ సర్కారు ప్రయత్నిస్తోందని వీవోఏలు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,583 మంది వీవోఏలు వైసీపీ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. తదుపరి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనకు సన్నద్ధమవుతున్నారు. అప్పటికీ దిగిరాకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వెలుగు పథకంలో పనిచేస్తున్న విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్లు(వీవోఏ) ఉద్యోగాలకు ప్రభుత్వం మరోసారి ఎసరు పెట్టింది. 2012 నుంచి అరకొర వేతనాలతో పనిచేస్తున్న వీవోఏలకు మరోసారి ఉద్యోగ గండం ఎదురుకానుంది. 2020-21లో పనితీరు  ఆధారంగా గ్రేడింగ్‌ ఇచ్చి, సీ, డీ గ్రేడ్‌ వచ్చిన 2,833 మందిని తొలగించేందుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. దీంతోపాటు ఒక్కో వీవోఏ పరిధిలో కనీసం 30 డ్వాక్రా సంఘాలు ఉండాలని, అంతకంటే తక్కువ సంఖ్యలో ఉంటే పక్కనున్న వీవోఏ పరిధిలోకి విలీనం చేయాలని ఆదేశించారు. దీంతో వీవోఏ పోస్టులు సగానికి కుదించుకుపోయే ప్రమాదమేర్పడింది. అలాగే, గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పరిధిలోకి వీవోఏలను తీసుకొస్తున్నారు. దీంతో కొన్ని రోజుల తర్వాత వీవోఏ పోస్టులన్నీ రద్దవుతాయని, తమ విధులను వలంటీర్లకు అప్పగిస్తారని వీరు ఆందోళన చెందుతున్నారు. వీవోఏలను మూడేళ్ల పాటు ఉద్యోగంలో  కొనసాగిస్తామన్న మాట ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట తప్పి ముందుగానే సాగనంపుతోందని విమర్శిస్తున్నారు. పోరాడి సాధించుకున్న ఉద్యోగాలను కాపాడుకునేందుకు మరోసారి రోడ్డెక్కేందుకు వీరంతా సిద్ధమయ్యారు.

 

2012 నుంచి విధులు..

డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసేందుకు 2012లో ఈ గ్రామ సంఘాల సహాయకుల వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. గ్రామాల్లో గ్రామ సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో వీరు పనిచేస్తున్నారు. ఆయా గ్రామ సమాఖ్యల్లో పొదుపు సంఘాల బలోపేతానికి కృషి చేస్తూ.. గ్రామ సమాఖ్య ఇచ్చే గౌరవవేతనంతో జీవనోపాధి పొందేవారు. ఆయా గ్రామ సమాఖ్యలు తమలో చదువుకున్న వారిని గుర్తించి వారికి ఆ బాధ్యతలు అప్పగించాయి. అప్పట్లో నియమించిన సిబ్బంది ఇప్పటికీ పనిచేస్తున్నారు. వీరి నియామకాలపై ఒక నిర్ధిష్ట విధానం ఉండాలని 2012లో సెర్ప్‌ సీఈవో వీవోఏల నియామకాలు, కాలపరిమితి, నిర్వర్తించాల్సిన విధులపై ఒక సర్క్యులర్‌ జారీచేశారు. పదోతరగతి పాసైన 18-40 ఏళ్ల మధ్య వయసు వారికి అర్హత కల్పిస్తూ విధి విధానాలు రూపొందించారు.


ప్రతి మూడేళ్లకు వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ సర్క్యులర్‌పై పెద్ద దుమారం రేగింది. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా జీతం ఇవ్వకుండా వీవోఏల నియామకాలపై సెర్ప్‌ సర్క్యులర్‌ ఇవ్వడం వివాదస్పదమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ సర్క్యులర్‌ను నిలిపేసింది. వీవోఏలను నియమించే అధికారం ఆయా గ్రామ సమాఖ్యలకు ఉంటుందని, వయో పరిమితి ఉండదని పేర్కొంటూ మరో మెమో జారీచేసింది. అంతటితో ఆ వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో వీవోఏలకు ప్రయోజనం కల్పించే అనేక సర్క్యులర్లు జారీ అయ్యాయి. వారికి గుర్తింపుకార్డులూ ఇచ్చేందుకు పలు మెమోలు జారీచేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు వీవోఏలకు   రూ.3వేల పారితోషికం ప్రకటించి, గ్రామ సమాఖ్యల నుంచి మరో రూ.2 వేలు కలిపి మొత్తం రూ.5 వేలు ఇచ్చేలా ఆదేశాలిచ్చారు.

 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత...

