అప్పు మీద అప్పు.. రాష్ట్రానికి ముప్పు

ABN , First Publish Date - 2020-06-04T06:07:29+05:30 IST

సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకును పదిల పరుచుకోవడానికి పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధిని నిర్వీర్యం చేసింది వైకాపా ప్రభుత్వం. రెవెన్యూ లోటుతో అల్లల్లాడుతున్న రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు...

అప్పు మీద అప్పు.. రాష్ట్రానికి ముప్పు

విచ్చలవిడిగా ఖర్చులు పెంచుకొంటూ పోతున్న ప్రభుత్వం అదే స్థాయిలో ఆదాయం పెంచడానికి ఒక్క మార్గాన్ని కూడా అన్వేషించడం లేదు. అమ్మకం పన్నులు, ఎక్సైజ్ సుంకాలు.. వీటినే సొంతంగా ఆదాయం సమకూర్చుకొనే అతిపెద్ద వనరులుగా చూస్తోంది ప్రభుత్వం. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ రంగాలపై ఖర్చుపెడితేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాగలదు. జేజేలు కొట్టించుకోవాలని ఉన్న ఆదాయం కాస్తా ప్రజలకు పంచిపెట్టి అప్పు మీద అప్పు తెస్తున్నారు. అదే రానున్న రోజుల్లో ముప్పుగా పరిణమించవచ్చు.


సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకును పదిల పరుచుకోవడానికి పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధిని నిర్వీర్యం చేసింది వైకాపా ప్రభుత్వం. రెవెన్యూ లోటుతో అల్లల్లాడుతున్న రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్ర ప్రగతికి పారిశ్రామిక, వ్యవసాయ, సేవా, నిర్మాణ రంగాలు కీలకమైనవి. కానీ వైకాపా వాటిని గాలికి వదిలేసింది. రాష్ట్రంలోవున్న పరిమిత వనరులను ప్రయోజనదాయకంగా మలిచి అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు పంచడంలో ఎవరికీ అభ్యంతరం వుండదు. కానీ ప్రభుత్వం వున్న ఆదాయాన్ని అందరికీ ఇష్టానుసారం పంచి అభివృద్ధిని అటకెక్కించి వున్న భూములు అమ్మి అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి సిద్ధపడింది. అసంబద్ధ విధానాలతో, అనాలోచిత నిర్ణయాలతో అనుత్పాదక రంగాలపై ఖర్చుపెట్టి ఆర్థిక రంగాన్ని నుజ్జునుజ్జు చేసింది. ఆకలి, అవసరాలు తీర్చని పథకాల గురించి పత్రికల్లో పెద్దపెద్ద ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. జనం దాహం తీర్చుకొనే ప్రతి నీటి బొట్టుకి, ప్రజలు తినే ప్రతి అన్నం మెతుకుకి వైఎస్సార్ పేరు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రచారోద్యమం చేపట్టారు. ఏడాది జగన్ పాలన సమస్తం ప్రజాపీడన పరాయణమే. కానీ జగన్ ధీరోదాత్తుడని, ఆయన పాలనలో అంతా సంతోషంగా వున్నారని కీర్తిస్తూ, దేవతా వస్త్రాలు తొడగటానికి ఆయన భజన బృందం క్యూలో నిలబడింది. బ్రహ్మాండం బద్దలు చేసినట్లు సొంత మీడియా భజన తోడైంది.


ఎంతసేపు ఓట్ల వేటకే పాటుపడుతున్నారు తప్ప, ఏడాది నుండి ఆర్థిక రంగాన్ని చక్కదిద్దేందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే దాదాపు రూ.29 వేలకోట్ల వరకు పలు రూపాల్లో ఋణాలు సేకరించినట్లు సమాచారం. ప్రజలు చెల్లించిన పన్నుల డబ్బంతా ఉద్యోగుల జీతభత్యాలకు, ఉచిత హామీలకు, ఋణాలు వడ్డీల తిరిగి చెల్లింపులకే సరిపోవడం లేదు. దాంతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి బయటవేసి గ్రామీణుల ఆదాయాన్ని పెంచేందుకు వనరులు చాలని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది పాలనలో ఆదాయం తగ్గడానికి ప్రభుత్వ వైఫల్యాలే తప్ప కరోనా కారణం కాదు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కానీ, రెవెన్యూ వ్యయంలో కానీ జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం బడ్జెట్ వ్యయాన్ని 11.6 శాతం పెంచింది. అంటే రూ.1.46లక్షల కోట్ల నుండి రూ.1.63లక్షల కోట్లకు పెంచారు. కానీ జగన్ ఏడాది పాలనలో కేవలం 1.80 శాతం పెంచారు. అంటే రూ.1.63 లక్షల కోట్ల నుండి రూ,1.66 లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మొత్తం బడ్జెట్ వ్యయం ఏడాదికి రూ.17 వేల కోట్లకు పెరిగితే జగన్ పాలనలో కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే పెరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పులు 30.70% పెరగగా అదే జగన్ ఏడాది పాలనలో 135% పెంచారు. రెవెన్యూ వ్యయం తెలుగుదేశం హయాంలో 40% పెరిగింది (రూ1.21లక్షల కోట్ల నుంచి రూ1.26లక్షల కోట్లకు పెంచింది). జగన్ ఏడాది పాలనలో రెవెన్యూ వ్యయం 42% పెంచారు.


తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా, సచివాలయ సిబ్బందిగా నియమించి ప్రజాధనం దోచిపెట్టడం వల్లనే రెవెన్యూ వ్యయం పెరిగింది తప్ప ప్రజలకు, ఉద్యోగులకు, సంక్షేమానికి పెద్దగా చేసిందేమీ లేదు. అనేక సంక్షేమ పథకాల్లో భారీకోతలు పెట్టారు, స్కీములు రద్దు చేశారు. వీటి ద్వారా వేల కోట్లు ఆదా అయ్యాయి. గత ఏడాది కేంద్రం నుండి నిధులు పుష్కలంగా వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు, నరేగా నిధులు వచ్చాయి. డివాల్యూషన్ నిధులు, ఇతర నిధులతోపాటు కరోనా నియంత్రణ కోసం కేంద్రం అదనపు నిధులు ఇచ్చినది. వీటినన్నింటిని ఇష్టానుసారం దుర్వినియోగం చేశారు. నాలుగు లక్షల గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జీతాల పేరుతో వైసీపీ కార్యకర్తలకు రూ.4వేలకోట్లు దుర్వినియోగం చేశారు. ఈ మొత్తంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరో 10శాతం పూర్తి అయివుండేది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడానికి, తొలగించడానికి, ఈ విషయంపై కోర్టులో వాదించేందుకు ఖరీదైన లాయర్లని నియమించడానికి వేలకోట్లు దుర్వినియోగం చేశారు.


మూలధనం తగ్గిపోవడం అభివృద్ధి అడుగంటడానికి కారణం. వచ్చిన ఆదాయాన్ని కూడా దుర్వినియోగం చేశారు. సంపద పెంచడానికి చేసిందేమీ లేకపోగా అనుత్పాదక రంగాలపై వ్యయం చేశారు. నీటి ప్రాజెక్టులకు తెలుగుదేశం ప్రభుత్వం కన్నా తక్కువ కేటాయించారు. కేటాయించిన రూ.16,128కోట్లలో రూ.3,566 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. పోలవరానికి తెలుగుదేశం ప్రభుత్వం అడ్వాన్సుగా ఖర్చు పెట్టిన రూ.3,000 కోట్లలో కేంద్రం రీయంబర్సు చేసిన రూ.1,850 కోట్లను కూడా పోలవరానికి ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు, సొంత కాట్రాంక్టర్లకు మళ్లించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి సగటున రూ.24వేల కోట్లు అప్పులు చేస్తే, జగన్ ప్రభుత్వం ఏడాదిలోనే రూ.87 వేల కోట్లు చేసింది.


‘బిల్డ్ ఏపీ’ పేరుతో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విలువైన భూ ములను అమ్మకానికి పెడుతూ ‘సెల్ ఏపీ’ చెయ్యబోతున్నారు. ‘భూములు అమ్మడానికి సిద్ధపడ్డారు, రాష్ట్రం దివాళా తీసిందా’ అని హైకోర్టు ప్రశ్నించడమే ఆర్థిక వ్యవస్థని ఈ ప్రభుత్వం అగాధంలోకి నెట్టిందనడానికి నిదర్శనం. విచ్చలవిడిగా ఖర్చులు పెంచుకొంటూ పోతున్న ప్రభుత్వం అదే స్థాయిలో ఆదాయం పెంచడానికి ఒక్క మార్గాన్ని కూడా అన్వేషించడం లేదు. అమ్మకం పన్నులు, ఎక్సైజ్ సుంకాలు.. వీటినే రాష్ట్రం సొంతంగా ఆదాయం సమకూర్చుకొనేందుకు అతిపెద్ద వనరులుగా చూస్తోంది ప్రభుత్వం. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ రంగాలపై ఖర్చుపెడితేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాగలదు. జేజేలు కొట్టించుకోవాలని ఉన్న ఆదాయం కాస్తా ప్రజలకు పంచిపెట్టి అప్పు మీద అప్పు తెస్తున్నారు. అదే రానున్న రోజుల్లో ముప్పుగా పరిణమించవచ్చు.


