ధరణి..ఇదేం ధోరణి?

ABN , First Publish Date - 2021-04-03T08:48:08+05:30 IST

భూమాతను సహనానికి ప్రతీకగా చెబుతారు. అదే పేరుతో ఆవిర్భవించిన ‘ధరణి’ పోర్టల్‌ మాత్రం భూ యజమానుల సహనానికి పరీక్ష పెడుతోంది.

ధరణి..ఇదేం ధోరణి?

  • ఆర్నెల్లయినా పోర్టల్‌లో ఇంకా చిక్కుముళ్లే
  • వారసులకు ఇబ్బందులు.. పాస్‌బుక్‌ లేకుంటే ఫౌతీ లేదు
  • పాస్‌బుక్‌లో విస్తీర్ణంలో తేడాలు.. సరిచేసే వ్యవస్థ ఏదీ? 
  • గతంలో రిజిస్ట్రేషన్‌ అయిన భూములకు మ్యుటేషన్‌ ఎప్పుడు? 
  • భాగస్తుల ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుకు నో ఆప్షన్‌ 
  • సంస్థ, పలువురు డైరెక్టర్ల పేరిట రిజిస్ట్రేషన్‌కూ నో చాన్స్‌ 
  • స్లాట్‌ రద్దు చేసుకుంటే చెల్లించిన రుసుము కోసం నిరీక్షణే


డిజిటల్‌ సంతకం కోసం కలెక్టర్‌ దగ్గరికి వెళ్లాల్సి రావడంతో ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి.నాలా కన్వర్షన్‌కు సర్వే నంబర్లు ఎర్రర్‌గా వస్తున్నాయి. నాలా కన్వర్షన్‌ ఒకరోజులో ఎక్కడా సాధ్యపడటం లేదు. వారసత్వ ఆస్తులకు సంబంధించి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా విక్రయించరాదని చట్టం చెబుతుంది. ధరణిలో మాత్రం ఎవరి పేరున ఉంటే వారు అమ్ముకోవచ్చు.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): భూమాతను సహనానికి ప్రతీకగా చెబుతారు. అదే పేరుతో ఆవిర్భవించిన ‘ధరణి’ పోర్టల్‌ మాత్రం భూ యజమానుల సహనానికి పరీక్ష పెడుతోంది. భూముల క్రయవిక్రయాలు, రికార్డుల పరంగా నెలకొన్న సమస్యలపై పరిష్కారం కోసం తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళుతున్న రైతులను హైరానా పెడుతోంది. రైతు నేస్తంగా అభివర్ణిస్తున్న ఈ పోర్టల్‌..  కొన్ని అంశాల్లో సమస్యగా మారి రైతులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. భూ రికార్డుల నిర్వహణ, భూ క్రయ విక్రయాల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్నెల్ల క్రితం ప్రతిష్ఠాత్మకంగా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. భూ క్రయవిక్రయాల్లో కాలాతీతానికి, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకుగాను రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ను తహసీల్దార్‌ కార్యాలయం వేదికగా ఒకేచోటకు తెచ్చింది. అర్జీదారుల విలువైన సమయం వృథా కాకుండా, అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ఏ లావాదేవీ అయినా పదే పది నిమిషాల్లో ముగించేసి.. ఆ తర్వాత వారంలో నేరుగా ఇంటికే పాస్‌బుక్‌ వచ్చే విధంగా సిద్ధం చేసిన విప్లవాత్మక వ్యవస్థగా ధరణిని అభివర్ణించారు. 


