పిల్లర్‌ నెంబర్‌ 222 వద్ద సూట్‌కేసులో శవం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-01-12T12:39:41+05:30 IST

రాజేంద్రనగర్‌లోని పిల్లర్‌నెంబర్‌ 222 వద్ద లభించిన సూట్‌కేసులో

పిల్లర్‌ నెంబర్‌ 222 వద్ద సూట్‌కేసులో శవం.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్/శంషాబాద్‌ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పిల్లర్‌నెంబర్‌ 222 వద్ద లభించిన సూట్‌కేసులో శవం కేసును పోలీసులు ఛేదించారు. శంషాబాద్‌లోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ప్రకాష్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఆదివారం ఉదయం రాజేంద్రనగర్‌ పిల్లర్‌నెంబర్‌ 222 వద్ద సూట్‌కేసులో లభించిన మృతదేహాన్ని చాంద్రాయణగుట్టలో నివాసముండే ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ ఇలియాస్‌ అలియాస్‌ రియాజ్‌ (26)దిగా గుర్తించారు. ఏ1, ఏ2 ఇద్దరూ మైనర్లు. వారు రియాజ్‌కు స్నేహితులు. ముగ్గురూ కలిసి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సాలు చేసేవారు. రియాజ్‌ ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. స్నేహితులు ముగ్గురూ పార్క్‌చేసి ఉన్న ఆటోల్లో బ్యాటరీలను దొంగిలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకునేవారు.


ఏ1, ఏ2, సోహెల్‌ అనే మరో వ్యక్తి కలిసి రియాజ్‌ ఆటోలోని బ్యాటరీని దొంగిలించారు. విషయం తెలుసుకున్న రియాజ్‌ నిందితులను కొట్టి పోలీసులకు అప్పగించాడు. పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటకు వచ్చిన నిందితులు గౌస్‌నగర్‌లో ఉండే లలిత అనే మహిళకు చెందిన వాహనంలోని బ్యాటరీని దొంగిలించారు. విషయం తెలుసుకున్న రియాజ్‌ లలిత ఇంటికి వెళ్లి బ్యాటరీకి సంబంధించి రూ.4 వేలు ఇప్పిస్తానని చెప్పాడు. ఏ1, ఏ2లు కూడా డబ్బులు చెల్లించడానికి అంగీకరించారు. ఏ1 తన వంతుగా రూ.2 వేలు చెల్లించగా, ఏ2 ఇవ్వలేదు. దీంతో రియాజ్‌కు, ఏ2కు మధ్య వివాదం చెలరేగింది. ఏ2, ఏ1 మరో నిందితుడు సోహెల్‌తో కలిసి రియాజ్‌ను అంతమొందించాలని పథకం రూపొందించారు. ఈ నెల 8న ఏ1, ఏ2, సోహెల్‌ మద్యం తాగడానికి ఆటోలో వివిధ ప్రాంతాల్లోని వైన్స్‌ షాపులకు తిరుగుతూ రియాజ్‌కు కూడా మద్యం తాగించారు.


అతడిని పహడీ షరీఫ్ షహీన్‌నగర్‌ బస్తీలో ఇర్పాన్‌ ఉండే ఇంటికి తీసుకెళ్లారు. ఏ1, ఏ2, సోహెల్‌ (26), ఇర్పాన్‌ (27) ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తమ చెల్లిని ఎందుకు వేధిస్తున్నావని రియాజ్‌తో గొడవపడ్డారు. ఇర్ఫాన్‌ తల్లి తయ్యబా కూడా వారితో జత కలిసింది. అందరూ కలిసి రియాజ్‌ను కర్రలతో కొట్టి ఇంట్లోనే హత్య చేశారు. రక్తపు మరకలను పూర్తిగా శుభ్రం చేసి శవాన్ని వారి ఇంట్లోని పాత సూట్‌కేసులో పెట్టారు. ఆ సూట్‌కేసును ఏ1, ఏ2లు ఆటోలో తీసుకొని రాజేంద్రనగర్‌ పిల్లర్‌ నెంబర్‌ 222 వద్దకు తీసుకొచ్చి అక్కడ చెత్తకుప్పలో పడేసి పారిపోయారు. ఈ కేసులో పోలీసులు ఏ1, ఏ2లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. 

Updated Date - 2021-01-12T12:39:41+05:30 IST