ధాన్యం చెల్లింపుల్లో జాప్యం!

ABN , First Publish Date - 2021-11-18T07:48:30+05:30 IST

ధాన్యం అమ్మిన రైతులు డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయా? అని ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి.

ధాన్యం చెల్లింపుల్లో జాప్యం!

  • ‘ఓపీఎమ్మెస్‌’లో వివరాల నమోదుకు సాంకేతిక సమస్యలు
  • సెల్‌ నంబర్‌కు ‘ఓటీపీ’ వచ్చాకే మిగిలిన వివరాల నమోదు
  • రైస్‌మిల్లర్లు ఆమోదించిన తర్వాతే రైతుల ఖాతాలోకి డబ్బు
  • నెలలో 1,65,100 మంది రైతుల నుంచి 10.69 లక్షల టన్నుల కొనుగోళ్లు 
  • ఆ విలువ రూ.2,100 కోట్లు.. రైతుల ఖాతాల్లో రూ.116 కోట్లే జమ


హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ధాన్యం అమ్మిన రైతులు డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయా? అని ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఖాతాల్లో మాత్రం డబ్బు పడడం లేదు. ధాన్యం చెల్లింపుల్లో ఇలా తీవ్ర జాప్యం నెలకొనడం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది. ‘ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఓపీఎమ్మెస్‌)’లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, ఆధార్‌ సీడింగ్‌తో ఓటీపీ ఇబ్బందులు, రైస్‌మిల్లర్లు ఆమోదించిన తర్వాతే చెల్లింపులు చేసేలా నిబంధనలు ఉండడం, మిల్లులకు ధాన్యం చేరినప్పటికీ మిల్లర్లు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. ధాన్యం సేకరణ మేరకు చెల్లింపుల కోసం డబ్బును సర్కారు విడుదల చేయడం లేదు. గత నెల రోజుల్లో రూ.2,100 కోట్ల విలువైన వడ్లు కొనుగోలు చేయగా.. ఇప్పటివరకు రూ.116 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మొత్తమే రైతుల ఖాతాల్లో జమైంది. రాష్ట్రంలో అక్టోబరు 18న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 4,743 కొనుగోలు కేంద్రాల్లో... 10.69 లక్షల టన్నుల వడ్లు  కొన్నారు. ఇందులో రైస్‌ మిల్లులకు 10 లక్షల టన్నుల ధాన్యం రవాణా పూర్తయింది. 1,65,100 మంది రైతులు కేంద్రా ల్లో ధాన్యం విక్రయించారు. కానీ ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెం ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఓపీఎమ్మెస్‌)లో కేవలం 22,750 మంది రైతులకు సంబంధించిన వివరాలు మా త్రమే అప్‌లోడ్‌ అయ్యాయి. వీరిలో కేవలం 3 వేల మంది రైతులకు మాత్రమే డబ్బులు చెల్లించారు. 


నెల రోజులు అయినప్పటికీ ‘ఓపీఎమ్మెస్‌’ సాఫ్ట్‌వేర్‌ ఇంకా గాడిన పడలేదు.  సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో... రైతుల వివరాలు నమోదుచేయటంలో ఆలస్యమవుతోంది. గతంలో 10-15 మంది రైతులందరూ కలిసి ఒకే బ్యాంక్‌ అకౌంట్‌ నంబరు, డాక్యుమెంట్లు ఇచ్చే వెసులుబాటు ఉండేది. ఇప్పుడలాలేదు. ప్రతి రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు, డాక్యుమెంట్లు జిరాక్సు కాపీలు ఇవ్వాల్సిందే! దీంతో ఒక్కొక్కరి వ్యక్తిగత వివరాలను నమోదు చేయటంలో కూడా జాప్యం అవుతోందని పీపీసీ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. తొలుత రైతు పేరు, ఆధార్‌ నమోదుచేయగానే... దానికి సీడింగ్‌ అయి ఉన్న సెల్‌ నంబర్‌కు ‘ఓటీపీ’ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేసిన తర్వాతే రైతుకు సంబంధించిన ఇతర వివరాలు నమోదుచేసే ఆస్కారం ఉంటుంది. చాలా మంది ఫోన్‌ నంబరును లింక్‌ చేసుకోకపోవడం, లింక్‌ చేసుకున్న నంబరును పోగొట్టుకోవడం వంటి వాటితో సమస్యలు ఎదురవుతున్నాయి. పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్‌తో ఫోన్‌ నంబరును లింక్‌ చేసుకోవాలని.. ఒకట్రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి ఏ రైతైతే  ధాన్యం తీసుకెళ్తాడో, ఆ రైతుకు సంబంధించిన వివరాలు మాత్రమే నమోదుచేస్తుండటం... బ్యాంకు అకౌంట్లు, ఆధార్‌ నమోదు, ఓటీపీ ఎంటర్‌ చేయటంలాంటి సమస్యల కారణంగా జాప్యమవుతోందని పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు.


ధాన్యం కొనుగోళ్లకు రూ. 12 వేల కోట్లు

ఈ వానాకాలం సీజన్‌లో ఎఫ్‌సీఐ ఇచ్చిన లక్ష్యానికి (60 లక్షల టన్నులు) అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు రూ. 12 వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. అయితే  వడ్ల కొనుగోళ్లకుగాను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థను నోడల్‌ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు... తదితర జాతీయ బ్యాంకుల్లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు రుణం తీసుకుంది. అయితే ధాన్యం డబ్బులు చెల్లించటానికి నిధుల కొరత ఏమీలేదని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. క్షేత్రస్థాయిలో రకరకాల సమస్యలతో డబ్బులు చెల్లింపులు మాత్రం ఆలస్యంగా జరుగుతున్నాయి.   

Updated Date - 2021-11-18T07:48:30+05:30 IST