అయితే రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా తెచ్చిన ఈ కొత్త విధానం అమలులో ప్రారంభంలోనే పలు సమస్యలు నెలకొన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ధరణిని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఆ క్రమంలో కొన్ని సమస్యలు ఇప్పటికే పరిష్కారమయ్యాయి. అయితే ధరణిలో కొన్ని చిక్కుముళ్లు అలాగే ఉన్నాయి. గతంలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి 24 ఆప్షన్లు ఉండేవి. ఇందులో చాలావరకు ఇప్పుడు లేవు. కొన్నింటికి ఇటీవల ఆప్షన్లు ఇచ్చినా ఇంకా పనిచేయడం లేదు. సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ జరిగి, ఇప్పటికీ మ్యుటేషన్‌ కాని భూములు చాలా ఉన్నాయి. మ్యుటేషన్‌ జరిగేలోపు ధరణి రావడంతో భూ కొనుగోలుదారుల పేరు మీద పాస్‌బుక్‌లు రావడం లేదు. సదరు కొనుగోలుదారులు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం ఉండటం లేదు. ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఆప్షన్‌ ఏదీ ధరణిలో లేదు. దీంతో సదరు కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక అవసరాలు ఏర్పడిన వారు భూమిని అమ్ముకోవాలన్నా పాస్‌బుక్‌ లేకపోవడంతో వారికి ఆ అవకాశం లేకుండా పోతోంది. 


నమోదు కాకుంటే అంతే! 

నాలుగేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాస్‌బుక్‌లు జారీ చేసింది. ఆ పాస్‌బుక్‌ల వివరాలనే ధరణిలో నమోదు చేశారు. అయితే రెవెన్యూ అధికారుల పొరపాటు కారణంగా కొంత మంది రైతుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కలేదు. మరికొంత మందికి భూమి లేకున్నా ఉన్నట్లుగా ఇతర రైతుల భూమి నమోదైంది. విస్తీర్ణం నమోదు పరంగానూ కొన్నిచోట్ల పొరపాట్లు జరిగాయి. అసలు విస్తీర్ణం కన్నా తక్కువగా పాస్‌బుక్‌లో నమోదైన కేసులు పలుచోట్ల ఉన్నాయి. తప్పు జరిగిందని నిర్ధారణ జరిగినా.. ధరణిలో దానిని సరి చేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో రికార్డుల్లో భూమి గల్లంతైన రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలోనైతే ఇలాంటి సమస్యలు నెలకొన్నప్పుడు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారణ చేసుకొని సరిచేసేవారు. ఇక.. సర్వేనంబర్లు, భూ యజమాని పేరులో అక్షరదోషాలు తలెత్తితే వీటిని సరిచేసుకునే అవకాశం లేదు. ఈ రెక్టిఫికేషన్‌, ర్యాటిఫికేషన్‌ ఆప్షన్‌ ఇంకా ఇవ్వలేదు.


ఫౌతీ పరంగా చిక్కులు..

వారసత్వ భూముల విషయంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. రైతు/భూ యజమాని చనిపోతే ఆయన పేరుమీద ఉన్న భూమిని వారసులకు సమంగా ఫౌతీ (విరాసత్‌) చేస్తారు. భూమిని వారసుల పేరు మీదకు మార్చాలంటే ధరణి ఆప్షన్‌లో భూ యజమానికి సంబంధించిన పాస్‌బుక్‌ నమోదు చేయడం తప్పనిసరి. అయితే అప్పట్లో వివిధ కారణాల వల్ల కొత్త పాస్‌బుక్‌లు చాలా మంది రైతులకు రాలేదు. ఈ తరహా రైతులు ఎవరైనా చనిపోతే పాస్‌బుక్‌ లేదన్న ఒకే ఒక్క కారణంతో ఫౌతీ చేయడం లేదు. ఇది వారసులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక ఫౌతీ పరంగా వారసులు అఫిడవిట్‌ దాఖలు చేయాలనేది కొత్త నిబంధన. అయితే వారసులు వారేనా? కాదా? అని పరిశీలించే వ్యవస్థ ఇప్పుడు లేదు. అఫిడవిట్‌ ఆధారంగా తహసీల్దార్లు ఫౌతీ చేస్తున్నారని, కొన్నిచోట్ల ఇది సివిల్‌ కేసులకు దారితీస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఇక రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ను బుక్‌ చేసుకున్నప్పుడే స్టాంప్‌ డ్యూటీ తదితర రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. అయితే అనివార్య కారణాల వల్ల స్లాట్‌ రద్దు చేసుకుంటే కట్టిన రుసుము వెనక్కి రావడానికి నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. 


