ధనం మూలం ఇదం టికెట్‌!

ABN , First Publish Date - 2021-04-18T05:51:38+05:30 IST

వరంగల్‌ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్‌ కావాలంటే అంత ఆషామాషీ కాదు. ఒక్కో టికెట్‌ ధర ఏకంగా రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు పలుకుతోంది. అంతేకాదు.. అభ్యర్థి బ్యాంకు బ్యాలెన్స్‌ రూ.50లక్షలపైనే ఉండాలన్నది మరో నిబంధన. ఓరుగల్లు టీఆర్‌ఎస్‌ నేతల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది.

ధనం మూలం ఇదం టికెట్‌!

టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖరీదు రూ.50లక్షలు
మరో అర కోటి బ్యాలెన్స్‌  చూపాల్సిందే
ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ఆశావహుల జాతర
ఒక్కో డివిజన్‌కు 100-150 దరఖాస్తులు
సొంత సర్వే పేరిట ఓ కీలక నేత వసూళ్లు
డబ్బుకు వెనుకాడకుండా రియల్టర్ల పైరవీలు
గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల తీరిది


హన్మకొండ, ఆంధ్రజ్యోతి
వరంగల్‌ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్‌ కావాలంటే అంత ఆషామాషీ కాదు. ఒక్కో టికెట్‌ ధర ఏకంగా రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు పలుకుతోంది. అంతేకాదు.. అభ్యర్థి బ్యాంకు బ్యాలెన్స్‌ రూ.50లక్షలపైనే ఉండాలన్నది మరో నిబంధన. ఓరుగల్లు టీఆర్‌ఎస్‌ నేతల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు సంబంధించి తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం బలమైన పార్టీగా టీఆర్‌ఎస్సే కనిపిస్తోంది. దీంతో తాజా మాజీ కార్పొరేటర్లతోపాటు, పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అనుచరులు, గతంలో టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వారు, డాక్టర్లు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ పడుతున్నారు.

దీంతో కొన్ని రోజులుగా ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద జాతర వాతావరణం కనిపిస్తోంది. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో 66 డివిజన్లు ఉండగా, ఒక్కో డివిజన్‌ నుంచి ఇప్పటికే 100 నుంచి 150 వరకు దరఖాస్తులు అందాయి. వీరిలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. సిటింగ్‌ సీట్ల నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం ఉన్న తాజా మాజీ కార్పొరేటర్ల దరఖాస్తులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా డివిజన్లలో అంగ బలం, ఆర్థిక బలం, పలుకుబడి ఉన్న వారిని ఎంపిక చేసే కసరత్తు సాగుతోంది.

చేతులు మారుతున్న డబ్బు
టికెట్ల ఖరారు వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అగ్ర నాయకుల వద్ద పలుకుబడి కలిగిన నేతలు, వివిధ పదవుల్లో ఉన్న వారు.. ఆశావహుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. జాబితా ప్రకటనకు పెద్దగా సమయం లేనందున వీలైనంత త్వరగా డబ్బులు ముట్టజెప్పాలని తొందర పెడుతున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే వారు టికెట్‌ దక్కించుకోవాలంటే గరిష్ఠంగా రూ.50లక్షలు సమర్పించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదనంగా రూ.50 లక్షల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండాలని, లేకుంటే టికెట్‌పై ఆశలు వదులు కోవాలని నేతలు స్పష్టంగా చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ షరతును పూర్తి చేసిన వారి పేర్లే అభ్యర్థుల జాబితాలోకి ఎక్కుతున్నాయి. అంత మాత్రాన టికెట్‌ వస్తుందనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. టికెట్ల కోసం ఎక్కువ మంది ఎగబడకుండా అంగబలం, అర్థ బలం ఉన్న వారు మాత్రమే వచ్చేట్టు ఈ నిబంధన పెట్టినట్టు తెలుస్తోంది.

సర్వే పేరిట బెదిరింపులు
జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే ఆయా డివిజన్లలోని పరిస్థితులపై నిఘా సంస్థలు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి సర్వే రిపోర్టును అందజేశాయి. అయితే దీనిని కాదని, ఓ కీలక నేత సొంతంగా సర్వే చేయించినట్టు తెలిసింది. సిటింగ్‌ కార్పొరేటర్ల పని తీరు, ఆశావహుల్లో ఎవరికి బలం ఉంది... అనే విషయాలపై సమాచారం సేకరించినట్టు తెలిసింది. దీని ఆధారంగా సదరు నేత భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. టికెట్‌ ఆశిస్తున్న సిటింగ్‌ అభ్యర్థులకు సర్వే రిపోర్టు చూపించి.. ఆశలు పెట్టుకోవద్దని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, జీడబ్ల్యూఎంసీ ఎన్నికల పోరులో నిలబడేందుకు రియల్టర్లు బారులు దీరుతున్నారు. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి ఓ కీలక నేత తన అనుచరులను రంగంలోకి దింపారు. ఆశావహుల నుంచి రూ. 30-50లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నగదు సర్దుబాటు కాని పక్షంలో రెండు ఇంటి స్థలాలను తమ పేరిట అగ్రిమెంట్‌ చేసుకుంటున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-04-18T05:51:38+05:30 IST