కేసు తిప్పేశారు!

ABN , First Publish Date - 2021-01-16T09:19:04+05:30 IST

పోలీస్‌ బాస్‌ 48 గంటల్లోనే మాట మార్చారు. ‘విగ్రహాల ధ్వంసం వెనుక కుట్ర లేదు. కానీ, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక

కేసు తిప్పేశారు!

విగ్రహాల ధ్వంసం వెనుక ‘రాజకీయ కోణం’

2 రోజుల్లోనే మారిన డీజీపీ మాట

మొన్న రాజకీయ కుట్రలేదని స్పష్టీకరణ

ఇప్పుడు.. టీడీపీ, బీజేపీలే అని వెల్లడి

తొమ్మిది కేసుల వివరాలతో ప్రకటన

నిందితుల్లో 21 మంది ఆ 2 పార్టీలవారే

అందులో 15 మంది ‘నిందితుల’ అరెస్టు

ఏడు కేసుల్లో ‘తప్పుడు ప్రచారమే’ నేరం

ఒకటి భూవివాదం, మరొకటి గుప్తనిధులు

‘ప్రత్యక్ష ప్రమేయం’ ఇదేనా!?



13న

ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో ఇప్పటి వరకూ ఛేదించిన 29 కేసుల్లో కుట్రకోణం కనిపించ లేదు. దొంగలు, గుప్తనిధుల వేటగాళ్లు, మూఢ నమ్మకాలు, ఆస్తి గొడవలు, మతిస్థిమితం లేని వారు, అడవి జంతువుల కారణంగానే ఆయా ఘటనలు జరిగినట్లు గుర్తించాం.

భోగి రోజు డీజీపీ చెప్పిన మాటలు


15న

ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల పాత్ర ఉంది. 9 కేసుల్లో వారి పాత్రపై ఆధారాలు సేకరించాం. అందులో 15 మందిని అరెస్టు చేశాం. వీరిలో 13 మంది ఒక పార్టీకి, ఇద్దరు మరో పార్టీకి చెందిన వారు. మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు.

కనుమనాడు డీజీపీ వ్యాఖ్యలు



అమరావతి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ బాస్‌ 48 గంటల్లోనే మాట మార్చారు. ‘విగ్రహాల ధ్వంసం వెనుక కుట్ర లేదు. కానీ, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక కుట్ర ఉండొచ్చు’ అని బుధవారం స్పష్టం చేసిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌... శుక్రవారం మరో కొత్త కోణం బయటపెట్టారు. ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ, బీజేపీ కుట్ర ఉందని తెలిపారు. ఆయా సంఘటనల వివరాలతో ఒక ప్రకటన విడుదల చేశారు. భోగి పండుగ రోజు... అంటే బుధవారం డీజీపీ మీడియాతో మాట్లాడారు.  ‘‘రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో ఇప్పటి వరకూ ఛేదించిన 29 కేసుల్లో కుట్రకోణం కనిపించ లేదు. దొంగలు, గుప్తనిధుల వేటగాళ్లు, మూఢ నమ్మకాలు, ఆస్తి గొడవలు, మతిస్థిమితం లేని వారు, అడవి జంతువుల కారణంగానే ఆయా ఘటనలు జరిగినట్లు గుర్తించాం. ప్రతి కేసులోనూ శాస్త్రీయమైన ఆధారాలు సేకరించాం. ఫోరెన్సిక్‌ నివేదిక కూడా తీసుకున్నాం’’ అని స్పష్టం చేశారు.


‘కుట్రకోణం లేదని స్పష్టంగా చెబుతున్నారా?’ అని ఒక విలేకరి ప్రశ్నించగా... ‘సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం వెనుక కుట్ర కోణం ఉండొచ్చు’ అని బదులిచ్చారు. అరెస్టు చేసిన 80 మందిలో రాజకీయ పార్టీలకు చెందిన వారున్నారా? అని అడగ్గా... ‘ఉండొచ్చు’ అని ముక్తసరి సమాధానమిచ్చారు.


కనుమ రోజున ఇలా... 

