పని మనిషి నుంచి పద్మశ్రీ దాకా...

ABN , First Publish Date - 2021-01-31T16:25:34+05:30 IST

ఓ గరీబు కుంచెకు పద్మశ్రీ పురస్కారం లభించడమంటే మన ప్రజాస్వామ్య వినీలాకాశంలో చంద్రవంక దర్శన

పని మనిషి నుంచి  పద్మశ్రీ దాకా...

ఓ గరీబు కుంచెకు పద్మశ్రీ పురస్కారం లభించడమంటే మన ప్రజాస్వామ్య వినీలాకాశంలో చంద్రవంక దర్శన చందమే. సకల సౌకర్యాల జీవితాలతో కడుపేదరికం పోటీపడి గెలుపు మెట్టుపై నిలబడడం దేశ పురోగతికే విజయ సూచిక..


గణతంత్ర దినోత్సవం నాడు ప్రభుత్వం ప్రకటించిన దేశ అత్యుత్తమ పౌరపురస్కారాల్లో అక్కడక్కడా చమక్కున మెరిసిన పేర్లు దేశ ప్రజలకు మబ్బులు తొలిగిన ఇంద్రధనస్సులా అనిపించాయి. అందులో ఒక పేరు దులారీ దేవి. బిహారీ సంప్రదాయ జానపద చిత్రకళ అయిన మిథిలా పెయింటింగ్‌లో దుబారీ ప్రతిభకు పట్టంగా ఆమెకు పద్మశ్రీ జాబితాలో చోటు దక్కింది.


కవి ఇంట్లో పనికి కుదిరినంత మాత్రాన కవిత్వం అబ్బుతుందా! డ్యాన్సర్‌ ఇంట్లో పని చేసినంత మాత్రాన స్టెప్పులు వేయగలరా! ‘నో’ అనే మన నోళ్లతో ‘ఎస్‌’ అనిపించింది దులారీ దేవి. తన పొట్ట గడవడానికి ఏ ఇంట్లో గదులు ఊడ్చిందో, అంట్లు తోమిందో ఆ ఇంటామె వేసే బొమ్మలను తనూ నేర్చుకుంది. పనిలో పనిగానే ఆ కుంచె కదలికలను, రంగుల్లో రమ్యతను కంట కనిపెట్టి పట్టు సాధించింది. ఇంటికెళ్లి మట్టి గోడలపై పచ్చిపుల్లల కుంచెలతో చిత్ర లేఖన అభ్యాసం మొదలుపెట్టింది. అలా సాగిన విజయపరంపరలో నేడు పద్మపురస్కారాన్ని అందుకుంది. చీపురు పట్టిన చేతిలో వర్ణరంజిత కుంచె గిన్నెలు తోమిన చేతులతో అందుకునే పద్మశ్రీ సత్కార పత్రం.. నమ్మలేని నిజాల్లో ఇదొకటి.


బీహార్‌లోని మధుబని జిల్లా రాంటీ అనే గ్రామం దులారీ దేవి పుట్టి పెరిగిన ఊరు. పేదరికం బడివైపు కన్నెత్తనీయలేదు. చిన్నతనం నుండి తల్లివెంట పొలం, చేను పనులకు వెళ్లడమే ఆమెకు ఎరుకున్న బతుకు. పన్నెండు ఏళ్లకే పెళ్లి, 6 నెలల వయసులో పుట్టిన బిడ్డ మరణం. పదేళ్ల వైవాహిక జీవితంలోంచి తిరిగి పుట్టినూరికి రాక. వెనుక కారణాలేమున్నా దులారీ దిక్కులేని ఒంటరి మహిళగా మిగిలిపోయింది.


బడికెళ్లి అక్షరాలు నేర్వని దులారీ ప్రస్తుతం రాంచీలోని మిథిల ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బోర్డు మెంబర్‌గా ఉంది. ఆమె చిత్రకళపై ప్రసిద్ధ రచయిత్రి గీతా ఓల్ఫ్‌ ‘ఫాలోయింగ్‌ మై  పెయింట్‌ బ్రష్‌’ అనే పుస్తకాన్ని రాసింది. మార్టిన్‌ లే కాజ్‌ ఫ్రెంచి భాషలో రాసిన పుస్తకంలో దులారీదేవి జీవితకథ, కళాకృతుల పరిచయం ఉంది. ఓపెన్‌ యూనివర్సిటీ అయిన ఇగ్నో మైథిలి చిత్రాలపై పాఠ్యగ్రంథంలో దులారీని విశేషంగా ప్రస్తావించడంతో పాటు పుస్తకంపై ముఖచిత్రంగా ప్రచురించింది.


