Abn logo
Oct 13 2021 @ 01:30AM

చెన్నైని ఢీకొట్టేదెవరో?

  • క్వాలిఫయర్‌-2లో ఢిల్లీతో కోల్‌కతా పోరు నేడు
  • రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..


షార్జా: తొలి ఐపీఎల్‌ టైటిల్‌పై గురిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు.. ఉత్సాహంతో ఉరకలేస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) రూపంలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. బుధవారం జరిగే క్వాలిఫయర్‌-2లో గతేడాది రన్నరప్‌ ఢిల్లీతో కోల్‌కతా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్‌ ఫైట్‌లో చెన్నైతో అమీతుమీ తేల్చుకోనుండగా.. ఓడిన టీమ్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించనుంది. లీగ్‌ ఆసాంతం నిలకడైన ప్రదర్శనతో టేబుల్‌ టాపర్‌గా నిలిచిన క్యాపిటల్స్‌.. క్వాలిఫయర్‌-1లో మాత్రం చెన్నై చేతిలో కంగుతింది.   ఆ ఓటమిని పక్కనపెట్టి ఢిల్లీ కుర్రాళ్లు పుంజుకోవాల్సివుంది. మరోవైపు రెండుసార్లు విజేత కోల్‌కతా ఫుల్‌జో్‌షలో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా యూఏఈలో జరుగుతున్న రెండో దశలో నైట్‌రైడర్స్‌ చెలరేగుతున్న తీరు అద్భుతం. ఎలిమినేటర్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించిన కేకేఆర్‌ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మ్యాచ్‌లో కీలక సమయాల్లో చెలరేగుతూ విజయావకాశాలను పెంచుకుంటోంది. 


షార్జాలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపు మోర్గాన్‌ సేనదే కావడం సానుకూలాంశం. బ్యాటింగ్‌ కంటే.. బౌలింగ్‌లో నైట్‌రైడర్స్‌ ఎంతో బలంగా కనిపిస్తోంది. మిస్టరీ స్పిన్నర్‌ నరైన్‌ ప్రత్యర్థులకు సింహ స్వప్నంగా మారాడు. బెంగళూరుతో ఎలిమినేటర్‌లో కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, డివిల్లీర్స్‌ వికెట్లతో మ్యాచ్‌ గమనాన్నే మార్చాడు. ఇక బ్యాట్‌తోనూ సిక్స్‌ల వర్షం కురిపించాడు. మధ్య ఓవర్లలో వరుణ్‌ చక్రవర్తి పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ స్కోరు బోర్డుకు కళ్లెం వేస్తుండగా.. రస్సెల్‌ లేని లోటును షకీబల్‌ తెలియనివ్వడం లేదు. ఇక పేసర్లు ఫెర్గూసన్‌, శివమ్‌ మావి ఆరంభంలోనే వికెట్లతో కట్టడి చేస్తున్నారు. బ్యాటింగ్‌లో వెంకటేష్‌ అయ్యర్‌ కీలకపాత్ర పోషిస్తుండగా.. శుభ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి రాణిస్తున్నారు. మోర్గాన్‌ ఫామ్‌ కోల్పోవడం మాత్రం జట్టును కొంత ఆందోళనకు గురి చేస్తోంది. 


స్టొయినిస్‌ వస్తాడా?

గత రెండు సీజన్లుగా మెరుగైన ఆటను ప్రదర్శిస్తున్న ఢిల్లీ కుర్రాళ్లు ఈసారి ఎలాగైనా టైటిల్‌తో తిరిగి వెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు. టోర్నీలోని జట్లన్నింటిలోకీ క్యాపిటల్స్‌ సమతుల్యమైన జట్టు. టాపార్డర్‌లో ధవన్‌, పృథ్వీ షా, శ్రేయాస్‌ అయ్యర్‌ రాణిస్తుండగా.. మిడిలార్డర్‌లో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, హెట్‌మయర్‌ సత్తాచాటుతున్నారు. అయితే, గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ అందుబాటులో లేకపోవడంతో డెత్‌ ఓవర్లలో ఇబ్బందులు పడుతోంది. అయితే, అతడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని సమాచారం. బౌలింగ్‌లో నోకియా, రబాడ జోడీ చెలరేగుతుండగా.. అవేశ్‌ ఖాన్‌ వికెట్‌ టేకర్‌గా మారాడు. ఆశించిన రీతిలో ఆకట్టుకోని అశ్విన్‌.. కీలక మ్యాచ్‌లో సత్తాచాటాలనుకుంటున్నాడు.


జట్లు (అంచనా)

ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్‌ ధవన్‌, శ్రేయాస్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌), హెట్‌మయర్‌, స్టొయినిస్‌/టామ్‌ కర్రాన్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రబాడ, నోకియా, అవేశ్‌ ఖాన్‌. 


కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేష్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీష్‌ రాణా, దినేష్‌ కార్తీక్‌, మోర్గాన్‌ (కెప్టెన్‌), షకీబల్‌, నరైన్‌, ఫెర్గూసన్‌, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ మావి. 


పిచ్‌

షార్జా పిచ్‌ మందకొడిగా ఉండడంతో భారీ స్కోర్లకు అంతగా అవకాశాలు కనిపించడం లేదు. అయితే, ఈ సీజన్‌లో ఇక్కడ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ చేసిన జట్లు ఐదుసార్లు నెగ్గిన నేపథ్యంలో టాస్‌ గెలిచిన టీమ్‌ బౌలింగ్‌ ఎంచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.