సంస్థల పేరిట భూ లావాదేవీలు నిలిచి.. 

 ఽధరణికి ముందు పాతచట్టం ప్రకారం సంస్థల పేరిట కొన్న ఆస్తులకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయకూడదనే నిబంధన ఉండేది. క్రయవిక్రయాలన్నీ డాక్యుమెంట్‌ ఆధారంగానే జరిగేవి. ప్రస్తుతం ధరణి స్లాట్‌ ఆప్షన్‌లో పాస్‌బుక్‌ను తప్పనిసరి చేశారు. దీంతో సంస్థల పేరిట క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. పాత నిబంధనల ప్రకారం పాస్‌పుస్తకం ఇవ్వలేదని, అలాంటప్పుడు తామేం చేయగలమని.. లావాదేవీలు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్న సంస్థలు వాపోతున్నాయి. గతంలో ఏదైనా స్థలాన్ని ఓ సంస్థ తరపున కొనుగోలుచేస్తే ఆ సంస్థ పేరుతోపాటు అందులోని డైరెక్టర్ల పేరిటా రిజిస్ట్రేషన్‌ చేసే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం కేవలం సంస్థకు చెందిన ఒక డైరెక్టర్‌ పేరిటనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఈ విధానం వల్ల సంస్థలో బేధాభిప్రాయాలు వస్తే సమస్యలెదురయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయాలున్నాయి.


జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఏదీ? 

ధరణిలో జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ లేదు. జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ అయివున్న ఆస్తులను అమ్మాలన్నా  కొనాలన్నా వీలుకావడం లేదు. క్రయవిక్రయాల పరంగా ఒకే అమ్మకందారు.. ఒకే కొనుగోలుదారు ఉంటేనే లావాదేవీలు జరుగుతున్నాయి. గతంలో భాగస్వామ్య పద్ధతిలో కొనుగోలు చేసినవారు ఇప్పుడు దాన్ని అమ్ముకోవాలనుకున్నా, లేదంటే భాగస్వామ్య పద్ధతిలో భూమిని కొనుగోలు చేయాలనుకున్నా అది ధరణిలో సాధ్యమవ్వడం లేదు. గతంలో భాగస్తులుగా భూములు కొన్నవారికి లింక్‌ డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో భవిష్యత్తులో న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి కేసుల్లో సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఆప్షన్‌ ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో జీపీఏ, ఏజీపీఏలు తీసుకున్న వారు ఇతరులకు ఆస్తులు విక్రయించాలంటే ఇప్పుడు కుదరడం లేదు. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా జీపీఏ, ఏజీపీలకు మాత్రం అనుమతి ఇస్తున్నారు. 


ఇంకొన్ని సమస్యలు.. 

ధరణికి ముందు మ్యుటేషన్‌ నిమిత్తం డిజిటల్‌ సంతకానికి తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండేది. ధరణి అందుబాటులోకి వచ్చాక మీసేవ ద్వారా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. డిజిటల్‌ సైన్‌ కలెక్టర్‌ సకాలంలో చేస్తారా? అంటే చెప్పలేం. ఎందుకంటే కలెక్టర్‌ జిల్లా మొత్తానికి అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి కావడంతో ఎన్నో పనులు చూసుకుంటారు. కలెక్టర్‌ వద్ద ఎన్ని రోజుల్లో డిజిటల్‌ సైన్‌ అవుతుందో చెప్పలేని పరిస్థితి.  గతంలో తహసీల్దార్‌ వద్ద డిజిటల్‌ సైన్‌ సులువయ్యేది.


నాలా కన్వర్షన్‌కు చాలావరకు సర్వే నంబర్లు ఎర్రర్‌గా వస్తున్నాయి. కన్వర్షన్‌ ఒకరోజులో ఇస్తామని చెబుతున్నా.. ఎక్కడా సాధ్యపడటం లేదు. నాలా కన్వర్షన్‌ సమస్యపై గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకున్నా సకాలంలో స్పందించడం లేదు.


