మెలకువలో కనే కల కథ

ABN , First Publish Date - 2020-10-05T07:42:56+05:30 IST

కథంటే ఏమిటి? ఏకదిశగా సాగే జీవనయానంలో మనం పక్కకు తొంగైనా చూడకుండా ఎన్నింటినో దాటేసి పోతాం. మనకు తారసిల్లిన, అవసరమైన,...

మెలకువలో కనే కల కథ

కథంటే ఏమిటి? ఏకదిశగా సాగే జీవనయానంలో మనం పక్కకు తొంగైనా చూడకుండా ఎన్నింటినో దాటేసి పోతాం. మనకు తారసిల్లిన, అవసరమైన, అనుకూలమైన వాటి వైపు మాత్రమే మనసు పెడతాం. మనం వేరే జీవితాల వేపు చూడం, అంత వ్యవధి మనకు ఉండదు కూడా. అనంత వైవిధ్యభరితమైన ఈ ప్రపంచంలోని విభిన్న జీవితాలు, వివిధ మనస్తత్వాలు, మానవ జీవితపు ఇతర పార్శ్వాలు, పాఠాలు, సంఘర్షణలు, అనుభవాలు అలా మన అవగాహనకు, మస్తిష్కానికి అతీతంగా ఉండిపోతాయి. మన చైతన్యానికి హద్దులు ఏర్పడతాయి. ఫలితంగా అశాంతిమయ క్షణాలు, సంకట స్థితులు, సందిగ్దావస్థలు, నైతిక మీమాంసలు ఎదురై కొండొకచో మనల్ని దిక్కు తోచని స్థితిలో పడేస్తాయి. వీటిని అధిగమించే విధంగా మన అవగాహన పరిధిని విస్తారపర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది కథ. బయటి ప్రపంచాన్ని చూపించే గవాక్షం కథ. 


మనం ఎందుకు రాస్తాం?

ఇందుకు ప్రధానంగా అయిదు ప్రేరేపకాలు వుంటాయి: మన ప్రత్యేకత, ప్రాముఖ్యం ప్రదర్శించాలనే అభిలాష; బ్రతుకుదెరువు/ డబ్బుసంపాదన అవసరం; కళా సౌందర్యాల ఆస్వాదన మనలో రేకెత్తించే భావోద్వేగాలు, అనుభూతులు వ్యక్తీకరించాలనే తపన; సమకాలీన వాస్తవాలను భావి తరాలకు అందించాలన్న చారిత్రక బాధ్యత; లోకం ప్రస్తుత తీరుతెన్ను లను మార్చే దిశగా మనుషుల్ని ఆలోచింపజేయాలనే సంకల్పం. (ఇవన్నీ ఏవో కొన్ని పాళ్ళలో ప్రతి రచయిత, కవిలో ఉండి పైచేయి కోసం పోటీ పడుతుంటాయి). ఒక కథా రచయితను కథ రాయడానికి పురికొల్పేవేమిటి అన్నప్పుడు--దైనందిన జీవితంలోని ఒకానొక అనుభవం, దృష్టినాకర్షించిన సన్నివేశం, పదేపదే జ్ఞాపకానికొచ్చే ఘటన, వార్తా పత్రిక లేదా ఏదేని పుస్తకం చదూతున్నప్పుడు మదిలో మెదిలే కొత్త ఆలోచన, చుట్టూ సమాజంలో పారడాక్సికల్‌గా అగుపడే కొందరు వ్యక్తులు, వారి ప్రవర్తనలు... మొదలైన ప్రేరణలు (impulses)- అని చెబుతాం. సంవేదనల చేత ప్రభావితమై స్పందించే గుణంతో పాటు, విషయాన్ని సమగ్రంగా, విస్తారంగా దృశ్యమానం చేసి పాఠకునిలో ఉద్వేగాలే కాకుండా ఆలోచనలు రేకెత్తించడం రచయిత లక్ష్యంగా కలిగి ఉంటాడు. కథ చెప్పడం (వినడం) మనిషి డిఎన్‌ఏలోనే వుంది. కలలు కనడం ప్రతి ప్రాణి సహజ లక్షణం. మనిషి మెలకువలో కనే కల కథ. ఎందుకంటే కథ చదువుతూ మనం మరో ప్రపంచంలోకి వెళతాం, మనిషి నైజంలోని ఇతర ముఖాలు చూస్తాం. కథా రచయితలు గొప్పవారని కాదు, మానవ జాతిలో ప్రత్యేక కోవకు చెందినవారనీ కాదు. కథ చెప్పాలనే (వినాలనే) మానవ జాతి స్వతఃసిద్ధ, ప్రగాఢ వాంఛకు వీరు ప్రతిబింబం మాత్రమే. 


