చిన్న నగరాల్లో గృహాలకు గిరాకీ

ABN , First Publish Date - 2020-10-01T06:39:14+05:30 IST

కరోనా సంక్షోభం తర్వాత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అద్దె ఇళ్లతోపాటు గృహాల కొనుగోలుకు డిమాండ్‌ పెరిగిందని హౌసింగ్‌.కామ్‌ తాజా నివేదిక వెల్లడించింది...

చిన్న నగరాల్లో గృహాలకు గిరాకీ

  • జాబితాలో విజయవాడ..
  • కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితులపై హౌసింగ్‌.కామ్‌ నివేదిక 


న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం తర్వాత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అద్దె ఇళ్లతోపాటు గృహాల కొనుగోలుకు డిమాండ్‌ పెరిగిందని హౌసింగ్‌.కామ్‌ తాజా నివేదిక వెల్లడించింది.  ప్రధాన నగరాల్లోని కార్మికులు తిరిగి  స్వస్థలాలకు వలస రావడం ఇందుకు కారణమని అం టోంది. ఆగస్టులో ఈ నగరాల్లో గృహాల అద్దె, కొనుగోలు డిమాండ్‌ వార్షిక ప్రాతిపదికన దాదాపు మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది. అన్‌లాక్‌ 4.0 తర్వాత ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ‘వర్చువల్‌ రెసిడెన్షియల్‌ డిమాండ్‌ ఇండెక్స్‌’ 210 పాయింట్లకు ఎగబాకిందని హౌసింగ్‌.కామ్‌ వెల్లడించింది. కాగా, దేశంలోని 8 ప్రధాన నగరాల విషయంలో ఈ సూచీ 150 పాయింట్లకు పరిమితమైంది. డిమాండ్‌ పెరిగిన చిన్న నగరాల్లో విజయవాడ, అమృత్‌సర్‌, చండీగఢ్‌, వడోదరా, నాగ్‌పూర్‌, కోయంబత్తూరు కూడా ఉన్నాయని హౌసింగ్‌.కామ్‌ మాతృసంస్థ ఎలారా టెక్నాలజీస్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాల్‌ తెలిపారు. స్వస్థలాలకు వలసలు, ఇంటి నుంచే పనిచేసే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) ట్రెండ్‌ భవిష్యత్‌లో ఇళ్ల గిరాకీపై తీవ్ర ప్రభావం చూపవచ్చన్నారు. చిన్న నగరాలపై ఆసక్తి క్రమంగా పెరుగుతోందని, ఆన్‌లైన్‌ సెర్చ్‌లో చిన్న నగరాల్లో ఇళ్ల కోసం వెతుకులాడే వారి వాటా ఈ ఏడాది ప్రథమార్ధానికి 27 శాతానికి పెరిగిందని హౌసింగ్‌.కామ్‌ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి వీరి వాటా కేవలం 18 శాతంగా నమోదైంది. 


ప్రధాన నగరాల్లో విక్రయాలు 57 శాతం డౌన్‌ 

కరోనా సంక్షోభంతో దేశీయ స్థిరాస్తి రంగం కుప్పకూలింది. ఈ ఏడాదిలో గడిచిన 9 నెలల్లో (జనవరి-సెప్టెంబరు) హైదరాబాద్‌ సహా 7 అతిపెద్ద నగరాల్లో ఇళ్ల విక్రయాలు 57 శాతం క్షీణించి 87,460 యూనిట్లకు పరిమితం అయ్యాయి. గత ఏడాది ఇదే కాలానికి 2,02,200 యూనిట్లు అమ్మడయ్యాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సంస్థ అనరాక్‌ వెల్లడించింది. 


ఇళ్ల ధరల్లో 2.8 శాతం పెరుగుదల

ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశవ్యాప్త గృహ ధరల సూచీ (హెచ్‌పీఐ) వార్షిక ప్రాతిపదికన 2.8 శాతం పెరిగింది.  ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు సహా 10 ప్రధా న నగరాల స్థిరాస్తి లావాదేవీల ఆధారంగా ఈ డేటా రూపొందించారు.

Updated Date - 2020-10-01T06:39:14+05:30 IST