ఫస్ట్‌ నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ: హరీశ్‌

ABN , First Publish Date - 2020-03-30T10:16:54+05:30 IST

కరోనాతో కష్టాలు పడుతున్న పేద ప్రజలకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్‌ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తామని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా

ఫస్ట్‌ నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ: హరీశ్‌

జహీరాబాద్‌, మార్చి 29: కరోనాతో కష్టాలు పడుతున్న పేద ప్రజలకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్‌ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తామని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో ఆదివారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం ఇస్తామని, వారి బ్యాంకు ఖాతాలో రూ.1500 వేస్తామని చెప్పారు. కరోనాతో ప్రజలు ఆందోళన చెందొద్దని, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఐసోలేషన్‌ సెంటర్లను సిద్ధంగా ఉంచామని, మందుల కొరత లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో అమ్ముకునేందుకు వ్యవసాయ అధికారులు అనుమతి ఇస్తారన్నారు.


వచ్చే 10 రోజులు మరింత కఠినమని, లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని, అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పల్లెలు, పట్టణాల్లో హైపోక్లోరైట్‌ మందును పిచికారి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-03-30T10:16:54+05:30 IST