ఆచితూచి ఖర్చు!

ABN , First Publish Date - 2020-10-21T09:03:09+05:30 IST

ఒకపక్క ప్రముఖ బ్రాండ్లన్నీ దీపావళి సీజన్‌లో భారీ అమ్మకాలపై ఆశలు పెట్టుకుంటే వారి ఆశలను నీరుగార్చే వాస్తవాలు ..

ఆచితూచి ఖర్చు!

దీపావళికి వినియోగ వ్యయం అంతంతే..

యుగవ్‌ సర్వే వెల్లడి 


ముంబై: ఒకపక్క ప్రముఖ బ్రాండ్లన్నీ దీపావళి సీజన్‌లో భారీ అమ్మకాలపై ఆశలు పెట్టుకుంటే వారి ఆశలను నీరుగార్చే వాస్తవాలు ఒక సర్వేలో వెల్లడయ్యా యి. సగం మందికి పైగా ఆర్థిక వనరుల వ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించనున్నట్టు ప్రకటించడంతో ప్రముఖ కంపెనీలు ఆశలు పెట్టుకున్నంత జోరుగా అమ్మకాలుండకపోవచ్చని ఆ సర్వే తేల్చింది. మార్కెట్‌ పరిశోధన సంస్థ యుగవ్‌ 10 ప్రాధాన్యతాంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది. గృహస్థుల స్థూల ఆదాయం, వ్యయాల్లో పెరుగుదల లేదా తగ్గుదల, దీపావళి సీజన్‌లో వ్యయధోరణులు ఇందులో ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్నారు. సెప్టెంబరు 21-25 తేదీల మధ్య నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 2500 మందిని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక మాంద్యం ఆవరించిన స్థితిలో పండగల సీజన్‌ డిమాండును పునరుత్తేజింప చేస్తుందని వ్యాపారులు ఆశగా ఉన్నారని, కానీ కస్టమర్లలో మాత్రం ఆసక్తి చాలా తక్కువగా ఉన్నదని కంపెనీ జనరల్‌ మేనేజర్‌ దీపా భాటియా అన్నారు.


ముఖ్యాంశాలు

స్థూల ఆదాయం పెరిగిందన్న గృహస్థుల సంఖ్య 15 శాతం మాత్రమే ఉంది

గతంతో పోల్చితే వ్యయాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని సుమారు 50 శాతం మంది చెప్పారు

గత దీపావళి సీజన్‌లో పెట్టిన వ్యయాలతో సమానంగా ఖర్చు చేస్తామని చెప్పిన వారు 20 శాతం ఉండగా ఎక్కువ ఖర్చు చేస్తామన్న వారు 17 శాతం

అధిక శాతం ఆన్‌లైన్‌ షాపింగ్‌కే మొగ్గు చూపారు. 54ు మంది ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే వెళ్లవచ్చు

ఆభరణాలు, ఖరీదైన వస్తువుల కొనుగోలుకు దుకాణాలకు వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు

వర్గీకరణ విషయానికి వస్తే గాడ్జెట్లలో స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు అత్యధికంగా 48 శాతం ఉండవచ్చు. 

  లాప్‌టా్‌పలు (33 శాతం), వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్లు (28 శాతం), స్మార్ట్‌ టీవీలు (25 శాతం), మైక్రోవేవ్‌ ఓవెన్లు (20 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి

సాంప్రదాయికంగా భారత్‌ ఆటోమేషన్‌ ఉత్పత్తులకు పెద్ద మార్కెట్‌ కాకపోయినా కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ మంది ఆటోమేషన్‌ వైపే మొగ్గు చూపారు.

Updated Date - 2020-10-21T09:03:09+05:30 IST