డేటింగ్‌ యాప్‌లతో జర భద్రం

ABN , First Publish Date - 2021-10-20T17:12:46+05:30 IST

మొబైల్‌ డేటింగ్‌ యాప్‌లతో జర భద్రంగా ఉండాలని యువతను నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌ పంత్‌ హెచ్చరించారు. నగరానికి చెందిన మహిళ ఒకరు డేటింగ్‌ యాప్‌ బారిన పడి లక్షలాది రూపాయలను పోగొట్టుకున్న

డేటింగ్‌ యాప్‌లతో జర భద్రం

                - యువతకు నగర పోలీస్ కమిషనర్‌ హెచ్చరిక


బెంగళూరు(karnataka): మొబైల్‌ డేటింగ్‌ యాప్‌లతో జర భద్రంగా ఉండాలని యువతను నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌ పంత్‌ హెచ్చరించారు. నగరానికి చెందిన మహిళ ఒకరు డేటింగ్‌ యాప్‌ బారిన పడి లక్షలాది రూపాయలను పోగొట్టుకున్న ఘటన నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. స్నేహం, ప్రేమ ముసుగులో గత కొద్దికాలంగా ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో సైబర్‌ క్రైమ్‌ విభాగాన్ని అప్రమత్తం చేశామన్నారు. గత వారం రోజుల్లోనే ఇలాంటి నాలుగైదు మోసాలు వెలుగుచూశాయన్నారు. ఇలాంటి మోసాలలో ఫిర్యాదు కాని కేసులు కూడా అధికంగానే ఉంటున్నాయన్నారు. బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన 37 సంవత్సరాల వయసున్న మహిళ ఒకరు సోమవారం కేంద్ర విభాగ సైబర్‌క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌లో తాను ఒక యువకుడి చేతిలో రూ. 18.26 లక్షలు మోసపోయినట్లు ఫిర్యాదు చేసిందన్నారు. బెంగళూరు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఈ మహిళకు మొబైల్‌ డేటింగ్‌ యాప్‌లో ఒక అపరిచితుడు పరిచయం అయ్యాడని, వీరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని తెలిపిందన్నారు. తాను విదేశాల్లో ఉంటున్నానని, ఈ మహిళను నమ్మించిన సదరు యువకుడు తాను కష్టాల్లో ఉన్నానని చెప్పి తెలివిగా ఆమె బ్యాంకు ఖాతాల నుంచి పలుమార్లు లక్షలాది రూపాయాలను స్వాహా చేశాడని కమిషనర్‌ వెల్లడించారు. మహిళ వద్ద నుంచి చాకచక్యంగా డబ్బులను కాజేసిన అనంతరం ఈ అపరిచితుడు సదరు యాప్‌ నుంచి తన ఐడెంటిటీని తొలగించాడన్నారు. దీంతో ఇది నకిలీఖాతా అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నామన్నారు. ఈ ఘటనలో యువతి చేసిన ఫిర్యాదు అధారంగా దర్యాప్తు చేపట్టామన్నారు. కాగా మరో డేటింగ్‌ యాప్‌లో నగరంలోని సదాశివనగర్‌కు చెందిన యువతి కూడా రూ.1.95 లక్షలను పోగొట్టుకుందన్నారు. ఆమె కూడా సైబర్‌క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేసిందన్నారు. ఈ యువతికి డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన దీపక్‌ హమీష్‌ అనే వ్యక్తి నీకు లండన్‌ నుంచి అత్యంత ఖరీదైన బహుమతి ఒకటి పంపించాను. నువ్వు కేవలం కస్టమ్స్‌ డ్యూటీ కింద రూ.1.95 లక్షల పంపితే చాలు నీకు కోటిన్నర విలువ చేసే బహుమతి దక్కుతుందని నమ్మబలికాడు. కొద్దికాలంగా డేటింగ్‌ యాప్‌లో పరస్పరం చాటింగ్‌ కూడా చేసుకోవడంతో అతగాడి వలలో పడ్డ యువతి ఇది నిజమని నమ్మి తన బ్యాంకు ఖాతా నుంచి అతను కోరిన మేరకు మొత్తాన్ని పంపించింది. ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే యాప్‌ నుంచి అతని అకౌంట్‌ డిలీట్‌ అయింది. తాను మోసపోయానని గ్రహించిన ఈ యువతి న్యాయం కోరుతూ సైబర్‌ పోలీసులను ఆశ్రయించిందని పోలీస్‌ కమిషనర్‌ కమల్‌ పంత్‌ వెల్లడించారు. ఈ రెండు ఘటనలు డేటింగ్‌ యాప్‌లోనే జరిగాయని అందుకే వీటిపై నగర ప్రజలను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అప్రమత్తం చేసే పనిలో ఉన్నారని ఆయన వివరించారు.

Updated Date - 2021-10-20T17:12:46+05:30 IST