Abn logo
Nov 11 2020 @ 03:52AM

జై..జై..ముంబై

Kaakateeya

ముంబై  ముందు కష్టసాధ్యం కాని లక్ష్యం.. అయినా  ఏదో అద్భుతం జరుగుతుందేమోనని ఢిల్లీలో చిన్న ఆశ.. కానీ, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఎటువంటి డ్రామాకూ చోటివ్వలేదు. ఫైనల్‌ చేరే క్రమంలో ఢిల్లీని మూడుసార్లు చిత్తు చేసిన ముంబై.. అంతిమ పోరులోనూ అయ్యర్‌ సేనను మట్టికరిపించింది. గ్రాండ్‌గా ఐదోసారి టైటిల్‌ను సొంతం చేసుకొంది. బౌల్ట్‌ దెబ్బకు ఢిల్లీ తక్కువ స్కోరుకే పరిమితం కాగా.. ఛేదనలో రోహిత్‌ జూలు విదల్చడంతో వార్‌ వన్‌సైడ్‌ అయింది. తొలిసారి ఫైనల్‌ చేరి టైటిల్‌తో మెరవాలనుకున్న ఢిల్లీ ఆశలు అడియాశలయ్యాయి. శ్రేయాస్‌, పంత్‌ అర్ధ శతకాలు వ్యర్థమయ్యాయి. 


ఈ ట్రోఫీతో రెండేళ్లకొకసారి టైటిల్‌ సాధిస్తుందన్న ఆనవాయితీని కూడా ముంబై మార్చేసింది. ‘సరి’ ఏడాదుల్లో విజేతగా నిలవదనే సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసింది. 2010లో ముంబై తుది పోరుకు చేరినా.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ 2020లో మాత్రం జయకేతనం ఎగురవేసింది. అంతేకాకుండా.. ఐదోసారి టైటిల్‌ను అందుకొన్న కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు.


జయహో ముంబై

బుల్లెట్లలాంటి బంతులతో బౌలింగ్‌లో ప్రత్యర్థిని బెంబేలెత్తించి.. పిడుగుల్లాంటి షాట్లతో బ్యాటింగ్‌లో దుమ్మురేపి.. తిరుగులేని ఆటతో ఐపీఎల్‌ బాహుబలి ముంబై ఇండియన్స్‌ మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. మొత్తమ్మీద ఐదోసారి కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పనిలో పనిగా ఇప్పటివరకు వరుసగా రెండుసార్లు కప్‌ను గెలవని లోటును తీర్చుకుంది. టోర్నీ ఆసాంతం డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు సంపూర్ణ న్యాయం చేస్తూ వచ్చిన రోహిత్‌ సేన.. తుది సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పైనా అంతే సాధికారికంగా ఆడింది. మంగళవారం రాత్రి దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో పేస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (3/30) రాణించడంతో తొలుత ఢిల్లీని 156/7 స్కోరుకే పరిమితం చేసింది. అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 68) మెరవడంతో ఎనిమిది బంతులు మిగిలుండగానే 157/5తో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.


రోహిత్‌ సేన ఖాతాలో ఐదో ఐపీఎల్‌ టైటిల్

ఫైనల్లో ఢిల్లీ ఓటమి


 ప్రైజ్‌మనీ

ముంబై ఇండియన్స్‌కు రూ. 20 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 12.50 కోట్లు


దుబాయ్‌: అంచనాలకు అనుగుణంగానే డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరోసారి ధమాకా సృష్టించింది. వరుసగా రెండో టైటిల్‌తో తన రికార్డును తానే తిరగరాసుకుంది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) అర్ధ శతకంతో దుమ్మురేపడంతో.. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 156/7 స్కోరు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 నాటౌట్‌), రిషభ్‌ పంత్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్‌ సెంచరీలు చేశారు. బౌల్ట్‌ (3/30) మూడు వికెట్లతో ఢిల్లీ వెన్నువిరవగా.. కల్టర్‌నైల్‌ (2/29), జయంత్‌ యాదవ్‌ (1/25) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలిచింది. ఇషాన్‌ కిషన్‌ (19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33 నాటౌట్‌) మరోసారి ఆకట్టుకున్నాడు. నోకియా (2/25) రెండు వికెట్లు పడగొట్టగా.. స్టొయినిస్‌ (1/23), రబాడ (1/32)కు చెరో వికెట్‌ దక్కాయి. బౌల్ట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. 


