కవల పిల్లల కాన్పు విషయమై వైద్యుల క్లారిటీ.. గర్భంలోనే మొదటి శిశువు మృతి అంటూ..

ABN , First Publish Date - 2020-06-29T17:27:38+05:30 IST

కవల పిల్లల కాన్పు విషయంలో భద్రాచలం ఏరియా వైద్యశాల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రచార మాద్యమాల్లో వస్తున్న వార్తలు

కవల పిల్లల కాన్పు విషయమై వైద్యుల క్లారిటీ.. గర్భంలోనే మొదటి శిశువు మృతి అంటూ..

కవల పిల్లల కాన్పు విషయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం లేదు

భద్రాద్రిలో 40 పడకలతో కరోనా ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు

విచారణ నిర్వహించిన డీసీహెచ్‌ఎ్‌స డా. రమేష్‌

రెండో శిశువు మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎంకు తరలింపు 


భద్రాచలం (ఆంధ్రజ్యోతి): కవల పిల్లల కాన్పు విషయంలో భద్రాచలం ఏరియా వైద్యశాల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రచార మాద్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాదరమని డీసీహెచ్‌ఎ్‌స డా. రమేష్‌ అన్నారు. శనివారం ఏరియా వైద్యశాలలో కవల పిల్లల కాన్పు విషయంలో పత్రికల్లో వచ్చిన కథనాల క్రమంలో ఆదివారం వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు డీసీహెచ్‌ఎస్  విచారణ నిర్వహించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం నర్సింహాపురానికి చెందిన ముచ్చిక సునీత కవల పిల్లల కాన్పులో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం లేదని పేర్కొన్నారు. మొదటి శిశువు గర్భంలోనే చనిపోయిందని, రెండో శిశువు జన్మించగా 500 గ్రాముల్లోపే ఉందన్నారు. సాధారణంగా శిశువు బరువు మూడు కేజీలుండాలని, శిశువుకు గుండె చప్పుడు తక్కువగా ఉండటం, కదలికలు లేకపోవడం వలన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌, లేదా వరంగల్‌ తరలించాలని సూచించామన్నారు.


ఈ క్రమంలో మృతి చెందిన శిశువుతో పాటు బతికున్న శిశువును వారి బంధువులకు ఇచ్చామన్నారు. వెంటనే రెండో శిశువును మెరుగైన వైద్యం కోసం తరలించాలని బంధువులకు సూచించినా తాము వెళ్లలేని పరిస్థితి అని పేర్కొన్నారని, భద్రాద్రిలోనే వైద్యం చేయాలని శిశువును శనివారం మధ్యాహ్నం 11 గంటలకు తిరిగి వైద్యశాల సిబ్బందికి అందించడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో ఆ శిశువును ఎస్‌ఎన్‌సీయులో ఇన్‌క్యూబేటర్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం సునీతకు జన్మించిన రెండో శిశువును మెరుగైన వైద్యం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. 


భద్రాద్రిలో 40 బెడ్లతో కరోనా ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు 

త్వరలో భద్రాచలంలో 40 పడకలతో కూడిన కరోనా ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డీసీహెచ్‌ఎ్‌స డా. రమేష్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో కరోనా టెస్టింగ్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, పరికరాలు కొన్ని వచ్చాయి, మరికొన్ని రావాల్సి ఉందన్నారు. ముఖ్యంగా ఐసీఎంఆర్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అనుమతి రాగానే కరోనా నిర్దారణ పరీక్షలు కొత్తగూడెంలో చేయడం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.


Updated Date - 2020-06-29T17:27:38+05:30 IST