Abn logo
Aug 14 2020 @ 01:06AM

కరోనా కాలంలో గృహహింస

లాక్‌డౌన్‌ భారత్‌ను రక్షిస్తుందని అన్నారు కానీ, దేశ జనాభాలో సగం ఉన్న స్త్రీలపై గృహ హింస మరింత పెరిగింది. కుటుంబం మొత్తం సురక్షితంగా, సుఖవంతంగా ఉండటం కోసం స్త్రీ మరమనిషిలా తయారయింది. ఇంటిపట్టునే వుండడంతో మగవారి హింస పేట్రేగింది. దూరమైన స్వేచ్ఛ, సరదాలు వారిలో క్రూరత్వాన్ని పెంచాయి. దిగజారిన ఆర్థిక పరిస్థితులు ఇంట్లో మరిన్ని హింసా కోణాలను ఆవిష్కరించాయి. 


గృహహింస అనగానే భార్యాభర్తలకు సంబంధించిన అంశంగా అందరూ చూస్తారు. కానీ కుటుంబంలో ఉన్న, లేదా ఒక గూటిలో బతికే స్త్రీలపైన జరిగే హింసగా దానిని గుర్తించాలి. అక్క, చెల్లెళ్ళు, తల్లి, కోడలు, పెళ్ళికాకపోయినా సహచర్యం చేస్తున్న స్త్రీ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హింసకు అనేక కోణాలు ఉన్నాయి. హింస ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరగొచ్చు, భౌతికంగా, మానసికంగా, సామాజికంగా కావచ్చు. ఆమె కారెక్టరు పైన వివాదాలు, పురుషాధిపత్య ధోరణితో స్త్రీ స్వేచ్ఛను కట్టుదిట్టం చేయడం, ఆడదానివి కాబట్టి, పోషిస్తున్నాం కనుక పడివుండాలని దూషించటం, చట్టపరంగా దూరంగా వున్నా కూడా (జుడిషియల్‌ సెపరేషన్‌) వెంటపడటం, కమ్యూనికేషన్‌ మాధ్యమాల ద్వారా పరోక్షంగా హింస పెట్టడం నేరం. లైంగిక వాంఛలు తీర్చమని హింసించడం (వైవాహిక రేప్‌) నేరం కాదు. ఇది కుటుంబ వ్యవస్థలో పురుషుడికి ఉండే అధికారం కానీ పొరుగున ఉన్న నేపాల్‌ దేశంలో ఇది నేరమే. హింసకు పిల్లలూ మినహాయింపు కాదు. ఇంట్లో రేప్‌కు గురవుతున్న బాలికలు 16 ఏళ్ళలోపు వారు పాతికశాతం. ప్రతి ముగ్గురిలో ఒక స్త్రీ శారీరక సంబంధాల వలన హింసకు గురవుతున్నది. ప్రతి 42 నిముషాలకు లైంగిక వేధింపు, ప్రతి 93 నిమిషాలకు వరకట్న హత్య. పేదరికం, మగవారి బాధ్యతా రాహిత్యం స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టివేస్తున్నాయి. 


దీనికితోడు, ఇప్పుడు ‘కరోనా మహమ్మారి’ వచ్చింది. ‘ఒసెయ్‌ నువ్వు ఎవతివే’ అంటూ పాటలు. ఒక విలయ తాండవానికి, స్త్రీ మూర్తిత్వానికి భిన్నంగా ఆమె మనోభావాలు దెబ్బతినేలా ‘మహమ్మారిగా’ వర్ణనలు. లాక్‌డౌన్‌ ఆమె జీవన విధానాన్ని మార్చివేసింది. ‘ఇంటివద్దే ఉండండి, సురక్షితంగా వుండండి’ అన్న ప్రకటన స్త్రీ జీవితంలో హింసా ప్రకంపనలు సృష్టించింది. ఈ లాక్‌డౌన్‌ భారత్‌ను రక్షిస్తుంది అన్నారు కానీ దేశజనాభాలో సగభాగం ఉన్న స్త్రీలపై గృహ హింస నాలుగోవంతు పెరిగింది. కుటుంబం మొత్తం సురక్షితంగా, సుఖవంతంగా బ్రతకటానికి వారికి పనిచేసే మర మనిషిలా స్త్రీ తయారయింది. మగవారు బయటకి వెళితే ఊపిరి పీల్చి, క్షణంపాటు తన లోకంలోకి వెళ్ళటానికి ప్రయత్నించే ‘ఆమె’ కు ఎదురుగానే, ‘అమితుమీ’ తేలుస్తామనే పురుష ప్రపంచం ఇంట్లోనే ఉంది. అన్ని అనర్థాలకు మూలం ‘నువ్వే’ అనే అతని నుండి తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకున్నాయి. అసలే హింసకు గురవుతున్న స్త్రీలకు, బాలికలకు కరోనా మరింత గడ్డుకాలం తెచ్చింది. శారీరక మానసిక హింసకు ఆమె పనిముట్టయింది. ఇక కుటుంబాన్ని మొత్తం నెట్టుకొస్తున్న ఒంటరి స్త్రీల పరిస్థితి ఆర్థికంగా మరింత దిగజారింది. 