కథంటే ఏమిటి? ఏకదిశగా సాగే జీవనయానంలో మనం పక్కకు తొంగైనా చూడకుండా ఎన్నింటినో దాటేసి పోతాం. మనకు తారసిల్లిన, అవసరమైన, అనుకూలమైన వాటి వైపు మాత్రమే మనసు పెడతాం. వేరే జీవితాల వేపు చూడం, అంత వ్యవధి మనకు ఉండదు కూడా. అనంత వైవిధ్యభరితమైన ఈ ప్రపంచంలోని విభిన్న జీవితాలు, వివిధ మనస్తత్వాలు, మానవ జీవితపు ఇతర పార్శ్వాలు, పాఠాలు, సంఘర్షణలు, అనుభవాలు అలా మన అవగాహనకు, మస్తిష్కానికి అతీతంగా ఉండి పోతాయి. మన చైతన్యానికి హద్దులు ఏర్పడతాయి. ఫలితంగా అశాంతి మయ క్షణాలు, సంకట స్థితులు, సందిగ్దావస్థలు, నైతిక మీమాంసలు ఎదురై కొండొకచో మనల్ని దిక్కుతోచని స్థితిలో పడేస్తాయి. వీటిని అధిగమించే విధంగా మన అవగాహన పరిధిని విస్తారపర్చుకునే అవకా శాన్ని కల్పిస్తుంది కథ. బయటి ప్రపంచాన్ని చూపించే గవాక్షం కథ. వ్యూహాత్మకంగా కూర్చిన సన్నివేశాలు, అవసరం మేరకు ప్రవేశపెట్టిన పాత్రలు, సంభాషణలతో వేరొకరి జీవితంలోని ఒక సందర్భాన్ని సంక్షి ప్తంగా ఒక ప్రత్యేక కోణం లోంచి, మరో మానసిక ఛట్రం లోంచి, మరో స్వరం లోంచి మన ముందుంచి, ఏక కాలంలో అది పరాయిది గానూ, మనది గానూ, పరిచితమైనది గానూ, కొత్తది గానూ స్ఫురింప జేస్తూ జీవితాన్ని గురించిన ఒక కొత్త ఎరుకను కలిగిస్తుంది కథ. సాహిత్యంలో నోబెల్‌ బహుమతి అందుకున్న ఏలిస్‌ మన్రో కథా సంపుటి ‘Too Much Happiness’ చదివినవారు- అది చదవనివారితో పోలిస్తే- ఎక్కువ కాలం ఉల్లాస భరిత జీవితం గడిపినట్టుగా మనో వైజ్ఞానిక పరిశోధనలు వెల్లడించాయని ‘సైన్స్‌’ మాగజైన్‌ పేర్కొన్నదని ‘100 Years of the Best American Short Stories’ ప్రవేశికలో ప్రముఖ రచయిత్రి లోరీ మూర్‌ అన్నారు.


కథ నిర్మాణం ఎలా జరుగుతుంది? రచయిత పురోగమన వాది. ఆల్బర్ట్‌ కామూ అభిప్రాయం - ‘The purpose of a writer is to keep civilization from destroying itself’తో రచయిత ఏకీభవి స్తాడు, ప్రతి దాన్ని సమాజ చలన సూత్రాల వెలుగులో విశ్లేషిస్తాడు. మదిలో తిరుగాడుతున్న కథాంశాన్ని (theme) కథగా మలచాలి, ఇతివృత్తాన్ని (plot) ఎలా నిర్మించాలి, ఏ కథన పద్ధతి (technique/ mode) అవలంబించాలి, అంతిమంగా ఏమి కమ్యూనికేట్‌ చేయాలి- వీటిపై స్పష్టత కోసం తీవ్రంగా ఆలోచిస్తాడు. 