సంక్రాంతి అయ్యాక, కనుమ రోజున డీజీపీ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. ‘‘రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల పాత్ర ఉంది. 9 కేసుల్లో వారి పాత్రపై ఆధారాలు సేకరించాం. అందులో 15 మందిని అరెస్టు చేశాం. వీరిలో 13 మంది ఒక పార్టీకి, ఇద్దరు మరో పార్టీకి చెందిన వారు. మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు’’ అని వివరించారు. వాళ్లు ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారని ప్రశ్నించగా... ‘‘మీకు నోట్‌ ఇస్తున్నాం. అందులో వివరాలున్నాయి’’ అని తెలిపారు. రాజకీయ పార్టీల పేర్లు చెప్పేందుకు డీజీపీ ఇష్టపడలేదు. ఆ తర్వాత ఇచ్చిన నోట్‌ను పరిశీలించగా... నిందితుల్లో టీడీపీకి చెందిన వారు 17మంది, బీజేపీతో సంబంధమున్న వారు నలుగురు ఉన్నట్లు పేర్కొన్నారు.


వాళ్లే చేశారా...

టీడీపీ, బీజేపీ సానుభూతిపరులే స్వయంగా విగ్రహాలను ధ్వంసం చేశారనేలా మీడియా సమావేశంలో డీజీపీ తెలిపారు. కానీ... ఆయన ఇచ్చిన ప్రకటన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. డీజీపీ మొత్తం 9 కేసుల వివరాలతో ప్రకటన విడుదల చేయగా... అందులో ఏడు కేసుల్లో ‘సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం’ చేసినందుకే టీడీపీ, బీజేపీ శ్రేణులపై కేసులు పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇక ఒక కేసులో... భూవివాదం, మరో కేసులో గుప్త నిధుల వ్యవహారం ఉన్నట్లు తేలింది. డీజీపీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం...


1) రాజమండ్రి అర్బన్‌లోని బొమ్మూరులో వినాయక విగ్రహానికి అమలినం పూశారంటూ తప్పుడు ప్రచారం చేసిన కేసులో ఇద్దరు టీడీపీ, ఇద్దరు బీజేపీ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

2) గుంటూరు జిల్లాలో సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసి, దానిపై మద్యం పోశారని తప్పుడు ప్రచారం చేసిన కేసులో టీడీపీ సానుభూతిపరుడిని అరెస్టు చేశారు.

3) కడప జిల్లా భూవివాదాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చేందుకు టీడీపీ సానుభూతిపరుడైన ఒక వ్యక్తి ఆంజనేయుడి విగ్రహం మెడలో చెప్పుల దండ వేశాడు.

4) కర్నూలు జిల్లా మద్దికెరలోని ఒక ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన 8 మందిలో నలుగురు టీడీపీ సానుభూతిపరులే.

5) గతనెల 30న కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని మార్లమండ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేస్తుండగా... ఎలక్ట్రీషియన్‌ పొరపాటున విగ్రహాలపై పడటంతో అవి దెబ్బతిన్నాయి. దీనిపై తప్పుడు ప్రచారం చేసిన ఆలయ పూజారి, ట్రస్టీ (టీడీపీ)తోపాటు ఇద్దరు జర్నలిస్టులపై కేసు పెట్టారు.

6) ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆర్చి దెబ్బతింది. దీనిపై తప్పుడు ప్రచారం చేసిన కొందరు టీడీపీ కార్యకర్తలు, విలేకరులపై కేసు పెట్టారు.

7) విశాఖ జిల్లా గొలుగొండ మండలంలో వినాయక విగ్రహం ధ్వంసమైందని తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరు టీడీపీ సానుభూతిపరులను అరెస్టు చేశారు.

8) శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామంలో చెట్టుకొమ్మ పడి ఒక విగ్రహం దెబ్బతింది. బీజేపీ కార్యకర్త ఒకరు దీనిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు.

9) శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో సరస్వతీదేవి విగ్రహం చెయ్యి ఎప్పుడో విరిగింది. దానిని అన్యమతస్తులే విరిచేశారంటూ బీజేపీ కార్యకర్త తప్పుడు ప్రచారం చేశారు.


