మహాత్ముని స్మృతికి మహాపచారం

ABN , First Publish Date - 2021-07-17T06:02:51+05:30 IST

గాంధీ అంటే సత్యం, పారదర్శకత, మతపరమైన బహుళవాదం. మోదీ అంటే గుప్తత, అధికసంఖ్యాకవాదం. మరి మోదీ మహాత్మునితో చారిత్రక చుట్టరికాన్ని ఎలా చాటుకుంటున్నారు? ఆయన అలా చాటుకోవడానికి అనర్హుడని....

మహాత్ముని స్మృతికి మహాపచారం

గాంధీ అంటే సత్యం, పారదర్శకత, మతపరమైన బహుళవాదం. మోదీ అంటే గుప్తత, అధికసంఖ్యాకవాదం. మరి మోదీ మహాత్మునితో చారిత్రక చుట్టరికాన్ని ఎలా చాటుకుంటున్నారు? ఆయన అలా చాటుకోవడానికి అనర్హుడని తర్కం, నైతికత సూచిస్తున్నాయి. అయితే మహాత్ముని నుంచి స్ఫూర్తి పొందిన నేతగా గణుతికెక్కాలని అధికారం, కీర్తికాంక్ష మోదీని అలా నడుపుతున్నాయి. తన చరిత్రను గాంధీ ధవళకాంతితో మెరిపించుకోవాలని మోదీ ప్రగాఢంగా ఆశిస్తున్నారు. అందుకు ఆయన చేస్తున్న తాజా ప్రయత్నంలో భాగమే సబర్మతీ ఆశ్రమాన్ని మౌలికంగా పునర్నిర్మించే ప్రాజెక్టు.


అహ్మదాబాద్‌ను నేను మొట్ట మొదట 1979లో సందర్శించాను. 1980 లలో వృత్తిపరమైన, వ్యక్తిగత పనుల కోసం తరచు ఆ నగరానికి వెళుతుండే వాణ్ణి. గాంధీపై పరిశోధన ప్రారంభించిన తరువాత అహ్మదాబాద్‌తో నా అనుబంధం మరింత ప్రగాఢమయింది. 2002లో గుజరాత్‌లో భయానక మతతత్వ మారణకాండ సంభవించిన అనంతరం ఆ నగరానికి వెళ్ళినప్పుడు సహజంగానే సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించాను. ఆ ఆశ్రమ ధర్మకర్తలలో ఒకరితో చాలాసేపు మాట్లాడాను. గుజరాత్ మారణహోమం ‘మహాత్ముని రెండో హత్య’ అని ఆయన అభివర్ణించారు. 


ఎవరి పహరాలో నైతే ఆ పైశాచిక హత్యాకాండ జరిగిందో ఆ వ్యక్తి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుయాయి. గాంధీ విశాల, మానవీయ ప్రపంచ దృక్పథాన్ని సంపూర్ణంగా వ్యతిరేకించే సంస్థ ఆరెస్సెస్. సంఘ్ సర్ ‌సంఘ్ చాలక్ ఎమ్‌ఎస్ గోల్వాల్కర్ గాంధీ ద్వేషి. మోదీకి గోల్వాల్కర్ ‘పూజనీయ శ్రీ గురూజీ’. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించింది చాలా చాలా అరుదు. అయితే ప్రధానమంత్రి అయిన తరువాత ఆ ఆశ్రమంపై విశేష శ్రద్ధాసక్తులు చూపసాగారు. జపాన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రులు, అమెరికా, చైనా అధ్యక్షులకు మోదీ స్వయంగా ఆ ఆశ్రమాన్ని చూపి, అందులోని వివిధ ప్రదేశాల చారిత్రక విశిష్టతను వివరించారు. 


