తెగ తాగేస్తున్నారు

ABN , First Publish Date - 2021-11-27T08:04:06+05:30 IST

రాష్ట్రంలో 1446 మద్యం షాపులు తగ్గించారు. 43 వేల బెల్టు షాపులు తొలగించారు. షాపుల పనివేళలు కుదించారు...

తెగ తాగేస్తున్నారు

మద్యంపై సర్కారుకు భారీ ఆదాయం

6 నెలల్లోనే 10,675 కోట్ల రాబడి.. ఇంత ఆదాయం ఇదే తొలిసారి

నెలకు సగటున 1800 కోట్లు.. టీడీపీ ప్రభుత్వంలో కంటే ఎక్కువ 

మద్యంపై సర్కారుకు భారీ ఆదాయం 

6 నెలల్లోనే 10,675 కోట్ల రాబడి 

ఇంత ఆదాయం రావడం ఇదే తొలిసారి

నెలకు సగటున రూ.1800 కోట్లు 

టీడీపీ ప్రభుత్వంలో కంటే ఎక్కువ 

నిషేధమంటూ వైసీపీ సర్కారులో 

షాపులు తగ్గించి.. ‘బెల్టు’ తీసేశారు

అయినా ఏమాత్రం తగ్గని ఆదాయం 

అమ్మకాలు తగ్గాలంటూ పెంచే యత్నం 

ఏడాదికి 22 వేల కోట్ల రాబడి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)


రాష్ట్రంలో 1446 మద్యం షాపులు తగ్గించారు. 43 వేల బెల్టు షాపులు తొలగించారు. షాపుల పనివేళలు కుదించారు. షాపుల్లో తాగడానికి అవకాశం ఉన్న పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశారు. మద్యం విక్రయాలను తగ్గించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. సర్కారు చెప్పేదాని ప్రకారం మద్యం అమ్మకాలతో పాటు ఆదాయమూ తగ్గాలి. అయితే ఆదాయం తగ్గకపోగా గతంలో కంటే ప్రతినెలా పెరగడం విశేషం. నెలకు రూ.1800 కోట్ల చొప్పున 6నెలల్లోనే రూ.10,675 కోట్ల ఆదాయం ఖజానాకు జమయింది. అదేంటి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటే ఆదాయం తగ్గాలి కదా? ఎందుకు పెరుగుతోందనే సందేహం రావచ్చు. అదంతే.. వైసీపీ సర్కారు పైకి చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. ఓవైపు మద్యపాన నియంత్రణ అంటూనే.. మరోవైపు అమ్మకాలు పెంచాలంటూ టార్గెట్లు పెడుతుంది. షాపుల సంఖ్య భారీగా తగ్గించామంటూనే కొత్త బార్లకు, టూరిజం షాపులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తుంది. ఇలాంటివి ప్రజలకు చెప్పకుండా, కేవలం ప్రభుత్వానికి మైలేజీ వచ్చే నిర్ణయాలనే ప్రచారం చేసుకుంటోంది.


గతేడాది కంటే 4 వేల కోట్లు ఎక్కువ!

