Kuwait వెళ్లాలా? ఇంకేందుకు ఆలస్యం లగేజీ సర్దుకోండి!

ABN , First Publish Date - 2021-09-07T15:07:35+05:30 IST

ఎట్టకేలకు కువైత్, భారత్ మధ్య డైరెక్ట్ విమానాల ప్రారంభానికి లైన్‌క్లియర్ అయింది.

Kuwait వెళ్లాలా? ఇంకేందుకు ఆలస్యం లగేజీ సర్దుకోండి!

కువైత్ సిటీ: ఎట్టకేలకు కువైత్, భారత్ మధ్య డైరెక్ట్ విమానాల ప్రారంభానికి లైన్‌క్లియర్ అయింది. మంగళవారం(సెప్టెంబర్ 7) నుంచి ఇరుదేశాల మధ్య డైరెక్ట్ విమానాలు నడవనున్నాయి. రెండు రోజుల క్రితం వరకు ఈ విషయమై ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. అందుకు కారణం భారత పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నుంచి ఈ విషయంలో క్లారిటీ లేకపోవడమే. కానీ, కువైత్ సివిల్ ఏవియేషన్ మాత్రం ముందుగానే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత్ నుంచి డైరెక్ట్ విమానాలు నడిపిస్తామని ప్రకటించింది. తాజాగా భారత్‌ కూడా కువైత్‌కు డైరెక్ట్ విమానాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


ఇక మంగళవారం తొలి విమానం కువైత్‌కు చెందిన జజీరా ఎయిర్‌వేస్ నడపనుంది. కొచ్చి నుంచి ఇవాళ ఉదయం 6 గంటలకు ఈ విమానం కువైత్ వెళ్లనుంది. అలాగే తర్వాతి రెండు విమానాలు కూడా కువైత్ ఎయిర్‌లైన్లే నడపనున్నాయి. ఇందులో ఒకటి ముంబై, మరోకటి చెన్నై నుంచి కువైత్ వెళ్లనున్నాయి. కాగా, ఇండిగో కూడా అహ్మదాబాద్ నుంచి ఓ విమాన సర్వీస్ నడపనుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొచ్చి నుంచి మరో విమానం నడిపేందుకు సిద్ధమైంది. వీటితో పాటు బుధవారం జజీరా ఎయిర్‌వేస్ ఢిల్లీ నుంచి మరో విమాన సర్వీస్‌ను షెడ్యూల్ చేసింది. కనుక కువైత్ వెళ్లాలనుకునే వారు ఆలస్యం చేయకుండా లగేజీ సర్దుకోవడమే.  


ఇదిలాఉంటే.. ఇటీవల కువైత్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) భారత్‌కు వారానికి 5,528 సీట్ల కోటాను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ కోటాలో ఇరు దేశాలకు చెందిన క్యారియర్లు చెరో సగం సీట్లు పంచుకోనున్నాయి. అటు కువైత్ అంతర్జాతీయ విమానశ్రయానికి డైలీ రావాల్సిన ప్రయాణికుల సామర్థ్యాన్ని కూడా డీజీసీఏ 10వేలకు పెంచింది. 

Updated Date - 2021-09-07T15:07:35+05:30 IST