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో చంద్రబాబు రద్దు చేసిన మూడేళ్లు మాత్రమే కొనసాగాలనే మెమోను అడ్డం పెట్టుకుని వీవోఏలను సాగనంపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతోపాటు వీవోఏలకు జీతాలు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం దిగివచ్చి వారి జీతాలను రూ.10 వేలకు పెంచింది. జీతాలయితే పెంచారు గానీ, దాంతోపాటు వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టే నిబంధనలు తెచ్చారు. వీవోఏలుగా మూడేళ్లు పనిచేసిన వారందరినీ విధుల నుంచి తొలగించి కొత్త వారిని నియమించుకోవాలని, 20-45 ఏళ్ల మధ్య వయసు వారిని వీవోఏలుగా నియమించాలని ఆదేశాలిచ్చారు. ఉద్వాసన ఖాయమవడంతో వీవోఏలు పోరాటాలు చేపట్టారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం 2019 నవంబరు వరకు ఉద్యోగంలో ఉన్న సిబ్బందిని మూడేళ్ల పాటు కొనసాగించి ఆ తర్వాత తొలగిస్తామని ఆదేశాలిచ్చింది. అంటే 2012 డిసెంబరు నాటికి మూడేళ్లవుతుంది. అయితే మూడేళ్ల వరకు    కొనసాగనీయకుండానే గ్రేడ్‌లు, అసె్‌సమెంట్‌ పేరుతో ఏడాదిన్నర ముందే వారిని సాగనంపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  


ఏ, బీ గ్రేడ్‌ల్లో ఉంటేనే ఉద్యోగం..

వైసీపీ సర్కార్‌ 2020-21 సంవత్సరంలో వీవోఏల పనితీరుపై అసె్‌సమెంట్‌ నిర్వహించి ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌లు ఇచ్చింది. టీసీఎస్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా గ్రేడింగ్‌ నిర్వహించారు. జిల్లాల వారీగా ఏరియా కోఆర్డినేటర్‌ క్లస్టర్‌ పరిధిలోని గ్రామ సంఘాల గ్రేడింగ్‌ పట్టికను తయారుచేశారు. ఏరియా కోఆర్టినేటర్లు సమీక్ష నిర్వహించి సీ, డీ గ్రేడ్‌లో ఉన్న వీవోఏలపై చర్యలు తీసుకోవాలని సెర్ప్‌ సీఈవో రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. ఉద్యోగం ఉండాలంటే ఏ లేదా బీ గ్రేడ్‌ సాధించాలి. వీవోఏల పనితీరును గ్రామ సంఘం సాధారణ సమావేశంలో చర్చించి, పనితీరు బాగాలేకుంటే సభ్యుల ఆమోదంతో తొలగించవచ్చని పేర్కొన్నారు. అలాగే, వీవోఏలకు మూడేళ్ల కాలపరిమితి మించరాదని స్పష్టం చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,583 మంది వీవోఏల్లో 564 మందికి ఏ గ్రేడ్‌, 24,186 మందికి బీ గ్రేడ్‌, 2,830 మందికి సీ గ్రేడ్‌, ముగ్గురికి డీ గ్రేడ్‌ ఇచ్చారు. సీ, డీ గ్రేడ్‌లలో ఉన్న 2,833 మందికి ఉద్వాసన తప్పదు. అలాగే, 30 డ్వాక్రా సంఘాల కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో వీవోఏలను రద్దు చేయాలని, ఆ సంఘాల బాధ్యతలు పక్క వీవోఏలకు అప్పగించాలని ఆదేశించారు. వీటితో సగం వీవోఏ పోస్టులు రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వీవోఏల నియంత్రణ బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌తోపాటు గ్రామ వలంటీర్లు ఉన్నారు. గ్రామ వలంటీర్లకు ఈ బాధ్యతలు అప్పజెప్పే పరిస్థితులండటంతో తమ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడిందని వీవోఏలు వాపోతున్నారు. 


పోరాటం ఉధృతం..

తమ ఉద్యోగాలు నిలబెట్టుకునేందుకు పోరాటానికి వీవోఏలు మరోసారి నడుం బిగించారు. గ్రామ సంఘాలకు సేవలు చేస్తున్న తమను ప్రభుత్వ పథకాల అమలుకు వినియోగించుకుంటున్నారని, అందుకే ప్రభుత్వం నుంచి గౌరవవేతనం పొందుతున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం గౌరవవేతనం పెంచినట్లు పెంచి, ఉన్న పోస్టును ఊడగొట్టేందుకు ఆదేశాలిచ్చిందని ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మండిపడ్డారు. కాలపరిమితి సర్క్యులర్‌ రద్దు చేయాలని, గ్రేడింగ్‌, మెర్జ్‌ పేరుతో వేతనాల కోత, వేధింపులు, తొలగింపులు నిలిపేయాలంటూ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాల్లో మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందిస్తున్నారు. అందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తామని, ఆ తర్వాత ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం అప్పటికీ దిగిరాకపోతే రాష్ట్రవ్యాప్తంగా 27 వేల మంది వీవోఏలతో సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-07-26T07:49:57+05:30 IST