‘బర్డ్‌ ఫ్లూ’పై ఆందోళన వద్దు

ABN , First Publish Date - 2021-01-09T07:26:41+05:30 IST

తెలంగాణలో ఎక్కడా బర్డ్‌ ఫ్లూ వైర్‌సకు సంబంధించిన ఆనవాళ్లు లేవని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ షకీల్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల కోళ్ల సంపద ప్రస్తుతం సురక్షితంగా ఉందని చెప్పారు

‘బర్డ్‌ ఫ్లూ’పై ఆందోళన వద్దు

కోట్ల కోళ్ల సంపద సురక్షితం

పౌలీ్ట్రల్లో బయోసెక్యూరిటీ ఉండాలి

టీకా లేదు: పశుసంవర్ధకశాఖ 

అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ షకీల్‌

ప్రత్యేక బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం

చికెన్‌ తినటానికి ఆందోళన అవసరం లేదు


హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎక్కడా బర్డ్‌ ఫ్లూ వైర్‌సకు సంబంధించిన ఆనవాళ్లు లేవని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ షకీల్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల కోళ్ల సంపద ప్రస్తుతం సురక్షితంగా ఉందని చెప్పారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పక్షులకు ‘బర్డ్‌ ఫ్లూ’ వైరస్‌ సోకుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై డాక్టర్‌ షకీల్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.


రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఆనవాళ్లు ఉన్నాయా?

 తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఆనవాళ్లు లేవు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1,300 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయి. పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల ఫాంల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. ఎక్కడా వైరస్‌ లక్షణాలు కనిపించలేదు. ఎప్పటికప్పుడు సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపిస్తున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో వెటర్నరీ అధికారులు గస్తీ తిరుగుతున్నారు. అటవీ అధికారులకు కూడా సర్క్యులర్‌ జారీ చేశాం. జిల్లా స్థాయిలో డీవీఏహెచ్‌వోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. 


బర్డ్‌ ఫ్లూ సోకితే నియంత్రించటానికి టీకాలు ఉన్నాయా?

 బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి టీకా లేదు. పక్షులకు ఫ్లూ వచ్చిందంటే చావటమో, చంపటమో తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఇళ్లలో కోళ్లు పెంచుకునే రైతులతోపాటు కోళ్ల ఫాంలు, చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు అంతా అప్రమత్తంగా ఉండాలి.


ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు చికెన్‌ తినాలా? వద్దా? 

 ప్రజలు కోడి మాంసం తినటానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ వైరస్‌ అయినా మాంసాన్ని వేడి చేయగానే, 60-70 డిగ్రీలకు ఉష్ణోగ్రతకు చేరగానే చనిపోతుంది. వంట పాత్రలో నీళ్లు మరిగాయంటే.. 100 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకున్నట్లే. ఇక ఫ్రై చేసే సమయంలో నూనెల వేడికి 150 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవు. చికెన్‌ నిర్భయంగా తినొచ్చు. పచ్చి మాంసం తినేవారికి మాత్రం వైరస్‌, వ్యాధుల ప్రభావం ఉంటుంది. అవి పక్షుల నుంచి మాంసంతో పాటు మనుషులకు వ్యాపించే 

ప్రమాదం ఉంటుంది.


బయో సెక్యూరిటీ అంటే ఏమిటి?

బయటి నుంచి కోళ్ల ఫాంలోకి వైరస్‌ రాకుండా చూడటమే బయో సెక్యూరిటీ. బయటి వ్యక్తులు ఎవరైనా వస్తే.. చేతులు, కాళ్లు శభ్రపరచుకున్న తర్వాతే ఫాంలోకి వెళ్లాలి. కోళ్లు, దాణాను తీసుకొచ్చే వాహనాల టైర్లను శుభ్రం చేయాలి. ఫాంలో కోళ్లు తినే దగ్గర మినహా ఇతర ప్రదేశాల్లో దాణా కింద పడకుండా చూసుకోవాలి. ఇతరత్రా వ్యాధులతో కోళ్లు చనిపోయినా, బయట చనిపోయినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. చనిపోయిన పక్షులు, కోళ్లను భూమిలో పాతిపెట్టాలి. రోడ్ల పక్కన, చెత్తకుండీల్లో పడేయొద్దు.

Updated Date - 2021-01-09T07:26:41+05:30 IST