సబర్మతీ ఆశ్రమ ధర్మకర్తలు, సిబ్బందిలో చాలామందికి గాంధీ జీవితం, సిద్ధాంతాలపై సమగ్రమైన, లోతైన అవగాహన ఉంది. ఆశ్రమాన్ని సందర్శించే విదేశీ ప్రముఖులకు ఆ పవిత్ర ప్రదేశం గురించి విపులంగా వివరించే బాధ్యతను వారిలో ఒకరికి అప్పగించే బదులు గాంధీ ద్వేషుల శిక్షణలో ఎదిగిన మోదీ తానే స్వయంగా నిర్వర్తించేందుకు ఉత్సాహపడుతున్నారు. గాంధీ పట్ల మోదీ బహిరంగంగా ప్రదర్శిస్తున్న విశేష శ్రద్ధాసక్తులను ఎలా అర్థం చేసుకోవాలి? మతపరమైన వివక్షలను జీవితాంతం వ్యతిరేకించి, అంతర్–-మత సామరస్యానికి జీవితాన్ని బలి ఇచ్చిన మహాత్ముడు గాంధీ. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని పార్టీకి లోక్‌సభలో ఉన్న 300 మంది ఎంపీలలో ఒక్క ముస్లిం కూడా లేడు. ముస్లింలను అప్రతిష్ఠ పాలు చేసేందుకు చట్టాలను తీసుకువచ్చిన ప్రభుత్వం మోదీది. గాంధీ ఆమోదించలేని రాజకీయాలను ఆచరిస్తున్న పార్టీ నాయకుడు మోదీ. ‘సత్యమేవ జయతే’ అని ఎలుగెత్తిన ప్రవక్త మహాత్ముడు. మరి మోదీ విషయమేమిటి? ఆయన ప్రభుత్వం అసత్యాచరణలో అగ్రగామి. కనుకనే ‘అసత్యమేవ జయతే’ అనేది భారతీయ జనతాపార్టీ ధర్మసూత్రంగా ఉండడం సముచితంగాను, వాస్తవికంగాను ఉంటుందని నాకు తెలిసిన ఒక రచయిత వ్యాఖ్యానించారు. 


గాంధీ అంటే సత్యం, పారదర్శకత, మతపరమైన బహుళవాదం. మోదీ అంటే గుప్తత, అధిక సంఖ్యాకవాదం. మరి ఆయన మహాత్మునితో చారిత్రక చుట్టరికాన్ని ఎలా చాటుకుంటున్నారు? ఆయన అలా చాటుకోవడానికి అనర్హుడని తర్కం, నైతికత సూచిస్తున్నాయి. అయితే మహాత్ముని నుంచి స్ఫూర్తి పొందిన నేతగా గణుతికెక్కాలని అధికారం, కీర్తికాంక్ష మోదీని అలా నడుపుతున్నాయి. తన చరిత్రను గాంధీ ధవళకాంతితో మెరిపించుకోవాలని మోదీ ప్రగాఢంగా ఆశిస్తున్నారు. అందుకు ఆయన చేస్తున్న తాజా ప్రయత్నంలో భాగమే సబర్మతీ ఆశ్రమాన్ని మౌలికంగా పునర్నిర్మించే ప్రాజెక్టు. ‘ప్రపంచస్థాయి స్మారక చిహ్నం’గా రూపొందించే మిషతో ఆ పవిత్ర ప్రదేశాన్ని తన ఆలోచనలకు అనుగుణంగా మార్చివేయడానికి మోదీ సంకల్పించారు. భారీ నిధులతో, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అమలుపరచనున్నారు. 


