Abn logo
Jan 26 2021 @ 03:25AM

మొండితనంతో మునుగుతున్నాం!

  • రాజ్యాంగ వ్యవస్థలతో ఘర్షణ అవసరమా?
  • విచక్షణ కోల్పోతే చిక్కులే!
  • జగన్‌ వైఖరితో వైసీపీ శ్రేణులు బెంబేలు


(అమరావతి-ఆంద్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ మొండి వైఖరితో పార్టీ మునిగిపోతుందేమోనన్న ఆందోళన అధికార పక్షంలో అంతకంతకూ పెరుగుతోంది. మార్గదర్శకాలకు భిన్నంగా తీసుకుంటున్న నిర్ణయాలతో న్యాయస్థానంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా వైసీపీ శ్రేణులు భరిస్తూ వస్తున్నాయి. అధిష్ఠానం నిర్ణయం, ఆదేశాల మేరకు.. న్యాయస్థానాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ వ్యవస్థలపై ఎదురుదాడి చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో.. వైసీపీ ముఖ్య నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. వాదనల సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు వారిని మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. జగన్‌ గద్దెనెక్కినప్పటి నుంచీ జరుగుతున్న పరిణామాలపై పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం జరుగుతోంది.


కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఎదిరించి.. సొంత పార్టీని స్థాపించి ప్రతిపక్ష నేత హోదా నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారంటూ వైసీపీ నేతలు జగన్‌ను కీర్తిస్తుంటారని.. దీని ప్రభావమో ఏమో గానీ.. ప్రభుత్వ పరంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు వికటించినా.. ధిక్కార ధోరణే అనుసరించడం ఆనవాయితీగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రజాభిప్రాయానికి, ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా అకస్మాత్తు నిర్ణయాలు తీసుకోవడం.. దానిని వ్యతిరేకించేవారిపై కుల, మతాలను రుద్దేస్తూ ఎదురుదాడి చేయడం జగన్‌ కోటరీకి అలవాటుగా మారిందని వైసీపీ నేతలు కొందరు చెబుతున్నారని.. ఇది పార్టీని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారని అంటున్నారు. గత ఏడాది కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వాయిదావేసినప్పుడు.. సీఎం జగన్‌.. ఆయనకు కులాన్ని ఆపాదిస్తూ దూషణలకు దిగడం రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేసింది. పాలనలో పార్టీలు, కులమతాలు చూడనని చెబుతూనే.. వ్యవస్థలపై దాడి చేస్తూ వాటినే ప్రయోగించడం జగన్‌కు మామూలైందని కొందరు వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు.


విశ్లేషణ ఏదీ?

హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగుతున్నప్పుడు.. కేసులు వీగిపోవడానికి గల అసలు కారణాలను విశ్లేషించుకుని.. తప్పులను సరిదిద్దుకోకుండా.. కోర్టులు, న్యాయమూర్తులపై సైతం ఎదురుదాడికి దిగుతుండడం వల్ల పార్టీకి క్షేత్ర స్థాయిలో నష్టం జరుగుతోందని నేతలు చెబుతున్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తప్పించి.. రిటైర్డ్‌ జస్టిస్‌ కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అప్పట్లో నియమించారు. చివరకు న్యాయస్థానం ఆయన నియామకం చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా పునరుద్ధరించినప్పుడే జగన్‌ నైతికంగా పరాజయం పాలయ్యారని ఇంకొందరు వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తులపైనా సామాజిక మాధ్యమాల్లో కొందరు ముఖ్య నేతలు ఆరోపణలు చేస్తుంటే వారించకపోగా ప్రోత్సహించేలా వ్యవహరించడమూ పార్టీకి చేటు చేసిందని వారు, కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులూ వాపోతున్నారు. అసలు రాజ్యాంగ సంస్థలతో ఘర్షణ వైఖరి ఎందుకని ప్రశ్నిస్తున్నారు.


ఒకసారి ఎదురుదెబ్బ తగిలాక.. నిర్ణయాలను పునఃసమీక్షించుకోవడం నాయకుడి ప్రథమ లక్షణమని.. కానీ తమ అధినేత మరింత మొండితనం ప్రదర్శిస్తూ.. ప్రభుత్వాన్ని, పార్టీని ఇక్కట్ల పాలుచేస్తున్నారని వైసీపీ నేతలు వాపోతున్నారు. స్థానిక ఎన్నికలు జరపాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడే.. ఎన్నికల సంఘానికి సహకరిస్తే సరిపోయేదని అంటున్నారు. సుప్రీంకోర్టు అంగీకరించదని తెలిసీ అప్పీలు చేసి.. ఉద్యోగ సంఘాలనూ లాగి.. చీవాట్లు పెట్టించారని.. ఆయన వైఖరితో పార్టీ మునిగిపోతుందేమోనని కలవరపరడుతున్నారు.


ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? 

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చిన వెంటనే.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ. కొడాలి నాని తదితరులు తీవ్రంగా స్పందించారు. నైతిక బాధ్యత  వహిస్తూ కమిషనర్‌ పదవికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడాన్ని వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. సింగిల్‌ జడ్జి తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టేసి ఎన్నికలు జరపాల్సిందేనని స్పష్టం చేసిందని.. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడా వ్యతిరేక తీర్పు వచ్చిందని.. మరి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి జగన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ ప్రజల్లోకి వెళ్తే.. ప్రభుత్వ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందన్న ఆందోళన వైసీపీ ముఖ్య నేతల్లో క్రమంగా పెరుగుతోంది. మంకు పట్టుతో.. విచక్షణరహితంగా రాజ్యాంగ వ్యవస్థల మనుగడను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తే.. ఇతర వ్యవస్థలు వాటిని రక్షించేందుకు ముందుకొస్తాయన్నది ఆయన గ్రహించాలని వారిలో కొందరు సూచిస్తున్నారు. పాలనలో విచక్షణ కోల్పోతే చిక్కులు తప్పవని హెచరిస్తున్నారు. పార్టీని ముందుకు నడిపించే నేతగా.. ముఖ్యమంత్రిగా ఇప్పటికైనా ఆత్మశోధన చేసుకుంటూ ముందుకెళ్లాలని అంటున్నారు. 

Advertisement
Advertisement
Advertisement