1.35లక్షల మందికి ‘ఉపాధి’

ABN , First Publish Date - 2020-05-17T10:43:40+05:30 IST

ఖమ్మం జిల్లాలో లక్షా 35వేల మంది కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

1.35లక్షల మందికి ‘ఉపాధి’

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

సత్తుపల్లి మండలంలో కూలీలకు కిట్ల పింపిణీ


సత్తుపల్లి, మే16: ఖమ్మం జిల్లాలో లక్షా 35వేల మంది కూలీలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. సత్తుపల్లి మండలం యాతాలకుంటలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో కూలీలకు బత్తాయి పండ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మాస్కులతో కూడిన కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ శనివారం ప్రారంభించారు.


ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించటంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం లేబర్‌ కాంపోనెంట్‌తో పాటు రాబోయే రోజుల్లో మెటీరియల్‌ కాంపోనెంట్‌ పెరుగుతుందని మంత్రి తెలిపారు. ఉపాధి కూలీలు కూడా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలన్నారు. లాక్‌డౌన్‌ కష్టకాలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజల మధ్యలోనే ఉంటూ వారికి సేవలందించి అన్నిరకాలుగా ఆదుకున్నారన్నారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా రైతులకు చేయూతను ఇచ్చే విధంగా అక్కడి నుంచి బత్తాయి పండ్లను తెప్పించి ఈజీఎస్‌ కూలీలకు అందిస్తున్నారంటూ అభినందించారు.


‘42వేల మంది కూలీలకు పంపిణీ’

సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు బత్తాయి పండ్లతో కూడిన కిట్లను అందజేస్తున్నామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. రోజుకు ఒక మండలంలో కూలీలకు వీటిని అందజేస్తామన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో రైతులకు ఇబ్బంది లేకుండా నియోజకవర్గం నుంచి 1.35లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి తరలించామని, 85వేల క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశామని చెప్పారు.


పండ్ల రైతుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించామని చెప్పారు. వివిధ చేతివృత్తులకు చెందిన 10వేల మందికి నిత్యవసర వస్తువులను పంపిణీ చేశామని, లాక్‌డౌన్‌ సమయంలో పేదలను ఆదుకునేందుకు సత్తుపల్లి నియోజకవర్గంలో పలువురు దాతృత్వాన్ని చాటుకున్నారని ప్రశంసించారు. కార్యక్రమలో జిల్లా కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, ఎంఎల్‌సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, జడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-05-17T10:43:40+05:30 IST