సీరియస్‌ ఆలోచనల్లోంచి రూపొందినవిగా అనిపించే కొన్ని కథలు మనకు చప్పున జ్ఞాపకానికొస్తాయి. బొగ్గుగని కార్మికులతో మమేకమై పోయి అక్కడి ప్రజల గుండెల్లో ఆరాధ్యుడిగా నిలిచిపోయిన ఉద్యమ నాయకుడు పోలీస్‌ ఎన్కౌంటర్‌లో హతమవగా అతడి అభిమానులు స్పందించిన తీరుని చిత్రించిన కథ ‘అతడు’. ఈ కథ ఇతివృత్తం అనేక పాయలుగా నిర్మితమై వుండటం, పలు పాత్రల reflections గా ఉద్యమ నాయకుని వ్యక్తిత్వం, ఇమేజ్‌ ఆవిష్కృతమవడం గమనిస్తాం. ఈ నిర్మాణ పద్ధతి కథకు బాగా నప్పింది. కులమతాల్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోజూసే కపటులు, వాటికి అతీతంగా నిలిచి మానవీయ విలువలకు కట్టుబడిన మనుషుల చుట్టూ అల్లిన కథ ‘ఆశీర్షకమ్‌’ (భరాగో). ఈ కథ ఇతివృత్తం గత, వర్తమానాల్లోకి తొంగి చూసే ఎపిసోడ్స్‌/ ఫ్రాగ్మెంట్స్‌గా నిర్మితమైనదనీ, ఎంతో సంయమనంతో కూడిన కమ్యూనికేషన్‌ ఈ కథలో వుందనీ మనకు తెలుసు. రచయిత ప్రతిభకు ఆశ్చర్యపోతాం. అనేక అంశాల పోహళింపుతో మంచి ఎఫెక్ట్‌ సాధించిన ‘అసందిగ్ధ కర్తవ్యం’ (ఆడెపు లక్ష్మీపతి) కథలో ఇలాంటి నిర్మాణ పద్ధతే కనపడుతుంది. బ్రాహ్మణవాద అహంకారం పట్ల ఆగ్రహం, దాని అవకాశవాదం పట్ల అసహ్యం తెప్పించే కథ ‘పోలిగాడు’ (కరుణ కుమార). ఈ కథ ఇతివృత్తంలో సరళమైన కథనం, తేలుకొండి వంటి ముగింపు ఆకట్టుకునేలా ఉన్నాయని చదివినవాళ్లకు గుర్తుండే వుంటుంది. భిన్నజీవిత నేపథ్యాల్లోంచి వచ్చిన కెప్టెన్‌ వర్మ, డిబిరిగాడుల దృక్పథాల్లోంచి హింస పార్శ్వాలను ఆవిష్కరించిన కథ ‘చీకటి’ (అల్లం శేషగిరిరావు) ఏ కారణంగానో మనల్ని వెంటాడుతుందని అందరం అంగీ కరిస్తాం. రచయిత పరిశీలనాశక్తికి జోహార్లర్పిస్తాం. మనిషి భావోద్వేగాల విస్తృతిని పట్టి యిచ్చి మనస్తత్వపు లోపలి పొరలను బహిర్గత పరుస్తాయి ఈ కథలు. సాదా సీదా కథలతో పోలిస్తే ఈ కథలు భిన్నమైనవి. వస్తు పరంగా, ఇతివృత్తపరంగా, టెక్నిక్‌పరంగా బలమైనవి.


