ఏం పిల్లడా.. మళ్లీ వస్తవా!

ABN , First Publish Date - 2020-08-05T08:38:18+05:30 IST

‘ఏం పిలడో ఎల్దమొస్తవా’ అని పట్టిపట్టి అడిగి, వ్యవస్థలను నిలదీసిన స్వరం మూగబోయింది. ‘చెవుల పిల్లుల చేత శంఖారావం’ చేయించిన ఆ గళం ఆగిపోయింది. పులుల్ని మింగిన గొర్రెలను, కత్తులు ...

ఏం పిల్లడా.. మళ్లీ వస్తవా!

  • వంగపండు అస్తమయం
  • గజ్జె  ఘొల్లుమంది
  • 3 నెలలుగా అనారోగ్యం.. గుండెపోటుతో కన్నుమూత
  • ఉత్తరాంధ్రలో ఉద్యమ కవి.. తెలుగునాట ఊరేగిన పాట
  • సరళ బాణీతో సంచలనాన్నే రేపిన ‘ఏం పిలడో ఎల్దమొస్తవా’
  • ‘భూమి బాగోతం’ ప్రేరణతోనే ఏపీలో మునసబు వ్యవస్థ రద్దు!


‘ఏం పిలడో ఎల్దమొస్తవా’ అని  పట్టిపట్టి అడిగి, వ్యవస్థలను నిలదీసిన స్వరం మూగబోయింది. ‘చెవుల పిల్లుల చేత శంఖారావం’ చేయించిన ఆ గళం ఆగిపోయింది. పులుల్ని మింగిన గొర్రెలను, కత్తులు దులపరించే చిలకలనూ సృష్టించి... వాటితో వ్యవస్థలపై రణం ప్రకటించిన ఆ కలం ప్రవాహం నిలిచిపోయింది.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను పాటతో ఉర్రూతలూగించిన ఉత్తరాంధ్ర ప్రజాకవి వంగపండు ప్రసాదరావు తుది శ్వాస వదిలారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. మూడు నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.


ఆ నిద్రలోనే హృద్రోగ సమస్యలు తలెత్తాయి. తనకు గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకుచెప్పారు. ఆ తరువాత కొద్దిసేపట్లోనే తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల సాంస్కృతిక ఉద్యమజీవితం గడిపిన వంగపండు మరణవార్త ఆయన అభిమానులను, కళాకారులను దుఃఖంలో ముంచెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారిక లాంచనాలతో పార్వతీపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. వంగపండుకు భార్య విజయలక్ష్మి, కుమార్తె ఉషా, కుమారులు పురుషోత్తం, దుష్యంత్‌ ఉన్నారు. వీరు కాకుండా వరుసకు మనవ డైన సారంగిపాణిని దత్తత తీసుకున్నారు. ఉషా ప్రస్తుతం రాష్ట్రసాంస్కృతిక శాఖ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.

 

రాజిల్లిన సినీ గీతం..

విప్లవ కథాంశంతో 1986లో విడుదలయిన ‘ఆర్ధరాత్రి స్వతంత్రం’ సినిమాతో వంగపండు సినీప్రస్థానం ప్రారంభమయింది. ఈ చిత్రంలోని ’ఏం పిలడో ఎల్దమొస్తవా..’ అనే పాట ఆ కాలంలో సంచలనం రేపింది. ఇప్పటిదాకా 30 వరకు సినిమా పాటలు రాశారు. కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. ఆంధ్రా యూనివర్సిటీ సాంస్కృతిక విభాగంలో ప్రస్తుతం ఆయన గెస్ట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తూ,  వర్సిటీ క్వార్టర్స్‌లోనే ఉంటున్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఈ మధ్యనే పార్వతీపురంలోని స్వగృహానికి వచ్చేశారు. 

