రాష్ట్రంలో డీఏపీకి డిమాండ్‌

ABN , First Publish Date - 2022-08-30T09:45:52+05:30 IST

రాష్ట్రంలో డీఏపీ ఎరువుకి డిమాండ్‌ పెరిగింది. వర్షాలు కురుస్తుండటంతో సాగు పనులు జోరందుకున్నాయి.

రాష్ట్రంలో డీఏపీకి డిమాండ్‌

  • కృత్రిమ కొరతతో పెరిగిన ధర
  • మార్క్‌ఫెడ్‌లో నిండుకున్న నిల్వలు
  • సరుకంతా ఆర్బీకేలకు మళ్లింపు
  • డిమాండ్‌గా అమ్ముతున్న డీలర్లు
  • చోద్యం చూస్తున్న వ్యవసాయశాఖ


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డీఏపీ ఎరువుకి డిమాండ్‌ పెరిగింది. వర్షాలు కురుస్తుండటంతో సాగు పనులు జోరందుకున్నాయి. ప్రస్తుతం రైతుల అవసరాలకు సరిపడా డీఏపీ నిల్వ మార్కెఫెడ్‌ వద్ద లేదని సమాచారం. ఇప్పటికే వచ్చిన సరుకులో సింహభాగం ఆర్బీకేలకు మళ్లించారు. సొసైటీలకు కూడా తగినంత ఎరువులు సరఫరా చేయలేదు. ఆర్బీకేల్లో అధికార పార్టీ మద్దతుదారులకు, సొసైటీల్లో పలుకుబడి ఉన్నవారికే ఎరువులు లభ్యమవుతున్నాయి. సాధారణ రైతులు డీఏపీ ఎరువు కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు హోల్‌సేల్‌ డీలర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దీంతో రిటైల్‌ వ్యాపారులు స్టాక్‌ లేదంటూ, ఉన్న సరుకును అధిక ధరకు అమ్ముతున్నారు. బస్తాకు రూ.250దాకా అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పైగా జీవ ఎరువులు తీసుకుంటేనే డీఏపీ ఇస్తామంటున్నారు. డీఏపీ కోసం రైతులు ఇన్ని తిప్పలు పడుతుంటే.. వ్యవసాయశాఖ మాత్రం డీఏపీ సరఫరాని మెరుగుపర్చే చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పది రోజుల క్రితం రాష్ట్రంలో 65,265 మెట్రిక్‌ టన్నుల డీఏపీ నిల్వ ఉందని అధికారులు చెప్పారు. ఆగస్టు నెలకు 81.370 మెట్రిక్‌ టన్నులు రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందని వెల్లడించారు. గత వారంలో వర్షాలు కురవడంతో, పంటలకు ఎరువుల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, కర్నూలు జిల్లాల్లో డీఏపీకి డిమాండ్‌ బాగా ఉంది. 


వరి, పత్తి, ఇతర పైర్లకు డీఏపీ తగినంత వేయాలని రైతులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిరుడు రూ.1200 ఉన్న డీఏపీ బస్తా ఈ ఏడాది రూ.1350కి పెరిగింది. ప్రస్తుతం డిమాండ్‌ కారణంగా రూ.1600 వసూలు చేస్తున్నారు. అదనపు ధర చెల్లించకపోతే.. అసలు సరుకే లేదంటున్నారని రైతులు వాపోతున్నారు. ఆర్బీకేల్లో నమోదు చేసుకున్న రైతులందరికీ రెండు రోజుల సమయం పడుతున్నా.. తగినంత ఇవ్వడం లేదని, ప్రాబల్యం ఉన్న వారికే ఎరువులు ఇస్తున్నారని రైతులే చెబుతున్నారు. కాగా గుంటూరు జిల్లాకు రెండు రోజుల క్రితం పీపీఎల్‌ డీఏపీ రాగా, సోమవారం ఇఫోకో డీఏపీ ర్యాక్‌ ఒకటి తెనాలి రైల్వేస్టేషన్‌కు చేరినట్లు చెప్పారు. కాకినాడ నుంచి ఒక ర్యాక్‌ రవాణాలో ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు 3,380 మెట్రిక్‌ టన్నుల ఐపీఎల్‌ డీఏపీవిశాఖపట్నంలో లోడ్‌ చేసినట్లు చెబుతున్నారు. ఈ లోగా కృష్ణపట్నం పోర్టు నుంచి కూడా రోడ్డు మార్గంలోనూ మరో ర్యాక్‌ వస్తుందంటున్నారు. అయితే, ఈ నెల కోటా వచ్చినా.. డీఏపీ అవసరం అన్ని పంటలకూ ఉన్నందువల్ల డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా పెంచాలని రైతులు కోరుతున్నారు. సొసైటీలకు సరఫరా పెంచితే బయో ఎరువులు కొనాల్సిన అవసరం లేకుండా, ఎమ్మార్పీకి తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నది రైతుల అభిప్రాయం. 

Updated Date - 2022-08-30T09:45:52+05:30 IST