వారసత్వంగా సంక్రమించిన స్థలం విక్రయిస్తే ఆస్తిదారు కొడుకులు, ఇతర కుటుంబసభ్యుల అనుమతితో డాక్యుమెంటేషన్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారు. కానీ ధరణిలో అలాంటి ఆప్షన్‌ లేదు. ఎవరి పేరిట భూమి ఉంటే వారు విక్రయించుకోవచ్చు.  అయితే వారసత్వ ఆస్తులకు సంబంధించి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా విక్రయించరాదని చట్టం చెబుతుంది.


ధరణిలో ఈసీ కావాలనుకుంటే రాదు. సర్టిఫైడ్‌ కాపీ తీసుకోవాలంటే ఉండదు. ధరణి పుస్తకమే అన్నింటికీ ఆదారం. ఏదైనా అవసరాల కోసం తనకు భూమి ఉన్నదంటూ సర్టిఫైడ్‌ కావాలంటే దొరికే పరిస్థితి లేదు. చాలా వరకు అనేక గ్రామాల్లో ఉన్న వ్యవసాయ సర్వే నంబర్లు పూర్తిస్థాయిలో ఇంకా ధరణిలోకి ఎక్కలేదు.


జమాబందీ జరగాలి

క్షేత్రస్థాయిలో భూముల వద్దకు వెళ్లకుండానే 2017 భూరికార్డుల నవీకరణ చేశారు. ఆ రికార్డుల ఆధారంగానే ధరణిని రూపొందించారు. భూములు కలిగి, ఆ భూములకు పాస్‌పుస్తకాలు ఉన్నప్పటికీ చిన్న, సన్నకారు రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వలేదు. పార్ట్‌-ఏ(వివాదాల్లేని భూ ముల జాబితా) సరిగ్గా లేదు. పార్ట్‌-బీని అసలు ముట్టుకోలేదు. భూమికి రికార్డుకు సంబంధం లేకుండానే ధరణి ఉంది. లింకు కలవాలంటే ఏటా జమాబందీ చేయాలి. ఎకరానికి కనీసం రూ.4 నుంచి రూ.5 దాకా ఏటా భూమి శిస్తు వసూలు చేయాలి. రైతులు శిస్తు కడితే... తహసీల్దార్లపై కూడా భూమి రక్షణపై బాధ్యతలు పెరుగుతాయి. ధరణిలో లోపాలు సరిచేసుకోవాలనుకున్న ఏ రైతునూ కలెక్టర్లు కలవడం లేదు. 

 కోదండరెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ సెల్‌ నేత


వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ధరణి రికార్డులు

క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ధరణిలో రికార్డులున్నాయి. 60 శాతం లోపే రికార్డులు సరిగ్గా ఉన్నట్లులెక్కలున్నాయి. ఏ రికార్డులు లేకున్నా ధరణి ఫైన ల్‌ అంటే... చట్టంలో ఆ విషయం చెప్పాలి.  ఏ సమస్య వచ్చినా వివాదాల పరిష్కారానికి ఆప్షన్లు ఉన్నాయని చెబుతున్నా అవేమీ పనిచేయడం లేదు. భూముల వివాదాలంటే రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌(ఆర్‌వోఆర్‌) ఒక్కటే కాదు. ఇనామ్‌, సీలింగ్‌, అసైన్డ్‌ వివాదాలకు ధరణిలో పరిష్కారమేదీ? భూముల సర్వేలో క్షేత్రస్థాయిలో ఉండే వాస్తవాలను ప్రామాణికం చేసుకుంటారా? లేక ధరణిలోని రికార్డులే ప్రామాణికంగా సర్వే చేస్తారా ప్రభుత్వం చెప్పాలి. 

 సునీల్‌కుమార్‌, నల్సార్‌ యూనివర్సిటీ

Updated Date - 2021-04-03T08:48:08+05:30 IST