Abn logo
Oct 18 2020 @ 05:25AM

దుర్గతిని తొలగించే తల్లి.. దుర్గ

Kaakateeya

ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్ల పక్ష పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు చేసే ఉపాసనా కార్యక్రమానికి రుషులు.. ‘శారదా నవరాత్రులు’ అని పేరు పెట్టారు. ఈ నవరాత్రులు.. ఉపాసనా క్రమంలో అత్యంత ప్రధాన స్థానం వహిస్తాయి. ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం. ఎవరికి దగ్గరగా అంటే.. పరమేశ్వరునికి దగ్గరగా చేరడానికి చేసే సాధనా క్రమమే ఉపాసన. ఈ క్రమంలో ఆశ్వయుజ మాసం మొదటి తొమ్మిది రోజులు చేసే ఉపాసన అత్యంత ప్రధానమైనది. మనకు 27 నక్షత్రాలున్నాయి. మొదటి నక్షత్రం అశ్వని. ఆ నక్షత్రానికి అధిదేవతలు అశ్వనీ దేవతలు.


చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు వచ్చిన పౌర్ణమి కలిగిన మాసం కనుక ఆశ్వయుజ మాసం మొదటి మాసం కావాలి. కానీ, మనకు చాంద్రమానం ప్రకారం చైత్రమాసం మొదటిదైంది. ఎందుకంటే 27 నక్షత్రాలలో మొదటి 13, వెనుక 13 నక్షత్రాలను విడిచిపెట్టి మధ్యలో ఉన్న 14వ నక్షత్రమైన చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడుకున్న పౌర్ణమి ఉన్న చైత్రమాసాన్ని మొదటిమాసంగా చేశారు. అయితే, ఉపాసనకు సంబంధించి మాత్రం ఆశ్వయుజమాసమే మొదటిది అవుతుంది. భగవంతుణ్ని చేరుకోవడానికి ప్రారంభం అక్కడ ఉంటుంది. అందుకే ఆ మాసానికి అంత గొప్పదనం ఇచ్చి.. శారదా నవరాత్రులన్న పేరుతో తొమ్మిది రాత్రులు ఉపాసన చేస్తారు.  


ద్వావృతూయందంష్ట్రాఖ్యే నూనం సర్వ జనేష్వైః 

వసంత శారదా రాత్రౌ

ఆశ్వయుజ పాడ్యమి వచ్చేసరికి యమధర్మరాజుగారి ఒక కోర బయటకు రావడం మొదలవుతుంది. రెండో కోర వసంత నవరాత్రుల్లో, చైత్ర మాసంలో వచ్చే శుక్ల పక్ష పాడ్యమి నుంచి బయటకు వస్తుంది. ఈ రెండు రుతువుల్లో యమధర్మరాజు కోరలు బయటకు వస్తాయి కాబట్టి ఆయా సమయాల్లో భయంకరమైన అంటు వ్యాధులు ప్రబలుతాయి. అపార జన నష్టం జరుగుతుంది. ఈ ఆపదను తొలగించే మార్గం.. యమదంష్ట్రలను బయటకు రాకుండా చేసే మార్గం.. ప్రకృతి స్వరూపమైన దుర్గాదేవిని తొమ్మిది రోజులపాటు పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడమే. తద్వారా దేశమంతా సుభిక్షంగా, సశ్యశ్యామలంగా ఉంటుంది. లోకంలో జననష్టం జరగకుండా, ప్రాణులకు నష్టం కలగకుండా లోకాన్ని సుభిక్షంగా ఉంచగలిగిన శక్తిని అనుగ్రహించగలిగిన పరదేవతా స్వరూపం దుర్గమ్మ. అందువల్లే అందరూ ఆమె ఆరాధన చేస్తారు. మనుషులలోని విషయ వాసనలను  తొలగించగల శక్తి దుర్గ. అందుకే పెద్దలు రోజుకు ఒక్కసారైనా ‘దుర్గాయైునమః’ అని దుర్గ నామస్మరణ చేయాలంటారు. కనీసం దుర్గా అని అయినా అనాలి. అందుకే ఒకప్పుడు ఇంట్లో ఒక ఆడపిల్లకైనా దుర్గ అని పేరు పెట్టేవారు.

దుర్గతిన్‌ గమయతి దూరయతి సా దుర్గా

..దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి ఆ కనకదుర్గమ్మ. లలితా సహస్రనామంలో అమ్మవారికి ‘సద్గతి ప్రదా’ అని ఒక నామం. గత జన్మలలోని విషయ వాసనల వల్ల ఈ జన్మలో మనకు దుష్టమైనవాటి పట్ల ఇష్టం ఉన్నా.. ఆ తల్లిని ఉపాసిస్తే గురుమండల రూపిణి అయి, గురు రూపంలో దగ్గరకు వచ్చి తన శక్తిమంతమైన వక్కుల చేత గత జన్మలలోని వాసన విరిచేసి, లోపల ఉన్న దుర్గుణాలను సుగుణాలుగా మార్చేస్తుంది. రోజూ ‘దుర్గా’ అని ఎవరు అంటారో వారు వాసనాబలాన్ని గెలిచి సద్గతి వైపు ప్రయాణం చేస్తారు. ఉన్న దుర్గతిని పోగొట్టి సద్గతివైపు ఆ తల్లి నడిపిస్తుంది. రోజూ ‘దుర్గా’ అనేవాడు దుఃఖించవలసిన అవసరం కలుగదు. 

- చాగంటి కోటేశ్వరరావు శర్మ

Advertisement
Advertisement
Advertisement