కరోనా వలన ఇంటిపట్టునే వుండడం, సంపాదన, సరదా కోసం బయట తిరగకపోవడంతో మగవారి హింస పేట్రేగింది. విశ్రాంతితో పాటు వివిధ ఆలోచనలు పెరిగాయి. విరామం విసుగుని పెంచింది. దూరమైన స్వేచ్ఛ, తాగుడు సరదాలు అతనిలో క్రూరత్వాన్ని పెంచాయి. ఇంట్లో దిగజారిన ఆర్థిక పరిస్థితులు మరిన్ని హింసా కోణాలను ఆవిష్కరించాయి. ఈ హింస భార్యలకే పరిమితం కాలేదు. తోబుట్టువులు, తల్లిదండ్రుల మీద పెరిగింది. కుటుంబంలోని స్త్రీలు, బాలికలు నిస్సహాయతతోనో, జీవితంలో హింస భాగమనే తత్వంతోనో దానిని భరించడం పరిపాటి. లైంగిక దోపిడి, అత్యాచారాల రేటు రెండింతలు పెరిగిందని జాతీయ మహిళా కమిషనే తేల్చి చెప్పింది. ఏప్రిల్‌ 4న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గర్భస్థ శిశు నిర్ధారణ చట్టంలో కొన్ని కీలకమైన సెక్షన్‌లను రద్దు చేసింది. దీని వలన దేశంలో ఎన్నో అనైతిక గర్భస్థ పిండ నిర్ధారణలు కరోనా సమయంలో జరిగాయి. 


కరోనా కాలంలో వైవాహిక అత్యాచారంతో పాటు, మగవారు సంతాన నిరోధక సాధనాలు వాడకపోవడం వలన అనవసర ప్రెగ్నెన్సీ శాతం పెరిగింది. కదలికలకు కట్టుబాటు ఉన్నా ఇంటర్నెట్‌ పోర్నోగ్రఫీకి అడ్డుకట్టలేకపోయింది. దానితో లైంగిక హింస రూపాలు మారాయని ఎంతో మంది క్లయింట్స్‌ చెప్పారు. కరోనా నుంచి తనను తాను కాపాడుకోవడంతో పాటు తన మర్యాద, జీవించే హక్కును కాపాడుకోవడం స్త్రీకి కష్టమైపోయింది. కరోనా ప్రభావం స్త్రీలపై, పిల్లలపై పితృస్వామ్య భావజాలాన్నీ రుద్దడానికి లేదా పునరుద్ధరించడానికి తోడ్పడుతోంది. మారుతున్న విలువల నేపథ్యంలో స్త్రీకి ‘హౌస్‌వైఫ్‌’ నుంచి ‘హౌస్‌మేకర్‌’ గా పేరు మారింది తప్పితే నిజమైన మార్పు లేదు. అభ్యుదయవాదుల నుంచి అమాయక ప్రజల వరకు వంటిల్లే స్త్రీలకు లాక్‌డౌన్‌ కేంద్రమైంది. బాలికలకు వంటిల్లు కోచింగ్‌ సెంటర్‌గా మారితే బాలురుకు ఆన్‌లైన్‌ కోర్సులు కొత్తగా వచ్చి చేరాయి. కాలేజీలు లేక బాలికలు హింసకు బందీలైనారు. కరోనా కారణంగా మొత్తంగా వారి విద్యే లాక్‌డౌన్‌ అయ్యే అవకాశం వుంది. డ్రాప్‌ అవుట్‌ రేటు పెరగడంతోపాటు బాల్య వివాహాల శాతం పెరుగుతుంది. బాలకార్మిక సమస్య తీవ్రంగా మన ముందుకు వస్తుంది. 


సేవ అనగానే ఇంట్లో జ్ఞాపకం వచ్చేది స్త్రీ. అది ఆమె బాధ్యతగా కుటుంబం భావిస్తుంది. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలుగా పారిశుద్ధ్య కార్మికులుగా 75% పైన స్త్రీలు వున్నారు. ఇందులో 70% పైగా ప్రైవేటు ఉద్యోగులే లేదా కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నవారే. లేబరు మార్కెట్టులో స్త్రీలకు రెండవ స్థానమే. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో అనే అయోమయంలో స్త్రీలు వున్నారు. కరోనా కారణంగా కుటుంబ సంబంధిత కోర్టులు, క్రిమినల్‌ కోర్టులు మూతపడ్డాయి. హింసను ఎదుర్కొన్నప్పుడు మిత్రులకో, బంధువులకో తెలియచెప్పలేని గడ్డుకాలం స్త్రీలకు ఉంది. పోలీసు స్టేషనుకు వెళదామంటే కేసులు తీసుకోరు, ఎఫ్‌.ఐ.ఆర్‌ చేయటం లేదు. కేవలం వార్నింగ్‌లు ఇవ్వడానికే పోలీసులు పరిమితమయ్యారు. ఒకవేళ అర్జీపెట్టుకున్నా స్త్రీలకే బ్రెయిన్‌వాష్‌ వుంటుంది. ‘రాజీమార్గం రాజమార్గం’ (రాణిమార్గం కాదు)గా మళ్ళీ కుటుంబ వలయంలోకి స్త్రీని నెట్టివేసే ప్రయత్నం ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోను ప్రాథమికంగా జరుగుతున్నదే.


