Hyderabad : గో రక్షకుడు.. అన్ని వదిలేసి గోశాలల నిర్వహణ..

ABN , First Publish Date - 2021-11-29T17:17:16+05:30 IST

ధరంరాజ్‌ రాంఖ.. వయస్సు 81. ఒకప్పుడు నగల వ్యాపారి..

Hyderabad : గో రక్షకుడు.. అన్ని వదిలేసి గోశాలల నిర్వహణ..

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : ధరంరాజ్‌ రాంఖ.. వయస్సు 81. ఒకప్పుడు నగల వ్యాపారి. గోవులపై ఉన్న ప్రేమతో అన్నింటినీ వదులుకున్నారు. నగరంలోని గగన్‌పహడ్‌లో గోశాలలను నిర్వహిస్తున్నారు. వాటిలో సత్యం శివం సుందరం ఒకటి. 20 ఏళ్ల క్రితం తన సొంత డబ్బులతో స్థలం కొనుగోలు చేసి గోశాలను ఏర్పాటు చేశారు. వివిధ కబేళాల నుంచి రక్షించి తీసుకొచ్చిన గోవులకు ఇక్కడ ఆశ్రయం కల్పించి, వాటి ఆలనా పాలనా చూస్తున్నారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక్క సత్యం శివం సుందరం గోశాలలోనే సుమారు 5,300 గోవులు ఉన్నాయి.


ఇంకో చోట కూడా గోశాలను నిర్వహిస్తున్నారు. గోవుల సంరక్షణ కోసం వంద మంది సిబ్బందిని నియమించారు. వాటి పోషణ, ఇతరాత్ర ఖర్చుల కోసం నెలకు రూ.50 లక్షలు వ్యయం అవుతుండగా, భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరిస్తారు. అలాగే, ఆవు సంబంధిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తారు. వన్‌ మ్యాన్‌ ఆర్మీగా ఆయన తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. గో సంరక్షణ చేపట్టిన నాటి నుంచి ఆయన సాధారణ జీవనం సాగిస్తున్నారు. 20 ఏళ్లుగా ఆయన పాదరక్షలు లేకుండా, నరగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలోనే ప్రయాణం చేస్తారు.


ఘనంగా అన్నకుట్‌

దక్షిణ భారత దేశంలో అతి పెద్ద గోశాల అయిన గగన్‌పహడ్‌లోని సత్యం శివం సుందరం గో నివాస్‌లో ఆదివారం అన్నకుట్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జంటనగరాలు, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.  నగదు, వస్తు రూపంలో గోవుల సంరక్షణ కోసం విరాళాలు అందజేశారు. పుణేకు చెందిన ఆద్యాత్మిక సంగీత బృందం భజనలు, ప్రార్థనలు, ఆద్యాత్మికత పాటలతో భక్తులను అలరింపజేసింది. గో సంబందిత ఉత్పత్తులను ఈ సందర్బంగా విక్రయించారు. ప్రతి నూతన సంవత్సరం ప్రారంభంలో అన్నకుట్‌ పండుగను జరుపుకుంటామని నిర్వాహకులు ధరంరాజ్‌ రాంఖ తెలిపారు. అన్నకూట్‌ వేడుకల్లో భాగంగా పలు రకాల ఆహార పదార్థాలను భగవంతుడికి నైవేద్యంగా పెడతారని వివరించారు.

Updated Date - 2021-11-29T17:17:16+05:30 IST