శుష్క రాజకీయం

ABN , First Publish Date - 2020-07-10T05:48:26+05:30 IST

వివిధ పక్షాలు ఒకదానినొకటి దుమ్మెత్తిపోసుకోవడం ప్రజాస్వామ్యంలో సహజం. ప్రభుత్వాన్ని తప్పుపట్టి ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని వేలెత్తి చూపించి ప్రభుత్వం ప్రజలకు ఫిర్యాదు చేస్తుంటాయి. ఉభయపక్షాలకూ ఉన్న వైరం వల్ల ప్రజాసమస్యలు కూడా చర్చకు వచ్చి...

శుష్క రాజకీయం

వివిధ పక్షాలు ఒకదానినొకటి దుమ్మెత్తిపోసుకోవడం ప్రజాస్వామ్యంలో సహజం. ప్రభుత్వాన్ని తప్పుపట్టి ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని వేలెత్తి చూపించి ప్రభుత్వం ప్రజలకు ఫిర్యాదు చేస్తుంటాయి. ఉభయపక్షాలకూ ఉన్న వైరం వల్ల ప్రజాసమస్యలు కూడా చర్చకు వచ్చి, ఎంతో కొంత జనానికి మేలు జరుగుతూ ఉంటుంది. కానీ, ప్రజలకు ఏమీ ఒరగని శుష్క రాజకీయ క్రీడ వల్ల ఉపయోగం ఏమిటి? ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే అదే నిస్పృహ కలుగుతున్నది. 


కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా కల్లోల పరిస్థితి నెలకొన్నది. శక్తికి మించిన ఆరోగ్య ఉపద్రవం. ఆస్పత్రులు కిటకిట. పరీక్షలు జరపడానికి కూడా వసతులు చాలడం లేదు. శ్మశానాలు కూడా కిటకిట. ఇటువంటి పరిస్థితిలో, రాజకీయాలను పక్కనబెట్టి, సకలపక్షాలూ ఒకటయిపోయి, ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా రంగంలోకి దిగితే అంతకుమించి కోరుకోగలిగేది ఏముంటుంది? కానీ, కలికం వేసి వెదికినా లోకంలో అటువంటి మంచితనం కనిపించదు. కనీసం, అధికారానికీ, ప్రతిపక్షానికీ మధ్య ఉండే వైరం నుంచి అయినా ఎంతో కొంత ప్రయోజనం కలగాలని కోరుకోవడం తప్ప ప్రజలు చేయగలిగింది లేదు. 


కరోనా పరిస్థితిని కేంద్రప్రభుత్వం ఎట్లా ఎదుర్కొంటున్నది, ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను ఏ మేరకు చేయగలుగుతున్నది- నిఘా వేయడానికీ, నిరంతరం విమర్శలతో మార్గనిర్దేశనం చేయడానికీ వచ్చిన మహత్తరమైన అవకాశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పోగొట్టుకున్నది. నాయకత్వం ఉన్నదో లేదో తెలియని గందరగోళంలో చిక్కుకున్న ఆ పార్టీలో స్వయంగా పూనుకుని ఏదైనా చేయగలిగిన చొరవ పూర్తిగా లోపించింది. వలసకార్మికులను స్వస్థలాలకు పంపించే విషయంలో ప్రియాంక గాంధీ కొంత ఉత్సాహం చూపించారు కానీ, ఆమెకు కూడా స్వతంత్రించి అధికబాధ్యతను తీసుకోగలిగే అనుమతులు లేవు కాబోలు. దేశవ్యాప్త సందేశాలతోను, సరిహద్దు పర్యటనలతోను నరేంద్రమోదీ చేస్తున్న చతుర రాజకీయానికి ముగ్ధులై మూర్ఛిల్లడమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయగలిగేట్టు లేదు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా, అప్పుకూడా పుట్టకుండా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను, అత్యవసరపరిస్థితిలో ఎందుకూ కొరగాకుండా ఉన్న దేశమౌలిక ఆరోగ్య వ్యవస్థను తప్పుపట్టడానికి కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటున్నదేమిటో తెలియదు. జాతీయస్థాయిలో ఎట్లా ఉన్నదో రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ అట్లాగే ఉన్నది. ఆలూచూలు లేదు అన్నట్టుగా, కనుచూపుమేరలో అధికారమే లేదు, అధ్యక్షపదవి కోసం కీచులాటలు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో వినోదాన్ని అందిస్తున్నాయి. రెండు సాధారణ ఎన్నికలలో ఓడిపోయి, అనేక రాష్ట్రాలలో నామమాత్రమైన కాంగ్రెస్ పార్టీకి, నిజానికి, కరోనా ఉత్పాతం, ఒక అవకాశం. ప్రజలకు అనుకూలంగా మాట్లాడడానికి, కొన్ని పనుల విషయంలో అయినా ఒత్తిడులు తేవడానికి ఇది సందర్భం. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సలు, కట్టడుల అమలు- వంటి విషయాల్లో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీస్తున్నది. ఒకటి రెండు అంశాలలో ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం ప్రశంసనీయంగా వ్యవహరిస్తున్నప్పటికీ, తెలుగుదేశం విమర్శలో మాత్రం ఎటువంటి రాజీ ఉండడంలేదు. ఇటువంటి సమయాల్లో ప్రతిపక్షం అట్లాగే వ్యవహరించాలి. తెలంగాణలో కరోనా కారణంగా ఉత్పన్నమైన పరిస్థితుల మీద నిలకడైన వైఖరి తీసుకోవడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో, ఆ స్థానాన్ని బిజెపి తీసుకున్నది. పరీక్షల సంఖ్యపైన, వైద్య సదుపాయాల పైన, ప్రభుత్వ అలక్ష్యంపైన క్రమం తప్పకుండా ఆ పార్టీ విమర్శలు సంధిస్తున్నది. ఒక వైపు కేంద్ర ఆరోగ్యశాఖకు, హోంశాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు, మరో వైపు గవర్నర్ దృష్టికీ తీసుకువెడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆస్పత్రుల ముందు, ఆఫీసుల ముందూ ఆందోళనాకార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్లను చూసి అయినా నేర్చుకోవలసింది పోయి, కాంగ్రెస్ నేతలు సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ పాలనను చేతిలోకి తీసుకోవాలని గవర్నర్‌కు డిమాండ్ చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. తెలంగాణ మనోభావాలు ఏమిటో ఇప్పటికీ కాంగ్రెస్ నేతలకు అర్థం కావడం లేదు.


తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించడం తప్ప ప్రభుత్వ పక్షం మాత్రం ఏమి చేస్తున్నది? తాము కూడా కేంద్రంపై విమర్శలు చేయగలమని ఒకరు హెచ్చరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే వైద్యుల, వారియర్స్ నైతిక స్టైర్యాన్ని దెబ్బతీసినట్టేనని మరొకరు నిర్ధారిస్తారు. ఈ మాత్రం విమర్శలు కూడా లేకపోతే, రాష్ట్ర కరోనా విధానం ఇంకెట్లా ఉండేదో ఊహకు కూడా అందడం లేదు.

కాంగ్రెస్ అయినా, బిజెపి అయినా, నిశ్చేష్టులైపోయిన వామపక్షాలు కానీ, పరస్పర విమర్శలతో పొద్దు పుచ్చడమేనా, ఆందోళనలు, తీవ్రప్రకటనలు చేయడమేనా, రంగంలోకి దిగి ప్రజలకు సాయం చేయడం ఏమైనా ఉన్నదా? ప్రజావాగ్గేయకారుడు నిస్సార్ దయనీయ స్థితిలో మరణించడానికి స్పందన కోల్పోయిన మన ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థ ప్రధాన కారణమే అయినప్పటికీ, వామపక్ష ఉద్యమంలో అంత ముఖ్యుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు అయిన వ్యక్తికి ఆ పార్టీ ఎందుకు సకాలంలో అండగా లేకపోయింది? ఏమయింది వారి ప్రజారోగ్య ఉద్యమం, ఏమయింది సకలరంగాలలో విస్తరించి ఉండిన వారి నెట్‌వర్క్? ఈ విషాదసంఘటన గుర్తు చేయడం లేదా, మీరు పార్టీ కార్యాలయాలు దాటి ప్రజాక్షేత్రంలో సహాయ కార్యక్రమాలకు దిగాలని? 


కొన్ని పనులు ప్రభుత్వాలే చేయాలి, చేయగలవు కూడా. వాటితో ఆ పనులు చేయించడానికి సమాజం నుంచి ఒత్తిడి కావాలి, అభ్యర్థనలు, డిమాండ్లు, సూచనలు కూడా కావాలి. ఒక్కోసారి పైవారికి ఫిర్యాదులు కూడా చేయాలి. ఇవన్నీ చేస్తూ కూడా ప్రతిపక్షాలు, పౌర సమాజం అదే సమయంలో తాము సొంతంగా ఏమి చేయాలో కూడా ఆలోచించాలి. ప్రభుత్వమే చేయలేని పనులను పౌరులు పూనుకుని చేయడాన్ని వలసకార్మికుల విషయంలో చూశాము. ఆ పాటి అయినా ఈ రాజకీయపార్టీలు చేయలేవా?

Updated Date - 2020-07-10T05:48:26+05:30 IST