జగన్ ఏడాది పాలన రైతుల పాలిట శరాఘాతమైంది. మద్దతు ధర లభించక రాష్ట్రంలో రైతులు రూ.15,000 కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. రైతు భరోసా పథకంలో ప్రతి రైతు రూ.20,000 నష్టపొయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చివుంటే ఒక్కో రైతుకు రూ.లక్షా10 వేలు దక్కేవి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల ప్రతి రైతు రూ.75 వేల దాకా కోల్పోవాల్సి వచ్చినది. ఈ ఏడాది పంటలు బాగానే పండినా ఉత్పత్తులకు మద్దతు ధరలు కల్పించకుండా రైతులను దళారులకు, వ్యాపారులకు వదిలేసింది ప్రభుత్వం.


విభజన సంక్షోభాన్ని తెలుగు దేశం ప్రభుత్వం అభివృద్ధికి ఒక అవకాశంగా మలుచుకొన్నది. ఉన్న వనరుల సాయంతో స్వల్పకాలిక, దీర్ఘకాలిక నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకొని సమ్మిళిత అభివృద్ధికి ప్రణాళికను రూపకల్పన చేసుకొన్నది. 2014–-15లో 9.2 శాతం వున్న వృద్ధిరేటు అందరి కృషితో 2015-–16లో 10.06 శాతంగా, 2016–-17లో 11.7 శాతంగా, 2017–-18లో 11.22శాతంగా, 2018-–19లో 11.2 శాతంగా నమోదు అయింది. అదే సమయంలో భారత్ వృద్ధిరేటు 7.3 మాత్రమే. ఏడాదికేడాది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2014–-15లో రూ.1.28 లక్షల కోట్లు వస్తే 2017–-18 నాటికి రూ.2.53లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో పరిశ్రమల రంగం ఆదాయం 2013-–14లో రూ.1.07 లక్షల కోట్లు వుంటే 2017–-18 నాటికి ప్రభుత్వ కృషితో రూ.1.62 కోట్లకు పెరిగింది. సేవారంగంలో 2013–-14లో సర్వీసు సెక్టరులో ఆదాయం రూ.1.90లక్షల కోట్లు కాగా 2017–-18కి రూ.3.30 లక్షల కోట్లకు చేరింది. ఇలా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అనేక మార్గాలను అన్వేషించి నిరతరం కృషి చేసింది.


వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనలో ఆదాయం లేదు, అభివృద్ధి పడకేసింది. ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ పెంచేశారు. వడ్డీల భారం పెంచారు. గ్రాస్ ఫిస్కల్ కేపిటల్ ఫార్మేషన్‌‍ను నిర్లక్ష్యం చేశారు. పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు ఏర్పాటు కాకుండా టెర్రరిస్టు పాలన సాగించి పెట్టుబడిదారులను తరిమేశారు. పెండింగ్ పారిశ్రామిక రాయితీలు తాము చెల్లించినట్లు జగన్ గొప్పలు చెప్పుకోవడం పచ్చి అబద్ధం. గత ప్రభుత్వ పారిశ్రామిక పెండింగ్ రాయితీలు రూ.3,675కోట్లు 28,083 పరిశ్రమలకు తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది అని జగన్ ప్రభుత్వం 2019 జులైలో విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్న విషయం గుర్తించాలి. తెలుగుదేశం ప్రభుత్వ పెండింగ్ బకాయిలు రూ.4 వేల కోట్లు తాము చెల్లించామని జగన్ చెప్పడం 101వ అబద్ధం అవుతుంది. ఈ మధ్య పతనం దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తున్నట్లు ఒక కథనాన్ని జాతీయ దిన పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించింది. అసమర్థులకు అధికారం ఇచ్చి భవిష్యత్‌ను అంధకారం చేసుకొన్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దివాలా తీయించిన ఘనత జగన్‌‍దే అని చెప్పక తప్పదు.



యనమల రామకృష్ణుడు

శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు

Updated Date - 2020-06-04T06:07:29+05:30 IST