నా జీవితమే నాసందేశం అని గాంధీజీ అన్నారు. చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకునేందుకు ఏ స్టేడియానికి తన పేరు పెట్టుకోవల్సిన అవసరం ఆయనకు లేదు. గత పాలకుల కీర్తికాంతులను మరుగుపరచి తన యశో విభవాన్ని చాటుకునేందుకు రాజధాని నగరం రూపురేఖలు మార్చవలసిన అవసరం అంతకన్నా లేదు. సబర్మతీ ఆశ్రమం నేడు ఉన్న తీరులో గాంధీకి సరైన స్మారక చిహ్నం. ఆ ఆశ్రమంలోని అందమైన చిన్న చిన్న గృహాలు గాంధీ జీవితకాలంలో ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలానే ఉన్నాయి. పచ్చని వృక్షాలు, పక్షుల కూజితాలు ఆ పాత రోజులను గుర్తుకు తెస్తాయి. విశాలమైన ప్రాంగణమది. సందర్శకులకు ప్రవేశ రుసుము ఉండదు. కాపలాకు లాఠీలు, తుపాకులతో పోలీసులు ఎవరూ ఉండరు. ఆశ్రమం ఎదుటనే సుందరమైన సబర్మతీ నది. ఒక విలక్షణ వాతావరణం సదా సందర్శకులను ఆహ్వానిస్తుంది. ఇటువంటి విశిష్టత భారత్‌ లోని ఏ ఆశ్రమం, మ్యూజియంకు లేదనడంలో అతిశయోక్తి లేదు. 


గాంధీ నెలకొల్పిన ఐదు ఆశ్రమాల (దక్షిణాఫ్రికాలో రెండు, భారత్‌లో మూడు)లో సబర్మతీ ఆశ్రమం చాలా ప్రధానమైనది. సువిశాల భారతదేశం నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా సకల దేశాల నుంచి ఏటా ఎంతో మంది ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. ఆ నెలవు అందం, నిరాడంబరత ప్రతి ఒక్కరినీ ముగ్ధులను చేస్తాయి. దాని చారిత్రక ప్రాముఖ్యతలు వారికి ఎంతో స్ఫూర్తి నిస్తాయి. వికృత సౌందర్యోపాసన లేదా సౌందర్య అసభ్యత (ఈస్థటిక్ బార్బేరిజం)కు, స్మారక కట్టడాలు, చిహ్నాల ఆరాధనకు పేరుపడ్డ ప్రభుత్వం సబర్మతి ఆశ్రమానికి సంబంధించి ‘ప్రపంచస్థాయి’ అనే విశేషణాన్ని ఉపయోగించడం వెన్నులో వణుకు పుట్టించడం లేదూ? ఈ ఆశ్రమ పునః రూపకల్పనకు మోదీ ఎంపిక చేసుకున్న వాస్తుశిల్పి బిమల్ పటేల్ కావడం మరింత భయంగొల్పుతోంది. పటేల్ సృజించిన సౌధప్రణాళికలు విలక్షణమైనవి కావు. అవి పూర్తిగా కాంక్రీట్ కట్టడాలు. మరి గాంధీ ఆశ్రమాలలోని గృహాలు, వాటికలు పూర్తిగా భిన్న లక్షణాలు గలవి. ప్రధాని మోదీకి తెలిసిన ఏకైక వాస్తుశిల్పి, బహశా, బిమల్ పటేల్ మాత్రమే కావచ్చు. ఢిల్లీ, వారణాసి, అహ్మదాబాద్‌లలోని వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల వలే సబర్మతీ పునః రూపకల్పన బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. తనకు నమ్మకస్తులయిన కొంత మంది సివిల్ సర్వెంట్స్‌ను కూడా ఈ ప్రాజెక్ట్ పరిపూర్తికి నియోగించారు.


సబర్మతీ ఆశ్రమ పునర్నిర్మాణ ప్రణాళికను పూర్తిగా మోదీ ఆంతరంగికులే రూపొందించారు. వాస్తుశిల్పులు, పర్యావరణ సంరక్షకులు, గాంధేయవాదులు, చరిత్ర పండితులు ఎవరినీ సంప్రదించనే లేదు. చివరకు సబర్మతీ ఆశ్రమ ధర్మకర్తలకు సైతం ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించలేదు.