విజయనగరం, ఆంధ్రజ్యోతి


విప్లవ కలం... ఉద్యమ గళం! ఇదీ వంగపండు జీవన ప్రస్థానం

నెత్తిన టోపీ, కళ్లజోడు, మెడలో తువ్వాలు, ముఖంపై చెరగని నవ్వు... ఇదీ వంగపండు ఆహార్యం! కాళ్లకు గజ్జె కట్టి, చేతితో మువ్వలుపట్టి... పాడుతూ, ఆడుతూ చేసే కళా విన్యాసం వంగపండుకు ప్రత్యేకం. ఈ వాగ్గేయ సంప్రదాయాన్ని అన్నమయ్య తరువాత తిరిగి అందిపుచ్చుకున్న కళాకారులు గద్దర్‌, వంగపండు. గద్దర్‌ తెలంగాణ ప్రాంతంలో పాటను ఉర్రూతలూగిస్తే.... కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గానాలకుగజ్జె కట్టి వంగపండు చిందేయించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో చినతల్లి, జగన్నాఽథం దంపతులకు 1943లో వంగపండు జన్మించారు. గ్రామాల్లో పాడుకునే పాటలను ఆలపిస్తూ ఆయన బాల్యం గడిచింది. ఆ కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఉద్యమాల ప్రభావం బలంగా ఉండేది. చదువుకొనే రోజుల్లోనే ఈ ప్రభావానికి ఆయన గురయ్యారు. ఐటీఐ వరకు చదివి విశాఖపట్నం షిప్‌యార్డులో ఉద్యోగంలో చేరారు.


అక్కడ ఉండగానే ఉత్తరాంధ్ర విప్లవ నాయకుల్లో ఒకరైన ఆదిభట్ల కైలాసంతో పరిచయం, నక్సలైట్‌ నాయకుడు కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడిన సాన్నిహిత్యంతో ఉద్యమాలవైపు ఆకర్షితులయ్యారు. శ్రీశ్రీ, కాళీపట్నం రామారావు, ఐవీ సాంబశివరావు, రా.వి.శాస్ర్తి, చలసాని ప్రసాద్‌, భూషణం మాస్టారు వంటి ప్రసిద్ధ రచయితలతో ఉన్న స్నేహం ఆయనను కళారంగంలో ఎన్నో ప్రయోగాలు చేసేలా పురిగొల్పింది. ఈ క్రమంలో గద్దర్‌తో కలిసి 1972లో జననాట్యమండలిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపండు. అనంతకాలంలో జననాట్యమండలి 1992లో ప్రభుత్వ నిషేధానికి గురయింది. ఉద్యమానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాననే భావనతో 1993లో తన ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించారు. పూర్తికాలం జానపదవాగ్గేయకారునిగా తక్కినజీవితమంతా గడిపారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు చేసే పనిలో శ్రమను మరవడానికి పాడుకొనే పాటల్లోని కవితా విలువలను ఆయన స్వీకరించారు. దానికి ఉత్తరాంధ్ర మాండలికాన్ని జోడించి పాటను పరుగులు పెట్టించారు. సామాన్య జనానికి కూడా అర్థమయ్యేలా ఉండే పాటలతో వ్యవస్థలోని అన్యాయాలను, ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపేవారు. నాయుడు, కరణం, మునసబు వ్యవస్థ సాధారణ జనాన్ని ఎలా పట్టి పీడిస్తున్నది ’భూమి బాగోతం’లో అక్షరరూపమిచ్చారు. ఈ నాటిక వేల ప్రదర్శనలను పొందిం ది. అంతేకాదు, టీడీపీ ఆవిర్భవించి, ఎన్టీఆర్‌ సీఎం అయ్యాక ఈ వ్యవస్థను రద్దు చేయడం గమనార్హం. వంగపండు 300కు పైగా పాటలు రచించారు. 


సమైక్యాంధ్రకు జైకొట్టి..

రాష్ట్ర విభజనను వంగపండు తీవ్రంగా వ్యతరేకించారు. రెండు రాష్ట్రాలుగా విభజిస్తే ఆంధ్రా ప్రజలు నష్టపోతారని ఆయన భావించారు. దీనిపై తన భావాలను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లారు. ‘విడదీయ వద్దు.. కలిసుంటే కలదు సుఖం’ అంటూ నినదించారు. ఈ పిలుపుతో పాటలు కూర్చి వివిధ జిల్లాల్లో ప్రదర్శనలిచ్చారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి, కృష్ణా జిల్లాలో విరివిగా తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చారు. 


ఉద్దానం మూగబోయింది

‘‘ఉత్తరాంధ్ర యాసను, జీవ భాషను కవితా గేయాలుగా అల్లిన మహాకవి వంగపండు. ఆయన నిరాడంబరుడు, సాధు స్వభావుడు, విప్లవకవి.’’

 గోరటి వెంకన్న, కవి గాయకుడు

‘‘ఉద్దానం జానపదం మూగబోయింది..’’

- బద్రి కూర్మారావు, జానపద కళాకారుడు

Updated Date - 2020-08-05T08:38:18+05:30 IST