పాలమూరు వలసలు ఆగాయా?

ABN , First Publish Date - 2021-03-03T07:47:37+05:30 IST

‘‘బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి!.. వలసలు ఆగిపోతాయన్నారు. ఆగిపోయినయా? మీరే చెప్పాలి’’ అని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వైఎ్‌సఆర్‌ అభిమానులను షర్మిల అడిగారు.

పాలమూరు వలసలు ఆగాయా?

  • వైఎస్‌ పాలనలోనే 80-90%  ప్రాజెక్టులు
  • వాటిని పూర్తి చేయడంలో పాలకుల నిర్లక్ష్యం 
  • సంక్షేమ పాలన మళ్లీ రావాలన్నదే నా కోరిక 
  • రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుండి పోరాడుతా
  • పాలమూరు జిల్లా అభిమానుల భేటీలో షర్మిల
  • గల్ఫ్‌ వెళ్లి, ఆచూకీ తెలియని వారిపట్ల ఆవేదన 

 హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ‘‘బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి!.. వలసలు ఆగిపోతాయన్నారు. ఆగిపోయినయా? మీరే చెప్పాలి’’ అని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వైఎ్‌సఆర్‌ అభిమానులను షర్మిల అడిగారు. పాలమూరు జిల్లాలో వైఎ్‌సఆర్‌ తలపెట్టిన ప్రాజెక్టులను 80-90 శాతం వరకు ఆయనే పూర్తి చేయించారని, ఆ తర్వాత వచ్చిన పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇప్పుడైనా ఆ ప్రాజెక్టులు పూర్తయి నీళ్లు వస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. రాజన్న స్వర్ణయుగం, రాజన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలన్నదే తన కోరికని, దానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. లోట్‌సపాండ్‌లో మంగళవారం ఉమ్మడి మహమూబ్‌నగర్‌ జిల్లా వైఎస్‌ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎ్‌సఆర్‌ను అభిమానించే  ప్రతి గుండెకూ రాజన్న బిడ్డగా శిరస్సు వంచి.. చేతులు జోడించి.. మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నానన్నారు. 


కోహినూరు వజ్రం లభించిన పాలమూరును కరువు, వలసల జిల్లాగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు.. తాను తలపెట్టిన భీమా, కోయల్‌సాగర్‌, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులు పూర్తయితే దాదాపు పది లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని.. పాలమూరు జిల్లా పచ్చగా ఉంటుందని.. వలసలూ ఆగిపోతాయని.. నిజానికి జిల్లాలో ఆయన తలపెట్టిన ప్రాజెక్టులను ఆయనే 80-90ు వరకు పూర్తి చేయించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇప్పటికైనా ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాయా? వలసలు ఆగిపోయాయా?’’ అంటూ అభిమానులను షర్మిల ప్రశ్నించారు. పాలమూరు యూనివర్శిటీనీ వైఎ్‌సఆరే ఏర్పాటు చేయించారని చెప్పారు. వైఎ్‌సఆర్‌ తలపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఉమ్మడి మహమూబ్‌నగర్‌ జిల్లాలోనే 1.88 లక్షల మందికి.. రూ. 50 కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు. అంటే ఒక్కో పేషంట్‌కు సుమారు రూ. రెండున్నర లక్షల మేర లబ్ధి చేకూరిందన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అమలు ఎలా ఉందని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ముందుండి పోరాడతానని షర్మిల చెప్పారు. 


గుండె తరుక్కుపోయింది..! 

‘‘మెన్ననే పేపర్లో చదివాను. గల్ఫ్‌కు వలసపోయిన 120 మంది అచూకీనే లేదంట. ఆ కుటుంబాలు అనుభవించే నరకం అంతా ఇంతాకాదు. అసలు వారున్నారో.. లేదో..! నిజంగా గుండె తరుక్కుపోయింది. ఎందుకింత దుస్థితి? మీరే చెప్పాలి?’’ అంటూ షర్మిల అన్నారు. అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అభిమానులు ఒక్కొక్కరుగా తమ జిల్లాలో పరిస్థితిని వివరించారు. షర్మిల పెట్టబోయే పార్టీకి అండగా ఉంటామనీ చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి వచ్చిన లంబాడీ మహిళలు తమ సంప్రదాయ దుస్తులను షర్మిలకు అలంకరించారు. యాదవ నేతలు గొర్రెపిల్లను బహుకరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వైఎస్‌ అభిమాన సంఘం నాయకుడు జెట్టి రాజశేఖర్‌.. జ్ఞాపికను, జోగుళాంబ అమ్మవారి ప్రసాదాన్ని షర్మిలకు అందజేశారు. 


లోట్‌సపాండ్‌ ముందు కోలాహలం

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వైఎస్‌ అభిమానులతో సమావేశం జరిగినంత సేపూ లోట్‌సపాండ్‌ బయట అభిమానులు సందడి చేశారు. బాణాసంచా కాల్చారు. సమావేశం అనంతరం బయటికి వచ్చిన షర్మిల వారికి అభివాదం చేశారు. ఇదిలా ఉంటే ప్రముఖ యాంకర్‌ శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డి మంగళవారం లోట్‌సపాండ్‌లో షర్మిలను కలిశారు. ఎన్నికలప్పుడు ఏపీలో వైసీపీ తరఫున వీరు ప్రచారం చేశారు. 


10 లేదా 12న వరంగల్‌ జిల్లా  అభిమానులతో ఆత్మీయ సమావేశం

ఈ నెల 10 లేదా 12వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లా వైఎస్‌ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం జరగనున్నట్లు లోటస్‌ పాండ్‌ వర్గాలు చెప్పాయి. ఈ లోపున మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని లోట్‌సపాండ్‌లో మహిళలతో షర్మిల ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు వెల్లడించాయి. ఇటీవల విద్యార్థులతో నిర్వహించిన తరహాలోనే మహిళలతోనూ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపాయి. 

Updated Date - 2021-03-03T07:47:37+05:30 IST