Abn logo
Jul 8 2020 @ 00:00AM

మరోసారి అడగండి!

మానసిక ఒత్తిడి అనేది మనిషిని ఎంతగా నిరాశా నిస్పృహలకు గురిచేస్తుందో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణేకు బాగా తెలుసు. ఐదారేళ్ల క్రితం... ఒకానొక దశలో ఆమెకు కూడా మానసిక ఒత్తిడికి లోనైన అనుభవం ఉంది. దాని నుంచి బయటపడిన తర్వాత 2015లో దీపిక ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’ (టిఎల్‌ఎల్‌ఎల్‌ఎఫ్‌)ను ఏర్పాటుచేసి, మానసిక ఆరోగ్యంపై శిక్షణ శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఎంతోమందికి స్థయిర్యాన్ని అందించి వారు తమ ప్రయత్నం నుంచి బయటపడేలా చేశారు. తాజాగా సహనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో దీపిక ‘దొబారా పూచో’ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.వీడియోలో ఏముంది?

నిజానికి ఈ వీడియోను 2016లోనే ‘దొబారా పూచో’ పేరిట రూపొందించారు దీపికా. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో (సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య నేపథ్యంలో) ఆమె మరోసారి ‘దొబారా పూచో’ హ్యాష్‌ట్యాగ్‌తో వీడియోను పోస్ట్‌ చేశారు. దీనితో పాటు ‘అండర్‌స్టాండింగ్‌ సూసైడ్‌’ పేరిట ఇద్దరు ప్రముఖ మానసిక వైద్యుల (డాక్టర్‌ శ్యామ్‌ భట్‌, డాక్టర్‌ సౌమిత్రీ పథేర్‌)తో తాను చేసిన ఇంటర్వ్యూను (సుమారు 48 నిమిషాల నిడివి) కూడా ఉంచారు. ఇందులో మానసిక ఒత్తిడి, ఆత్మహత్యకు ప్రేరేపించే లక్షణాల గురించి, అలాంటివారికి అందించాల్సిన సహకారం గురించి ఇద్దరు డాక్టర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పలు సందేహాలను నివృత్తి చేశారు. ఇక నాలుగు నిమిషాల ‘దొబారా పూచో’ వీడియోలో నాలుగు వేర్వేరు కథలు మనకు కనిపిస్తాయి. తండ్రీ కొడుకు, వృద్ధ దంపతులు, ఇద్దరు స్నేహితులు, తల్లీ కూతురు... ఇలా ఈ నాలుగు జంటల్లో కూడా ఒక్కొక్కరు మానసిక ఒత్తిడితో బాధపడుతూ కనిపిస్తారు. గుండెల్లో విషాదం గూడుకట్టుకుని కుమిలిపోతున్న వారిని తండ్రీ, భార్య, స్నేహితుడు, తల్లి ఎలా డీల్‌ చేశారనేది ‘దొబారా పూచో’ కథాంశం. వారు అలా ఎందుకు ఉన్నారో మరీ మరీ అడుగుతూ, వారిని ఓదార్చి, హత్తుకోవడం వల్ల విషాదభరితులైన వారికి ఉపశమనం కలిగిస్తారు.


ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు అలాంటి ఓదార్పును కోరుకుంటారనేది మనకు ఈ వీడియో ద్వారా సుస్పష్టంగా అర్థమవుతుంది. మానసిక ఒత్తిడితో ఒంటరిగా ఫీలై, బాధ అనుభవిసున్న వారిని అలా ఎందుకున్నారో మళ్లీ మళ్లీ అడిగి ‘నువ్వు ఒంటరివి కావు’ అనే భావనను కలిగిస్తే తప్పకుండా ఆత్మహత్య ప్రయత్నం నుంచి బయటపడుతారని తెలుస్తుంది. ‘‘అలాంటి వారి పట్ల మరింత సున్నితంగా వ్యవహరిస్తూ, వారికి మానసికంగా స్థయిర్యాన్ని అందించాలి’’ అంటూ ‘దొబారా పూచో’ హ్యాష్‌ట్యాగ్‌తో దీపిక వీడియోను పోస్ట్‌ చేశారు. మానసిక ఆరోగ్యం గురించి తన ఫోరమ్‌ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ ఏడాది దీపికకు ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌’ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘క్రిస్టల్‌ అవార్డ్‌’ కూడా లభించడం విశేషం. మన చుట్టూ నిరాశ నిస్పృహలకు గురైన వారి మానసిక ఆరోగ్యం గురించి పదే పదే అడిగి తెలుసుకోవడం... వారు ఎప్పటికీ ఒంటరివారు కాదని ‘నేనున్నా’ అనే భావనను కలగజేయడం ద్వారా కుంగుబాటులో ఉన్నవారిని బయటకు తీసుకురావొచ్చనేది ‘టిఎల్‌ఎల్‌ఎల్‌ఎఫ్‌’ నినాదం. అందుకోసం ఇప్పటికే రకరకాల శిక్షణా శిబిరాలు, పరిశోధనలు... మేధావులు, విజయాలు సాధించిన వ్యక్తులతో ప్రసంగాలు ఇప్పిస్తూ దీపిక ఈ రంగంలో విశిష్టసేవలు అందిస్తోంది.


Advertisement
Advertisement
Advertisement