93,656 కోట్లతో రాష్ట్రరహదారుల అభివృద్ధి

ABN , First Publish Date - 2022-02-20T07:21:13+05:30 IST

తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం

93,656 కోట్లతో రాష్ట్రరహదారుల అభివృద్ధి

  • కేంద్ర నిధులతో ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం
  • కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర పర్యాటక మంత్రి జి. కిషన్‌ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. వాటి అభివృద్ధికి రూ. 93,656 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. గడచిన 65ఏళ్లలో కాని రహదారుల అభివృద్ధిని కేవలం ఆరేళ్లలోనే బీజేపీ ప్రభుత్వం చేసి చూపించిందని గుర్తుచేశారు.


 ఈ ఆరేళ్ల వ్యవధిలో సుమారు 2371 కి.మీ మేర హైవేల అభివృద్ధి కోసం రూ.31,624 కోట్లను ఖర్చు చేసిందని వివరించారు. పెద్దపల్లి జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు. 2014లో జాతీయ రహదారులు 2511కి.మీ ఉండగా 2021 నాటికి దాదాపు రెండింతలు.. అంటే 4,994 కి.మీ.కు విస్తరింపచేశామని స్పష్టం చేశారు. జాతీయ రహదారులను రోజుకు సగటున 37 కి.మీ మేర విస్తరిస్తున్నట్టు వివరించారు. ఇక.. హైదరాబాద్‌ నుంచి బెంగుళూరుకు ఉన్న 576 కి.మీ దూరంలో తెలంగాణ పరిధిలో 190 కి.మీ పొడవున సూపర్‌ ఇన్‌ఫర్మేషన్‌ హైవేను రూ.4750కోట్లు తో అభివృద్ధి చేస్తున్నట్టు కిషన్‌రెడ్డి వివరించారు. నాలుగు లేన్ల రోడ్లను డిజిటల్‌ సమాచార వ్యవస్థతో అప్‌డేట్‌ చేస్తామన్నారు. 



రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ఆర్‌ఆర్‌ఆర్‌ 

హైదరాబాద్‌కు సుమారు 50 నుంచి 60 కిమీటర్ల దూరంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా 340 కిలోమీర్ల పొడవున నిర్మించనున్న రీజినల్‌ రింగ్‌ రోడ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణంతో తెలంగాణ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని కిషన్‌రెడ్డి వివరించారు. భూ సేకరణ కోసం 50 శాతం నిధులు రాష్ట్రప్రభుత్వం సమకూర్చితే  మిగిలిన 50శాతం నిధులను కేంద్రం అందిస్తుందన్నారు. రహదారి నిర్మాణ పనులకు 100 శాతం నిధులను కేంద్రమే కేటాయిస్తుందని తెలిపారు.


Updated Date - 2022-02-20T07:21:13+05:30 IST