2011లో తనపై పుస్తకం వచ్చేదాకా ఆమె ఇళ్లలో పని చేస్తూనే ఉంది. బిహార్‌ రాష్ట్రంలో చిత్రకళకు సంబంధించిన ఏ ప్రభుత్వ కార్యక్రమానికైనా ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఈ చిత్రకారిణికి ప్రత్యేక ఆహ్వానం పంపి గౌరవిస్తున్నారు.


ఇప్పుటికి 7 వేల చిత్రాలు వేసిన దులారీ తను చిత్రాలు వేసినా, ఇతరులకు చిత్రకళ నేర్పినా కిందనే కూర్చుంటుంది. తనకు కుర్చీపై కూర్చొని వేయడం అలవాటు లేదంటుంది.


బీహార్‌లోని కాయస్థులు, బ్రాహ్మణులు నేర్చుకొనే ఈ సాంప్రదాయక చిత్రకళ ఒక వెనుక బడిన ముల్లా జాతి మహిళ నేర్చుకొని ఇంత గౌరవాన్ని పొందడం చరిత్రలోనే విశేష సంఘటన. 


పాత ఇంట్లో ఉంటూ తిండికి, బట్టకి ఆసరాగా ఉంటుందని రెండిళ్లలో పని మనిషిగా చేరింది. వాటిలో బకటి బిహార్‌లో ప్రసిద్ధ చిత్రకారిణి అయిన కర్పూరీదేవిది. కుటుంబ వారసత్వంగా నేర్చుకున్న మిథిల చిత్రకళను కొనసాగించిన కర్పూరీదేవి పలుదేశాల్లో తన ప్రదర్శనలను ఏర్పాటు చేసి గౌరవాల్ని అందుకున్నారు. జపాన్‌ ఆహ్వానంపై వెళ్ల్లి ఏడాది పాటు అక్కడే ఉండి మిథిల మ్యూజియంను రూపొందించారు.


ఇంటి పని బాగా చేస్తుందని కర్పూరీదేవి స్వయంగా దూలారీకి మహాసుందరిదేవి ఇంట్లో పనికి కుదిర్చారు. విశేషమేమిటంటే మహాసుందరి కూడా మిథిల చిత్రకళలో నిష్టాతురాలే కాకుండా మధుబని పెయింటర్‌గా 2011లో ప్రభుత్వం మహాసుందరికి పద్మశ్రీ ప్రదానం చేసింది.ఇంట్లోపని చేస్తూనే తమ చిత్రలేఖనాన్ని దులారీ పరిశీలిస్తున్న విషయం ఇద్దరికీ తెలియదు. అనుకోకుండా ఓ రోజు కర్పూరీదేవి దులారీ ఇంటికి వెళితే పాతబడిన మట్టి గోడలపై రంగులతో చిత్రాలు వేసి ఉన్నాయి. ఎవరు వేశారని అడిగితే తనే అంది. ఎప్పుడు, ఎలా నేర్చుకున్నావంటే పని చేస్తూనే మీరు బొమ్మలేసే తీరును చూశానంది. దులారీ నైపుణ్యతను, పట్టుదలను చూసి అబ్బురపడిన కర్పూరీదేవి ఆమెకు తన ఇంట్లో చోటు ఇచ్చి ప్రోత్సహించింది. 


ఇప్పుడు కర్పూరీదేవి, మహాసుందరీదేవి ఇరువురూ కీర్తిశేషులే. వారు పెంచి షోషించిన కుంచె వారి వారసత్వాన్ని నిలబెడుతూ మధుబని బ్రాండ్‌  మిథిల చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది.ప్రధానంగా దేవతా రూపాలకే పరిమితమైన మధుబని చిత్రకళకు దులారీ కొత్త సొగసులు అద్దింది. భక్తి, పూజలు తెలియని జీవితం గడిపిన ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను చిత్రాలుగా మలిచింది. తల్లితో బిడ్డగా తాను చేలకెళ్లిన దృశ్యాలు, చెట్టుకింద ఐస్‌క్రీం బండి చుట్టూ చేరిన బాలల చిత్రాలు స్పృహను అద్దింది. దాంతో ఆ కళ అన్ని వర్గాలకు చేరువయ్యింది. డా. అబ్దుల్‌ కలాం ఆమె చిత్రాలను ప్రశంసించారు.

- బీ.ఎన్‌., హైదరాబాద్‌

Updated Date - 2021-01-31T16:25:34+05:30 IST