రోహిత్‌ ముందుండి: స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్‌ ముందుండి నడిపించడంతో మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షమైంది. రోహిత్‌ వరుసగా భాగస్వామ్యాలు నెలకొల్పడంతో.. ఢిల్లీ ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేదు. అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే సిక్స్‌తో రోహిత్‌ పరుగుల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ఓవర్‌లో రబాడ బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ డికాక్‌ 4,6,4తో స్కోరు వేగం పెంచాడు. నోకియా 4వ ఓవర్‌లో హిట్‌మ్యాన్‌ 4,6తో చెలరేగాడు. అయితే, ధాటిగా ఆడుతున్న డికాక్‌ (12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20)ను అవుట్‌ చేసిన స్టొయినిస్‌ ఢిల్లీకి బ్రేకిచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ (19) వచ్చీ రాగానే 4,6తో విరుచుకుపడడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై 61/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో ఢిల్లీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ముంబైపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ, ప్రవీణ్‌ వేసిన 9వ ఓవర్‌లో రోహిత్‌ రెండు సిక్స్‌లతో గేర్‌ మార్చాడు. అయితే, ముంబై గెలుపు దిశగా సాగుతున్న సమయంలో రోహిత్‌తో సమన్వయ లోపం కారణంగా సూర్యకుమార్‌ తన వికెట్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇద్దరూ ఒకే ఎండ్‌కు చేరడంతో.. సూర్య క్రీజును వదిలి రనౌట్‌గా వెనుదిరిగాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. అనంతరం ఇషాన్‌ కిషన్‌తో కలిసి హిట్‌మ్యాన్‌ పరుగుల వేటను కొనసాగించాడు. రబాడ వేసిన 12వ ఓవర్‌లో రెండు వరుస బౌండ్రీలతో రోహిత్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. టీమ్‌ స్కోరు శతకం దాటింది. చివరి 30 బంతుల్లో విజయానికి 31 పరుగులు కావాల్సి ఉండగా.. దూబే వేసిన 16వ ఓవర్‌లో ఇషాన్‌ రెండు వరుస బౌండ్రీలు కొట్టాడు. మ్యాచ్‌ను ముగించేలా కనిపించిన రోహిత్‌ను నోకియా క్యాచ్‌ అవుట్‌ చేయడంతో.. మూడో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పొలార్డ్‌ (9), హార్దిక్‌ పాండ్యా (3) స్వల్ప స్కోర్లకే అవుటైనా.. ఇషాన్‌, క్రునాల్‌ మరో 8 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు. 


మెరిసిన అయ్యర్‌, పంత్‌: 22/3తో టాపార్డర్‌ను చేజార్చుకున్న ఢిల్లీ.. పాత కథనే పునరావృతం చేస్తుందా? అని అనిపించింది. కానీ, అయ్యర్‌, పంత్‌ అర్ధ శతకాలతో.. ఆదుకోవడంతో ఢిల్లీ పోరాడగలిగే స్కోరు చేసింది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ముంబై స్మార్ట్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌.. ఆరంభంలోనే గట్టిదెబ్బకొట్టాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఓపెనర్‌ మార్కస్‌ స్టొయిని్‌సను గోల్డెన్‌ డక్‌గా అవుట్‌ చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన అజింక్యా రహానె (2)ను క్యాచ్‌ అవుట్‌ చేశాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన మరో ఓపెనర్‌ ధవన్‌.. బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో మరో బౌండ్రీ బాదాడు. కానీ, రాహుల్‌ చాహర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌.. తన ఎంపికకు న్యాయం చేశాడు. నాలుగో ఓవర్‌ మూడో బంతికి ధవన్‌కు బౌల్ట్‌ షాకిచ్చాడు. పీకల్లోతు కష్టాల్లోపడ్డ ఢిల్లీ బాధ్యతలను అయ్యర్‌, పంత్‌ భుజానికెత్తుకున్నారు. శ్రేయాస్‌ అటాక్‌ చేయడానికి ప్రయత్నించగా.. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న పంత్‌ ఆ తర్వాత తనదైన శైలిలో షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. బౌల్ట్‌  విసిరిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో శ్రేయాస్‌ రెండు బౌండ్రీలు బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కల్టర్‌నైల్‌ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొన్న అయ్యర్‌.. మరో ఫోర్‌ కొట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 41/3తో నిలిచింది. క్రునాల్‌ వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో పంత్‌ రెండు సిక్స్‌లతో ఒక్కసారిగా గేర్‌ మార్చాడు. అయితే, జోరు మీదున్న వీరి భాగస్వామ్యాన్ని కల్టర్‌నైల్‌ బ్రేక్‌ చేశాడు. కల్టర్‌నైల్‌ వేసిన 15వ ఓవర్‌లో రెండు ఫోర్లతో అర్ధ శతకం పూర్తి చేసిన పంత్‌.. అదే ఓవర్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి హార్దిక్‌కు క్యాచిచ్చాడు. దీంతో నాలుగో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 