కథలో చర్చకు వచ్చే విలువలు, భావనలు, లేవనెత్తబడే తాత్విక, నైతిక అంశాలను--కథ సారాంశాన్ని--ఒక వాక్యంలో చెప్పడాన్ని ‘థీమ్‌’ (కథాంశం/ వస్తువు) అనీ; కథనంలో క్రానలాజికల్‌గా సన్నివేశాలు, సంఘటనలు కూర్చడం, వాటి మధ్య కార్య కారణ సంబంధాన్ని ఏర్పరచడాన్ని ‘ప్లాట్‌/ ప్లాట్‌ స్ట్రక్చర్‌’ (ఇతివృత్త నిర్మాణం) అనీ అంటారు. (థీమ్‌, ప్లాట్‌- రెండిం టినీ తెలుగులో ఇతివృత్తం అనే అంటున్నారు). శిల్పం- ఆంగ్లపదం technique’కి సమానార్థకం- అంటే సాధారణ అర్థంలో కథ అల్లే మౌలిక పద్ధతి, మరో అర్థంలో నవ కల్పనాయుత కథన రీతి. కొత్త పుంతలు తొక్కాలని ఉత్సాహపడే రచయిత ఎదుట చైతన్య స్రవంతి, నాన్‌లీనియర్‌ కథనం, ఫ్రాగ్మెంటరి కథనం, సర్రియలిజం, అబ్సర్డిజం, మ్యాజిక్‌ రియలిజం, ఫాంటసీ... వంటి ఆసక్తికరమైన కథన పద్ధతులున్నాయి. ఇంకా లోతుగా పొతే పోస్ట్‌మోడరన్‌ కథన రీతుల్లో ‘anti-story’ పోకడలు ప్రబలంగా కనపడతాయి.


కథ ఒక బాహ్య విషయంతో సామ్యం కలిగి వుండాలి, వాస్తవికతని ప్రతిబింబించాలి, ఒక అర్థాన్ని స్ఫురింప జేయాలి, ఒక ఘటనని ఇముడ్చుకుని వుండాలి, ఒక విశ్లేషణకు లొంగాలి, నిర్దిష్ట కథాంశాన్ని కలిగి వుండాలి... ఇలాంటి నియమాలను జాన్‌ బార్త్‌, జాయ్స్‌ కరోల్‌ ఓట్స్‌, బోర్హెస్‌, బార్తేల్మే, విలియం గ్యాస్‌, అలన్‌ రాబ్‌ గ్రిల్లే, రాబర్ట్‌ కూవర్‌, కొర్తజార్‌... మొదలైనవారు పక్కకు నెట్టేశారు. కథ గురించి కథ; వాస్తవికతతో పొసగని ఫాంటసీ, అసంభవ ఘటనలు, భౌతికంగా ఉనికిలోలేని స్వప్నలోకాలు; ఒకానొక స్వీయానుభవం గురించిన సుదీర్ఘ కథనం; జీవన ఘట్టాలను, దృశ్యాలను డైరీ ఎంట్రీలుగా రాయడం; ఒక ఘటనకి అనేక వెర్షన్లు ఇచ్చి నిజంగా ఏమి జరిగి వుంటుందో పాఠకుడి ఊహకు వదిలెయ్యడం; ఒక క్రైమ్‌ సీన్‌ని రేఖాగణిత కచ్చితత్వంతో వర్ణించడం... వంటివి వీరి కథల్లో కనపడతాయి. వీటిలోని కమ్యూనికేషన్‌ అందుకోవడానికి పాఠకుడు శ్రమ పడాలి. తెలుగు కథలో ఇంత విపరీత పోకడ (forms of extremity) కనపడదు. అయినా కొత్తదనం కోసం తపన, ప్రయోగాభిలాష మనవాళ్ళలో మెండుగా ఉన్నాయనే చెప్పాలి. సాంప్రదాయిక విధానాన్ని కాదని వినూత్న పద్ధతిలో కథ చెప్పడాన్ని ప్రయోగం అంటాం. వర్తమాన సంక్లిష్ట వాస్తవికతను ప్రతిబింబించ డానికి కొత్త నెరేటివ్‌ డివైస్‌లు అవసరమనేది కాదనలేని సత్యం. మ్యాజికల్‌ రియలిస్ట్‌ పద్ధతిలో కొందరు మంచి కథలు రాశారు. గతంలోని త్రిపుర కథలు ‘భగవంతం కోసం’, ‘వలస పక్షుల గానం’ తెలుగు కథతో ప్రయోగానికి పరాకాష్ట. 