సమస్యను న్యాయవ్యవస్థ గుర్తించడం మొదటి అడుగు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పాలసీలోనూ, స్త్రీలపై హింసను నిర్దిష్టంగా నొక్కి చెప్పడం జరగాలి. కరోనా కాలంలో సాధారణ వైద్యసేవలకు అంతరాయం కలగడం సహజం. అందువలన, స్త్రీలకు అసలే పరిమితంగా ఉన్న పునరుత్పత్తి సేవలను కూడా అత్యవసర సేవల కేటగిరిలోకి తేవాలి. బాలికలకు ప్రత్యేకంగా పౌష్టికాహారం అందచేయాలి. అంగన్‌వాడి స్కూళ్ళను శానిటైజ్‌ చేయాలి. విద్యాశాలల్లో పరిశుభ్రతా విధానాలను పాటించాలి. కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు చేసే మొదటి పని బాలికల చదువు ఆపివేయడం, వారిని పనులలో పెట్టడం. కాబట్టి ప్రభుత్వం మధ్యాహ్న భోజనాలకు పరిమితం కాకుండా కుటుంబ పెద్దలకు పని కల్పించడం, ఆర్థిక సాయం చేయాలి. కేజీనుంచి పీజీవరకూ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి. కరోనా సమయంలో స్త్రీలు ఆర్థికంగా బలహీనపడటమే కాక, చవకగా శ్రమను అమ్ముకున్నా కూడా పనికోసం బయటకు వచ్చే అవకాశాలు ఇంకా సన్నగిల్లుతాయి. ఉద్యోగం పురుష లక్షణం కాబట్టి స్త్రీలే పనిని కోల్పోతారు. కాస్తంత స్వేచ్ఛను మనశ్శాంతిని శ్రామిక మహిళ కోల్పోతుంది. మరోసారి స్త్రీ రెండు తరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి సమాజంలో ఏర్పడింది. అందువల్ల, స్త్రీల దరిచేరి వారికి సహాయం చేయడం అవసరమైన సర్వీసుగా ప్రభుత్వం తీసుకోవాలి. సహాయక కేంద్రాలలో స్త్రీలను వుంచాలి. కరోనా నేపథ్యంలో అనేక హోటల్‌, ఫంక్షన్‌ హాల్స్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. రాబోయే రోజులలో స్త్రీలకు రక్షణ కల్పించేలా వసతి కల్పించాలి. ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ప్రజా సంఘాలు, సంస్థలు, అభ్యుదయ శక్తుల సహకారాన్ని తీసుకోవాలి. కుటుంబ హింసను తగ్గించడంలో భాగంగా స్వతంత్ర హింసా వ్యతిరేక కమిటీలను వేసి ప్రభుత్వం పథకాలను అందుకునే లబ్ధిదారులకు ఆంక్షలు పెట్టడం, ప్రకటనలలో హింస వ్యతిరేక సందేశాలు ఇవ్వడం తప్పనిసరి. గృహ హింస వ్యతిరేక కమిటీలో స్త్రీలు భాగస్వామ్యం కావాలి. 


పితృస్వామ్య సమాజంలో మనం బతుకుతున్నాం కనుక, సమాజానికి ఈ ఆధిపత్య స్వభావం ఉంది. ప్రజలకే కాదు రాజ్యం అన్ని అంగాలకూ ఇది ఉంది. కుటుంబ హింస అసలు సమస్యగా గుర్తించలేకపోవటం, గుర్తించినా అతి పెద్ద సమస్యగా కాదనే ధోరణి ఇంకా చాలామంది ప్రజాస్వామ్య వాదులలో కూడా ఉంది. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న స్త్రీలను కరోనా ఆర్థికంగా, సామాజికంగా దెబ్బకొట్టడంతో, పెచ్చరిల్లుతున్న మనువాద భావజాలంతో ఇదే సాకుగా వారిని ఇంటికి పరిమితం చేయాలనే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. కుటుంబ, కాప్‌ పంచాయితీల హింస ఇంకా హెచ్చుతుంది. గృహ హింస సంస్కృతిలో భాగంగా తయారవుతుంది. ప్రత్నామ్నాయ సంస్కృతికి బాటలు వేస్తున్న తరాలకి మరో దెబ్బ ఇది. గృహ హింస పోవాలంటే కుటుంబాలు ప్రజాస్వామికం కావాలి. ప్రేమ, స్నేహం గౌరవంతో కూడిన మానవ సంబంధాల కలయికగా కుటుంబాలను నిర్మించినపుడే ఈ లక్ష్యం సాధ్యపడుతుంది. అందుకు మనమంతా సైనికులుగా ముందుకు నడవాలి.

హేమా వెంకట్రావ్‌

Advertisement
Advertisement
Advertisement