ఐపీఎల్‌.. ఏం జరుగుతోంది?

ABN , First Publish Date - 2021-05-04T16:10:35+05:30 IST

అద్భుత వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్‌కు కరోనా తొలి పంచ్ తగిలింది.

ఐపీఎల్‌.. ఏం జరుగుతోంది?

అద్భుత వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్‌కు కరోనా తొలి పంచ్ తగిలింది. కోల్‌కతా ఆటగాళ్లు, చెన్నై కోచింగ్ సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ మెగా టోర్నీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. టోర్నీ చివరి వరకు సజావుగా సాగుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి ఇలాంటి ప్రమాదాన్ని ఐపీఎల్ పాలక కమిటీ ముందుగానే ఊహించిందట. 


గతేడాదిలాగానే ఈ ఏడాది కూడా యూఏఈలోనే ఐపీఎల్‌ను నిర్వహిస్తే బాగుంటుందని బీసీసీఐకి ఐపీఎల్ పాలక కమిటీ సూచించిందట. అయితే బీసీసీఐ పెద్దలు అందుకు అంగీకరించలేదని తాజా సమాచారం. ఇంగ్లండ్‌తో టెస్ట్, వన్డే, టీ-20 సిరీస్‌లను స్వదేశంలో ఎలాంటి ఆటంకాలూ లేకుండా నిర్వహించిన నేపథ్యంలో యూఏఈ ప్రపోజల్‌ను బీసీసీఐ అంగీకరించలేదట. బయో బబుల్‌ను వీడినందు వల్లే ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని బీసీసీఐ ఇప్పటికీ భావిస్తోందట. 


నిజానికి ఇంగ్లండ్‌తో సిరీస్ ద్వైపాక్షిక సిరీస్. కేవలం రెండు జట్ల ఆటగాళ్లకు, సిబ్బందికి రక్షణ కల్పిస్తే సరిపోతుంది. కానీ, ఐపీఎల్‌లో ఎనిమిది జట్లు తలపడతాయి. వంద మందికి పైగా ఆటగాళ్లు, కోచ్‌లు, ఇతర సిబ్బంది ఉంటారు. పైగా మ్యాచ్‌ల కోసం వేదికలు మారుతూ ఉండాలి. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంత మందికి రక్షణ కల్పించడం కష్టమని ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి. 


ఒకే వేదికలో మ్యాచ్‌లు? 

ఈ ఏడాది ఐపీఎల్ మొదటి అంచె మ్యాచ్‌లు అహ్మదాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నైల్లో జరిగాయి. తాజాగా కోల్‌కతా, బెంగళూరు వేదికలు కూడా చేరాయి. ఇన్ని నగరాల్లో బయో బబుల్ ఏర్పరిచి మ్యాచ్‌లు నిర్వహించడం కంటే.. మొత్తం మ్యాచ్‌లన్నింటికీ ముంబైనే వేదిక చేస్తే మంచిదని బీసీసీఐ భావిస్తోందట. ముంబైలో ఉన్న మూడు క్రికెట్‌ స్టేడియాల్లో మిగిలిన సీజన్‌ జరపడంపై బీసీసీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ స్టేడియాలకు సమీపంలో ఉన్న హోటళ్లతో సంప‍్రదింపులు జరిపుతున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-05-04T16:10:35+05:30 IST