బాలీవుడ్ మూవీకి ట్రంప్ ప్రశంసలు !

ABN , First Publish Date - 2020-02-22T17:17:09+05:30 IST

బాలీవుడ్ నటుల్లో ఆయుష్మాన్ ఖురానా ప్రయోగాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఖురానా తెరంగేట్రమే ప్రయోగాత్మక మూవీ 'విక్కీ డోనర్' ద్వారా జరిగింది.

బాలీవుడ్ మూవీకి ట్రంప్ ప్రశంసలు !

బాలీవుడ్ నటుల్లో ఆయుష్మాన్ ఖురానా ప్రయోగాలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఖురానా తెరంగేట్రమే ప్రయోగాత్మక మూవీ 'విక్కీ డోనర్' ద్వారా జరిగింది. ఆ తర్వాత అంధాధూన్, బదాయిహో, ధమ్‌ లగాకే హైసా, డ్రీమ్‌గర్ల్ లాంటి విభిన్న కథ చిత్రాల్లో నటించాడు. ఇక తాజాగా ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’లో ఖురానా ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా 'గే' పాత్రలో కనిపించాడు. ఆయనకు జోడిగా జితేంద్ర కుమార్‌ నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. ఖురానా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడని అభిమానులు కొనియాడుతున్నారు. ఈ చిత్రంతో ఖురానా మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలాఉంటే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ మూవీకి కితాబిచ్చారు. 



వివరాల్లోకి వెళితే బ్రిటీష్ యాక్టివిస్ట్ పీటర్ గ్యారీ టాచెల్  ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ సినిమాపై ఒక ట్వీట్ చేశారు. బాలీవుడ్‌లో ఒక కామెడీ రొమాంటిక్ ఫిల్మ్ విడుదలైంది. భారత్‌లో స్వలింగ సంపర్కులకు చట్టబద్ధత వచ్చిన తరువాత, ఇప్పుడు విడుదలైన ఈ చిత్రం ప్రేరణగా దేశంలోని వృద్ధులు స్వలింగ సంపర్కం గురించి తెలుసుకోవటానికి.. ఆ విధమైన అనుంబంధం ఏర్పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పీటర్ చేసిన ఈ ట్వీట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ ట్వీట్ చేశారు. ఒక్క వాక్యంలో ‘గ్రేట్‘ అని కామెంట్ పెట్టారు. దీనిపై స్పందించిన పీటర్.. "అధ్యక్షుడు ట్రంప్ ఎల్‌జీబీటీ సమస్యను సీరియస్‌గా తీసుకున్నారని నమ్ముతున్నాను. అలాగే ఇది పీఆర్ స్టంట్ కాదని ఆశిస్తున్నానని" రీట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. భారీగా రీట్వీట్లు, లైక్స్ వచ్చి పడుతున్నాయి. 

Updated Date - 2020-02-22T17:17:09+05:30 IST