ఆ పార్టీల కుట్రే!!


9 కేసుల్లో 21 మంది రెండు పార్టీల వారే: డీజీపీ

అమరావతి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆలయాల ధ్వంసం రాజకీయ పార్టీల కుట్రే అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఇటీవలి కాలంలో జరిగిన ఘటనలకు సంబంధించి తొమ్మిది కేసుల్లో ఆ రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల ప్రత్యక్ష ప్రమేయాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అశాంతి రేకెత్తించేందుకు ఎవరు కుట్ర చేసినా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి సంబంధించి తాజా వివరాలను శుక్రవారం మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో డీజీపీ విలేకరులకు వివరించారు. ‘‘రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేదనడం శుద్ధ అబద్ధం. మతసామరస్యాన్ని కాపాడేందుకు దేశంలో ఏ పోలీసులూ తీసుకోని చర్యలు చేపట్టాం. అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల రక్షణపై డిజిటల్‌ ఆడిట్‌ చేశాం. 13,296 ఆలయాల్లో ఇప్పటివరకూ 44,521 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. బైండోవర్లు, గ్రామాల్లో శాంతి కమిటీలు, సిట్‌ ఏర్పాటు చేస్తున్నాం’’ అని వివరించారు. తొమ్మిది ఘటనల్లో 21మంది పాత్రను గుర్తించామన్నారు. వీరిలో 17 మంది ఒక పార్టీకి (టీడీపీ), నలుగురు మరో పార్టీకి (బీజేపీ) చెందిన వారు ఉన్నారని డీజీపీ తెలిపారు.  నిందితుల్లో ఒక పార్టీకి  చెందిన 13 మందిని, మరో పార్టీకి  చెందిన ఇద్దరిని అరెస్టు చేశామని సవాంగ్‌ వివరించారు.


ఆలయాలపై చర్యలకు పాల్పడటం, తర్వాత దుష్ప్రచారం చేయడం.. ఇదంతా ఒక గేమ్‌ ప్లాన్‌లో భాగమని స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే దురుద్దేశం ఈ ఘటనల్లో కనిపిస్తోందని  అనుమానం వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేసే వైఖరిని విడనాడాలని, సైబర్‌ స్పేస్‌ను దుర్వినియోగం చేసే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రతి ఘటనలోనూ రెచ్చగొట్టే ధోరణి కనిపించిందని, భయబ్రాంతులు సృష్టించడమే లక్ష్యంగా ఉందని తెలిపారు. ‘‘పాత ఘటనలను కొత్తగా ప్రచారం చేయడం, సోషల్‌ మీడియాలో తప్పుడు సందేశాలు పంపడాన్ని గుర్తించాం. రాజకీయ పార్టీలు ఇటువంటి వ్యక్తులను పక్కనపెట్టాలి. మీడియా ప్రతినిధులు సైతం అసత్య ప్రచారంలో కొట్టుకుపోయేలా వ్యవహరిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేదన్న ప్రచారం కూడా కొన్ని రాజకీయ పార్టీల కుట్రేనన్నారు. ఆలయాల ధ్వంసానికి సంబంధించి ఏ సమాచారం తెలిసినా 9392903400కు ఫోన్‌ చేసి తెలపాలని ప్రజలకు పోలీస్‌ బాస్‌ విజ్ఞప్తి చేశారు.


నిన్నటి వరకూ పిచ్చోళ్లు.. ఇప్పుడు ప్రతిపక్షాలా: నాగోతు రమేశ్‌

రాష్ట్రంలో ఆలయాలపై దాడులకు కారణం పిచ్చోళ్లు, పిల్లులు, తేనెతుట్టె అని చెప్పిన పోలీసులు ఇప్పుడు ప్రతిపక్షాలపై నెపం వేయడం... అసలు విషయాన్ని పక్కదారి పట్టించడమేనని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు అన్నారు. హిందూ ఆలయాల్లో విగ్రహాలు పగులగొట్టిన ప్రవీణ్‌ చక్రవర్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తో పోలీసులు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.

Updated Date - 2021-01-16T09:19:04+05:30 IST