Abn logo
Nov 26 2021 @ 02:56AM

గూడు చెదిరి.. గుండె పగిలి

అన్నమయ్య డ్యామ్‌ కట్ట తెంచుకున్న వరదకు రాళ్లకుప్పగా పులపుత్తూరు

ఇసుక దిబ్బగా తోగూరుపేట

వేల ఎకరాల్లో ఇసుకమేటలు

వారమైనా మానని గాయం

కడప పల్లెల్లో ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌


(కడప-ఆంధ్రజ్యోతి)

అన్నమయ్య డ్యామ్‌ కట్ట తెగకముందు అది ‘కోనసీమ’. వరి, మామిడి, సపోటా, అరటి తోటలు.. ఇంటింటా పాలధారలు.. లేగదూడ అరుపులు! ఈ పల్లె అందాలన్నింటినీ లక్షల క్యూసెక్కుల వరద ఉప్పెనై కప్పేసింది. గంట వ్యవధిలోనే పులపుత్తూరు రాళ్లకుప్పయింది. ‘ఇక్కడ ఊరు ఉండేదా..!’ అన్నట్టు వరద ఈ గ్రామంలో బీభత్సం రేపింది. తోగూరుపేట, మండ్లపల్లి, గుండ్లూరు.. ఏ పల్లెకి వెళ్లినా.. ఎవరిని కదిపినా ఇదే దుస్థితి. ‘గూడు చెదిరి.. గుండె పగిలి మాకెవరు దిక్కు’ అంటూ విలపిస్తున్న ఆ గ్రామాల్లో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ పర్యటించింది. చెయ్యేరు వరద ముంచెత్తడంతో కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరులో 150 ఇళ్లు, తోగూరుపేటలో 75 నివాసాలు, మండ్లపల్లెలో పదికి పైగా ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. మిగిలిన ఇళ్లు కూడా ఇళ్లలాగా కనిపిస్తున్నా.. పునాదులు కుంగిపోయాయి. గోడలు నెర్రలిచ్చాయి. అలాంటి ఇళ్లలో రాత్రుళ్లు  పడుకోవడానికి జనం భయపడుతున్నారు. పులపుత్తూరు దళితవాడలో సర్కారు వారు ఇచ్చిన ప్లాస్టిక్‌ కవర్లను టెంట్లుగా వేసుకుని కాలం వెల్లదీస్తున్నారు. కొందరైతే.. రేకులషెడ్డు కింద దాతలు ఇచ్చిన సామానులు దాచుకుంటూ చలికి వణుకుతూ, ఎండకు ఎండుతున్నారు. వృద్ధులు, మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 


రాత్రయితే బితుకు బితుకు..

సురక్షిత ప్రాంతాల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి పునరావాసం కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చేపట్టిన చర్యలు శూన్యం. టార్పాలిన్‌ పట్టలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. సహాయక చర్యల విషయానికి వస్తే.. వీధుల్లో బురద తొలగించారు. ట్యాంకుల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. సచివాలయం దగ్గర ఆహారాన్ని ఏర్పాటు చేశారు. రూ.5,800 ఆర్థిక సాయం అందించారు. ఇంతటితో తమ పని అయిపోయిందనుకున్నారేమో! బాధితులు మాత్రం నిలువ నీడలేక రాత్రుల్లో పడరాని పాట్లు పడుతున్నారు. పులపుత్తూరు, మండ్లపల్లి గ్రామాలకు, కొన్ని దళితవాడలతోపాటు పలు కాలనీలకు ఇంకా కరెంటు పునరుద్ధరించలేదు. వరద ముంపు గ్రామాల్లో బురద, కుళ్లిన వస్తువుల దుర్గంధానికి దోమల బెడద అధికమైంది. చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. ఏఈఎంఎస్‌, 104 వైద్యసేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు పెట్టి వైద్యసేవలు అందిస్తున్నా.. బాధితుల అవసరాలను ఆ సేవలు పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. 


నాన్న లేడని ఎలా చెప్పాలి..

‘‘అమ్మా.. చెయ్యేరు వరద వస్తే నాన్న మనందరినీ బయటకు పంపించాడు.. నాన్నెందుకు ఇంకా రాలేదమ్మా’ అంటూ.. కూతురు ప్రశ్నిస్తుంటే.. ‘నాన్న వరదలో కొట్టుకుపోయాడ’ని ఎలా చెప్పేది? నాన్న కనిపించలేదనే బెంగతో జ్వరం తెచ్చుకున్న నా పాపకు ఎప్పటికి బాగవుతుంది.ప్రభుత్వం ఇస్తామన్న రూ.5 లక్షలు ఇంకా ఇవ్వలేదు. రూ.5,800 మాత్రమే ఇచ్చారు. ఇల్లు, సామగ్రి, నగలు, కోల్పోయి రూ.25లక్షలకు పైగా నష్టపోయాం. ప్రభుత్వమే ఆదుకోవాలి’’

- పల్లం ఆదిలక్ష్మి, పులపుత్తూరు, రాజంపేట మండలం


మానని వరద గాయం..

ఉబికివస్తున్న కన్నీటి వరదను అతికష్టమ్మీద ఆపుకొంటూ.. చెయ్యేరు వరద మిగిల్చిన కష్టాలు వివరిస్తున్న ఈమె పేరు ఉమారాణి. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరుకు చెందిన ఈమె భర్త శంకర్‌ రెడ్డి మాజీ సర్పంచ్‌. ‘‘అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోవడంతో వరద ముంచి రూ.3 కోట్లకు పైగా నష్టపోయాం. 25 ఎకరాల పొలం రాళ్లకుప్పలు, ఇసుక దిబ్బగా మారింది. పదెకరాల్లో మామిడి తోట, 450 చెట్లు వరదకు కొట్టుకుపోయాయి. ఆరు విద్యుత్‌ పంపులు కనిపించకుండా పోయాయి. ఇంట్లో సామగ్రి సర్వం కొట్టుకుపోయింది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం. మా ఊళ్లో ఎందరికో పెళ్లిళ్లు చేశాం. పదిమందికి అన్నం పెట్టాం. అడిగిన వారికి కాదనకుండా ఇచ్చిన చేతులు మావి. అలాంటి ఇప్పుడు  అందరినీ అర్థించాల్సి వస్తోంది’’ అంటూ మానని వరద గాయాలను తడుముకున్నారు. 


జరగాల్సింది ఇదీ....

బ్యాంకులో పంట రుణాలు, పాడి పోషణ కోసం తెచ్చుకున్న డ్వాక్రా రుణాలు రద్దు చేయాలి. 

ఏడాదిలోపు ప్రభుత్వమే ఉపాధి హామీ కింద ఇసుకమేటలు తొలగించి భూములను సాగులోకి తీసుకురావాలి. 

ఇంట్లో కొట్టుకుపోయిన సిలిండర్లు, కూలర్లు, టీవీలు, బట్టలు వంటివి ప్రభుత్వమే కొనిఇవ్వాలి.

సురక్షిత ప్రాంతాల్లో స్థలాలిచ్చి ఇంటికి రూ.10లక్షల చొప్పున ఖర్చు చేసి శాశ్వత పక్కా ఇళ్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి. 

పాడిపశువులను ప్రభుత్వమే కొని ఇవ్వాలి