ఇవాళ్టి తెలుగు కథలో వస్తు నవ్యత ప్రశంసనీయం, రచయితల పరిశీలనా శక్తి అమోఘం. అయితే మంచి కథాంశాన్ని ఎంచు కున్న చాలా కథల్లో precis writing ధోరణి కనపడుతున్నది. కథలో సంఘర్షణ వృద్ధి క్రమం, పరాకాష్ఠ, పరిష్కారం ముఖ్యమైన దశలు. వీటిని వ్యక్తపరిచే సన్నివేశాల కల్పన, పాత్రల చర్యలు, సంబంధిత వివరణల విషయంలో ఆంక్షలు పెట్టుకుంటే కథలోని ముఖ్యఘట్టాలు fleeting visit ఇచ్చేసి వెళ్లిపోతాయి. పాఠ కుని మదిలో నిలువవు, కనుక కథ గుర్తుం డదు. తెలుగు పత్రికలు కథ నిడివి 2500- 3000 పదాలకు మించకూడదంటున్నాయి కాబట్టి రచయితలు అలా రాయడానికే అలవాటు పడ్డారు. అందుకే నేటి తెలుగు కథలన్నీ single-thread plots. ప్రపంచ సాహిత్యంలో ఉత్తమ కథలుగా పేర్గాంచి విమర్శకులు తరచూ ప్రస్తావించే కథలు- The Mexican, The Secret Sharer, In the Penal Colony, Death of Ivan Ilyich, The Happy and Short Life of Francis Macomber, The Southern Thruway... వంటివి 7000-15000 పదాల నిడివి వున్న కథలే. 1000 పదాలు మించని కథని ‘ఫ్లాష్‌ ఫిక్షన్‌’ అనీ, 20000 పదాలకు దరిదాపు నున్న రచనని ‘నవలిక’ అనీ, అంతకు మించిన రచనని ‘నవల’ అని అక్కడ అంటారు. (కథని, నవలని వేరుచేయడానికి నిడివి కాదు, ఇతర లక్షణాల్ని పరిగణనలోకి తీసుకుంటారని మనకు తెలుసు). చాలా అంతర్జాతీయ ఆంగ్ల పత్రికలు కథల నిడివి విషయంలో ఏ పరిమితీ విధించవు. 


కార్డ్‌ కథ, కాలమ్‌ కథ, నానో కథ, చిన్నకథ, పెద్ద కథ అని సౌకర్యం కోసం పిలుచుకుంటున్నామేకాని సాహితీ విమర్శలో కథ (కథానిక), నవలిక, నవల అనే అధికారిక విభజన మాత్రమే వుంది. ప్రింట్‌, ఆడియో, వీడియో... ఇలా కథ ఏ రూపంలో వున్నా, మాధ్యమమేదైనా టార్గెట్‌కు చేరడం ముఖ్యం, చేరి ఆలోచింపజేయడం మరీ ముఖ్యం. ఇక్కడ విజువల్‌ మీడియాకు అదనపు ప్రయోజనాలున్నాయనేది కాదనలేము. దాని గ్రామర్‌ వేరే. అయితే ఎన్నో గొప్ప సినిమాలు ప్రసిద్ధ రచనల అడాప్టేషన్స్‌ అని మరువ రాదు. ఒక కథ మెరిట్‌ని అంచనా కట్టడానికి కథావస్తు వర్తమానత, ప్రాసంగికత, పొందికైన ఇతివృత్త నిర్మాణం, కథనంలో గతిశీలత, అనవసరం కాని పాత్రలు, సంభాషణలు, కథలోని విషయ వివరాల విశ్వసనీయత, ఎత్తుగడలో కొత్తదనం, అంతిమంగా కమ్యూనికేషన్‌లను పరిగణనలోకి తీసుకోవాలి. రచయిత నేపథ్యం, ప్రేరణ అక్కర్లేదు. తెలుగులో సరైన సమీక్షలే లేవని, రాగద్వేషాలకు అతీతమైన విమర్శేలేదని తరచూ వింటాం. నిష్పక్షపాత మైన సమీక్ష, నిఖార్సైన విమర్శ చేసేవాళ్ళు లేరని కాదు, లేనిదల్లా రచయితలలో విమర్శను స్వీకరించే గుణం.

ఆడెపు లక్ష్మీపతి

97012 27207


Updated Date - 2020-10-05T07:42:56+05:30 IST