మద్యంపై వస్తున్న ఆదాయం ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని క్రమంగా మార్చేస్తోంది. కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ప్రతినెలా దాదాపు రూ.1800 కోట్లు ఇచ్చే రంగం మరొకటి లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6నెలల్లో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.10,675 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్‌ డ్యూటీ రూ.734 కోట్లు, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ రూ.687 కోట్లు, ప్రివిలేజ్‌ ఫీజు రూ.39కోట్లు, రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ రూ.251 కోట్లు, అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ రూ.3740కోట్లు, వ్యాట్‌ రూ.3639కోట్లు, ఇతరత్రా రూ.1583కోట్లు.. వెరసి రూ.10,675 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యంపై 6నెలల్లోనే ఇంత ఆదాయం రావడం ఇదే తొలిసారి. టీడీపీ ప్రభుత్వంలో ఏడాదికి గరిష్ఠంగా రూ.17,300 కోట్లు మాత్రమే వచ్చింది. అయితే దశలవారీగా మద్యపాన నిషేధం అని చెప్పిన వైసీపీ ప్రభుత్వంలో రాబడి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. 2019-20 లో రూ.17,707కోట్లు, 2020-21లో రూ.18,005 కోట్లు ఆదాయం వచ్చింది. రానురాను తాగుడు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల ఆదాయం తగ్గాల్సి ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో అది మరింత పెరిగింది. మొదటి ఆరు నెలల్లోనే దాదాపు రూ.11 వేల కోట్ల వరకు ఆదాయం రావడంతో, మరో ఆరు నెలలు కలిపితే ఏడాది మొత్తం రూ.22 వేల కోట్లు తగ్గకుండా ఆదాయం రావచ్చు. అంటే గతేడాదితో పోలిస్తే ఏకంగా రూ.4 వేల కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఒక సంవత్సరంలో మద్యంపై వచ్చే ఆదాయం ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ పెరగలేదు.


అమ్మకాలు పెంచడమే టార్గెట్‌..

గతంలో ఎక్సైజ్‌ స్టేషన్లకు అమ్మకాలపై టార్గెట్లు పెట్టేవారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో షాపుల సూపర్‌ వైజర్లపై ఒత్తిడి చేస్తున్నారు. ఏ  నెలలోనైనా అమ్మకాలు తగ్గితే ఎందుకు తగ్గాయనేదానిపై అధికార యంత్రాంగం లోతుగా ఆరా తీస్తోంది. అమ్మకాలు మళ్లీ సాధారణ స్థితికి తేవాలని ఒత్తిడి చేస్తున్నారు. అలాగే రాత్రి పూట 8 గంటలకే షాపులు మూసేయాలని నిబంధనలు పెట్టినా.. అనధికారికంగా 9 గంటల వరకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఇక షాపుల్లో అమ్మకాలు పెంచడం కోసం ప్రభుత్వం పరోక్షంగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇతర రాష్ర్టాల నుంచి మద్యం తీసుకురాకుండా చట్టాలను సవరించింది. అలాగే నాటుసారాపై వరుస దాడులు చేయిస్తోంది. సిబ్బందికి సెలవులు తగ్గించి మరీ దాడులు చేయిస్తోంది. ఇదంతా అక్రమాల నివారణ కోసం అన్నట్టుగా కనిపించినా... వాటిని నియంత్రిస్తే మద్యం అమ్మకాలు పెరుగుతాయనేది సర్కారు అసలు ఉద్దేశం. గతంలోనూ ఇలాంటి అక్రమాలపై దాడులు చేసినా యంత్రాంగాన్ని వేధించి మరీ చేయించే వారు కాదు. కానీ ఇప్పుడు ఎక్సైజ్‌ స్టేషన్లపై తీవ్ర పని ఒత్తిడి పెంచి మరీ కేసుల టార్గెట్లు పెడుతున్నారు. కేసులు తక్కువగా ఉన్న స్టేషన్లలో ఎందుకు పెట్టలేదంటూ ఎస్‌హెచ్‌వోలను ఉన్నతాధికారులు నిలదీస్తున్నారు. మొత్తానికి మద్యంపై సర్కారుకు ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. మరింత ఎక్కువగా ఖజానాలో జమ అవుతోంది.


దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నది సర్కారు వారి మాట. కొన్ని దుకాణాలు తగ్గించి, బెల్టు షాపులు తొలగించి హడావుడి చేసింది. ప్రజల్లో ‘తాగుడు’ మాన్పించేందుకు ఓ ప్రచార కమిటీని కూడా వేసింది. దీంతో అమ్మకాలతో పాటు ఆదాయం కూడా తగ్గాలి. కానీ విచిత్రంగా ఆదాయం తగ్గకపోగా టీడీపీ ప్రభుత్వంలో కంటే భారీగా పెరిగింది.  

Updated Date - 2021-11-27T08:04:06+05:30 IST