దుబాయి రాజు కూతురు క్షేమంగానే ఉంది: యూఏఈ ఎంబసీ

ABN , First Publish Date - 2021-02-21T10:37:42+05:30 IST

యూఏఈ ప్రధాని, దుబాయి రాజు షేక్ మహమ్మద్ కూతురు లతిఫా క్షేమంగానే ఉందంటూ లండన్‌లోని

దుబాయి రాజు కూతురు క్షేమంగానే ఉంది: యూఏఈ ఎంబసీ

దుబాయి: యూఏఈ ప్రధాని, దుబాయి రాజు షేక్ మహమ్మద్ కూతురు లతిఫా క్షేమంగానే ఉందంటూ లండన్‌లోని యూఏఈ ఎంబసీ తాజాగా వెల్లడించింది. తనను ప్యాలెస్‌లో బంధించారంటూ లతిఫా ఓ సెల్ఫీ వీడియో చేయగా.. గత మంగళవారం ఓ ప్రముఖ మీడియా చానల్ ఈ వీడియోను టెలికాస్ట్ చేసింది. దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఐక్యారాజ్యసమితి మానవ హక్కుల ఆఫీస్ ఈ ఘటనపై వెంటనే స్పందించి లతిఫా క్షేమంగానే ఉన్నట్టు ప్రూఫ్ కావాలంటూ యూఏఈని ఆదేశించింది. దీనిపై లండన్‌లోని యూఏఈ ఎంబసీ స్పందిస్తూ.. 


‘లతిఫా యోగక్షేమాల గురించి ఆందోళన వ్యక్తం చేసిన వారందరికి కృతజ్ఞతలు. మీడియాలో ప్రసారమైన వీడియోకు, లతిఫా ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఎటువంటి సంబంధం లేదు. లతిఫా ఇంట్లో క్షేమంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులు, వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడి సరైన సమయంలో అందరి ముందుకు వస్తారని మేం ఆశిస్తున్నాం’ అని యూఏఈ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. అయితే లతిఫా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్టు ఎటువంటి ఫుటేజ్‌ను యూఏఈ ఎంబసీ విడుదల చేయకపోవడం గమనార్హం. 


దుబాయి నుంచి అమెరికాకు పారిపోయేందుకు 2018లో లతిఫా ప్రయత్నించింది. ఓ పడవలో స్నేహితురాలితో కలిసి పారిపోతుండగా, ఆమెను అధికారులు పట్టుకుని తిరిగి దుబాయికి చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఒక్కసారి కూడా బయట కనిపించలేదు. తాజాగా తనను ప్యాలెస్‌లో బంధించారంటూ వీడియో రిలీజ్ కావడంతో ఆమె ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది.

Updated Date - 2021-02-21T10:37:42+05:30 IST