స్టాలిన్‌కు అధికారమిస్తే ఎడ్లబండ్లతో వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు...
ABN , First Publish Date - 2021-03-17T20:46:13+05:30 IST
తమిళనాడు ఎన్నికల్లో పార్టీల హామీలు కోటలు దాటుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, గృహిణులకు..
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో పార్టీల హామీలు కోటలు దాటుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, గృహిణులకు నెలవారీ సాయం, ఉచిత ఇళ్లు, నీట్ రద్దు, మద్యం దుకాణాల మూత వంటి హామీలతో ప్రధాన పార్టీలు ఊదరగొడుతున్నాయి. ద్రవిడ మున్నేట కళగం (డీఎంకే) అభ్యర్థి సెంథిల్ బాలాజీ మరో అడుగు ముందుకు వేసి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాలకే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తామంటూ వాగ్దానం చేశారు. కరూర్ నియోజకవర్గం నుంచి సెంథిల్ బాలాజీ పోటీ చేస్తున్నారు.
'డిఎంకే అధికారలోకి రాగానే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తారు. దళపతి (స్టాలిన్) సీఎంగా ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తే, 11.05 నిమిషాలకల్లా మీరు నేరుగా మీ ఎద్దుల బండితో నదికి వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు. అధికారులెవరూ మిమ్మల్ని అడ్డుకోరు. అలా జరిగితే నాకు ఫోను చేయండి. ఆ అధికారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తాం' అని సెంథిల్ బాలాజీ అన్నారు.