ఆఖర్లో డీలా: పంత్‌ అవుటైన తర్వాత.. డెత్‌ ఓవర్లలో ముంబై బౌలర్లు పట్టుబిగించడంతో ఢిల్లీ చివరి 5 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే జోడించగలిగింది. బుమ్రా 17వ ఓవర్‌లో అయ్యర్‌ రెండు ఫోర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్న హెట్‌మయెర్‌ (5)ను బౌల్ట్‌ స్లో బంతితో వెనక్కిపంపాడు. ఆఖరి ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ (9) అవుటైనా.. అయ్యర్‌ సిక్స్‌తో స్కోరును 150 మార్క్‌ దాటించాడు. 


గొప్పగా ముగించాం..

ఈ సీజన్‌ను గొప్పగా ముగించాం. లీగ్‌ ఆరంభం నుంచి చివరి వరకూ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయం కోసం తెరవెనుక నుంచి సహకరించిన వారికి ఎక్కువ క్రెడిట్‌ దక్కాలి. లీగ్‌ ఆరంభానికి ముందే తప్పిదాలను సవరించుకోవడంపై దృష్టిసారించాం. ఈ రోజు సూర్యకుమార్‌ స్థానంలో నేనుంటే.. వికెట్‌ను త్యాగం చేసే వాడినైతే కాదు.    

               - రోహిత్‌ శర్మ

200 ఐపీఎల్‌లో రోహిత్‌ ఆడిన మ్యాచ్‌లు


 5 ఐదుసార్లు టైటిల్‌ అందుకొన్న ఏకైక  కెప్టెన్‌గా రోహిత్‌ చరిత్ర. 2013, 2015, 2017, 2019లో కూడా హిట్‌మ్యాన్‌ సారథ్యంలో ముంబై విజేతగా నిలిచింది. 


అత్యధిక పరుగుల వీరుడు కేఎల్‌ రాహుల్‌(పంజాబ్‌)  670


అత్యధిక వికెట్ల ధీరుడు 30 రబాడ (ఢిల్లీ)


వర్థమాన ఆటగాడు దేవదత్‌ పడిక్కళ్‌ (బెంగళూరు)


అత్యంత విలువైన ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌(రాజస్థాన్‌)


స్కోరు బోర్డు

ఢిల్లీ: స్టొయినిస్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 0, ధవన్‌ (బి) జయంత్‌ 15, రహానె (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 2, శ్రేయాస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 65, రిషభ్‌ పంత్‌ (సి) హార్దిక్‌ (బి) కల్టర్‌నైల్‌ 56, హెట్‌మయెర్‌ (సి) కల్టర్‌నైల్‌ (బి) బౌల్ట్‌ 5, అక్షర్‌ పటేల్‌ (సి) సబ్‌-రాయ్‌ (బి) కల్టర్‌నైల్‌ 9, రబాడ (రనౌట్‌/సూర్యకుమార్‌/కల్టర్‌నైల్‌) 0, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 156/7; వికెట్ల పతనం: 1-0, 2-16, 3-22, 4-118, 5-137, 6-149, 7-156; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-30-3, బుమ్రా 4-0-28-0, జయంత్‌ యాదవ్‌ 4-0-25-1, కల్టర్‌నైల్‌ 4-0-29-2, క్రునాల్‌ పాండ్యా 3-0-30-0, పొలార్డ్‌ 1-0-13-0. 


ముంబై: రోహిత్‌ శర్మ (సి) సబ్‌-లలిత్‌ యాదవ్‌ (బి) నోకియా 68, డికాక్‌ (సి) పంత్‌ (బి) స్టొయినిస్‌ 20, సూర్యకుమార్‌ (రనౌట్‌/దూబే/పంత్‌) 19, ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 33, పొలార్డ్‌ (బి) రబాడ 9, హార్దిక్‌ (సి) రహానె (బి) నోకియా 3, క్రునాల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 18.4 ఓవర్లలో 157/5; వికెట్ల పతనం: 1-45, 2-90, 3-137, 4-147, 5-156; బౌలింగ్‌: అశ్విన్‌ 4-0-28-0, రబాడ 3-0-32-1, నోకియా 2.4-0-25-2, స్టొయినిస్‌ 2-0-23-1, అక్షర్‌ పటేల్‌ 4-0-16-0, ప్రవీణ్‌ దూబే 3-0-29-0.

Advertisement
Advertisement