మోదీ సంకల్పించిన సబర్మతి ఆశ్రమ ప్రాజెక్టు ఒక రహస్య రూపకల్పన. పైగా అది ఆశ్రిత పక్షపాతానికి ప్రతిబింబంగా ఉంది. 1960లలో ఆశ్రమానికి ఒక మ్యూజియం అవసరమని ధర్మకర్తలు భావించినప్పుడు దాని రూపకల్పనకు వారు ఎంపిక చేసుకున్నది గుజరాతీ వాస్తుశిల్పిని కాదు, ముంబైకి చెందిన చార్లెస్ కొరియాని. భిన్నమతస్థుడు, భిన్నప్రాంతానికి చెందిన వాడు. ప్రాంతీయ సంకుచితత్వం లేని గాంధీ దృక్పథానికి కొరియా ఎంపిక అనుగుణంగా ఉంది. ఆయన అప్పటికే సుప్రసిద్ధుడు. సబర్మతీ ఆశ్రమపరిసరాలు, చరిత్రను దృష్టిలో ఉంచుకుని ఒక అందమైన మ్యూజియానికి కొరియా రూపకల్పన చేశారు. అది అందరి ప్రశంసలను పొందింది. ఒక కోటీశ్వరుడు సముద్ర తీరంలోనూ, కొండల పైన, పట్టణంలోనూ, ఎడారిలోనూ ఒకే వాస్తుశిల్పితో గృహాలు నిర్మించుకోవచ్చు. వాటి నిర్మాణానికి వెచ్చించే నిధులు ఆయన సొంతం గనుక ఒకే వాస్తుశిల్పిచేత రూపకల్పన చేయించుకోవడం నైతికంగా నిరాక్షేపణీయమైన విషయం. అయితే ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల బాధ్యతను ఒకే వాస్తు శిల్పికి అప్పగించడం న్యాయమేనా? ఒకే వాస్తుశిల్పి పురాతన ఆలయనగరం, నవీన రాజధాని, గాంధీ ఆశ్రమం పునఃరూపకల్పనకు అర్హుడు అవడం మోదీ ప్రభుత్వ బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి నిదర్శనం. 


మోదీ, ఆయన సహచరులు రూపొందించిన ప్రణాళికలు నిరాటంకంగా అమలవుతాయి. మహాత్ముని పట్ల గౌరవాభిమానాలతో కాకుండా తన సొంత ప్రతిష్ఠను మరింతగా మెరుగుపరుచుకునేందుకు, తన గత చరిత్రను పునఃరచించుకునేందుకే సబర్మతీ ఆశ్రమ ప్రాజెక్టుకు మోదీ పూనుకున్నారనేది స్పష్టం. న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా విధ్వంసంపై తీవ్రవిమర్శలు వెలువడుతున్నాయి. అయితే నైతిక దృక్పథం నుంచి చూసినప్పుడు సబర్మతీ ఆశ్రమ పునఃరూపకల్పన అనేది మరింత ఆందోళనకరమైన విషయం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి రాజధాని నగరంలోని ప్రభుత్వస్థలాలలో తనకు నచ్చిన విధంగా కొత్త కట్టడాలను నిర్మించడానికి పూనుకోవడం పూర్తిగా న్యాయసమ్మతమే. అయితే సబర్మతీ ఆశ్రమం విషయం పూర్తిగా భిన్నమైనది. ఆ ఆశ్రమం, గాంధీ కేవలం అహ్మదాబాద్, గుజరాత్ లేదా భారత్‌కు మాత్రమే చెందినవారు కాదు, నడయాడుతున్న ప్రతి మనిషికీ, పుట్టబోయే ప్రతి మనిషికీ చెందినవారు. తన జీవితమంతా గాంధీ ఆదర్శాలకు విరుద్ధంగా పనిచేసిన రాజకీయవేత్త నరేంద్ర మోదీ. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు పొందడంలో పాలకుడికి సన్నిహితుడు కావడమే ప్రధాన అర్హతగా గల వాస్తుశిల్పి బిమల్ పటేల్. మహాత్ముని పవిత్ర స్మృతికి నెలవయిన సబర్మతీ ఆశ్రమ రూపురేఖలు మార్చే హక్కు ప్రస్తావిత రాజకీయవేత్తకు, వాస్తుశిల్పికి లేదు గాక లేదు.




రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2021-07-17T06:02:51+05:30 IST