Abn logo
Sep 6 2021 @ 00:17AM

దిగులు నౌక

శబ్దాలు, రణగొణ ధ్వనులు

లయిస్తుంటాయి, 

ఇంకుడుగుంతల్లాంటి చెవుల్లో

కిటికీ నుండి త్రికోణంలాంటి

ఆకుపచ్చని కొండ పిలుపు  

            ఆత్మీయంగా


వర్షం కోసం ఆక్రోశిస్తూ

జాలిచూపుల గాలిపటాలపై

పంపిన ఆహ్వన లేఖలెన్నో


ఆకాశం జల్లెడ

నక్షత్రాల కళ్ల గుండా

గుమ్మరిస్తోన్న నల్లమందులాంటి చీకటి


ఊడిన పెచ్చుల్ని నాలుకల్లా పెట్టి

వెక్కిరిస్తున్నా సరే,

గోడలతో సాగే సంధి ప్రయత్నాలు


ఎదురెదురు అద్దాల మధ్య

అనంతమైన ప్రతిబింబాలతో నించుని ఉన్నా

పలకరించే నీడల కోసం పలవరింత


కాంతులీనే గాజుతెరపై

చూపుడు వేలి విన్యాసంతో

చర్మపంజరంలో బందీ జీవుడు

కాలానికీ, దూరానికీ పోటీగా

దిగంతాలకేసి ప్రయాణిస్తున్నాడు

దిగులు నౌకలో, ఒంటరిగా...మల్లారెడ్డి మురళీ మోహన్‌

88611 84899

ప్రత్యేకంమరిన్ని...