Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొనుగోళ్లలో జాప్యం.. రైతు ప్రాణమే మూల్యం!

  • గుండెపోటుతో కుప్పపై కూలిన అన్నదాత
  • కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఘటన 
  • తూకంలో మోసం.. నిర్వాహకుడిపై రైతుల దాడి 


జమ్మికుంట, మల్లాపూర్‌, మాచారెడ్డి, డిసెంబరు 7: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి ఎదురు చూసిన అన్నదాత చివరికి తాను పండించిన ధాన్యం రాశులపైనే గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందాడు. కరీంనగర్‌ జిల్లా ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య (58) అలియాస్‌ ఐలేశానికి గ్రామంలో 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. మూడేళ్లుగా మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. 20 రోజుల క్రితం దిగుబడి చేతికి రాగా, 18 రోజుల క్రితం ధాన్యాన్ని గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. రోజూ నిర్వాహకులు వచ్చి ధాన్యాన్ని పరిశీలించడమే కానీ, కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఇదేమిటని రైతు ప్రశ్నిస్తే తేమ శాతం ఎక్కువగా ఉందంటూ దాటేస్తున్నారు. ఈ తరుణంలో ఐలయ్య రోజూ అన్నం తినేందుకు ఇంటికి వెళ్లి, అరగంట వ్యవధిలోనే తిరిగి ధాన్యం కుప్ప వద్దకు వచ్చేవాడు. ధాన్యాన్ని ఆరబోస్తూ అక్కడే కాపలా ఉంటూ అసలు ధాన్యం కొంటారో లేదోనని ఆందోళన గురయ్యాడు. ఈ క్రమంలో సిబ్బంది మంగళవారం ఉదయం కొనుగోలు చేస్తామని చెప్పి గోనె సంచులు ఇచ్చారు. మధ్యాహ్నం ధాన్యాన్ని గోనెసంచుల్లోకి పోస్తుండగా గుండెపోటుతో ధాన్య రాశిపైనే కుప్పకూలి ప్రాణం విడిచాడు.


రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు యత్నించగా.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాన్ని తరలించారు. కాగా, రైతు ఐలయ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ఒబులాపూర్‌లో సెర్ప్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకుడు తూకంలో మోసానికి పాల్పడుతున్నాడంటూ రైతులు అతడిపై  దాడి చేశారు. ఈ కొనుగోలు కేంద్రంలో 20 రోజులుగా సెర్ప్‌ ప్రతినిధి భర్త శ్రీనివాస్‌ ధాన్యాన్ని సేకరిస్తున్నారు. 40 కిలోల బస్తాకు 4 కిలోలు అధికంగా తూకం వేయడాన్ని పలువురు రైతులు ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా దాట వేశాడు. దీంతో రైతులు, నిర్వాహకుడికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన రైతులు శ్రీనివాస్‌పై దాడి చేశారు. తహసీల్దార్‌ రవీందర్‌ అక్కడకు చేరుకుని విచారణ చేపట్టగా, అధికంగా తూకం వేసినట్లు తేలింది. దీంతో రైతులకు నష్టపరిహారం చెల్లిస్తానని శ్రీనివాస్‌ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 


15 రోజులవుతున్నా కొనరా?

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి వద్ద రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి 15 రోజులవుతున్నా కొనడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు 350 మంది రైతులకు టోకెన్లు కేటాయించగా.. 135 మంది ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారన్నారు. హామీ ఇవ్వడంతో.. రైతులు ఆందోళన విరమించారు. 

Advertisement
Advertisement