దసరా రోజు ఫైనల్‌

ABN , First Publish Date - 2021-06-08T06:17:06+05:30 IST

ఐపీఎల్‌-14వ సీజన్‌ రెండో దశ మ్యాచ్‌ల తేదీలను బీసీసీఐ ఖరారు చేసింది. సెప్టెంబరు 19న ప్రారంభించి

దసరా రోజు ఫైనల్‌

సెప్టెంబరు 19 నుంచి  ఐపీఎల్‌ 2.0  


న్యూఢిల్లీ: ఐపీఎల్‌-14వ సీజన్‌ రెండో దశ మ్యాచ్‌ల తేదీలను బీసీసీఐ ఖరారు చేసింది. సెప్టెంబరు 19న ప్రారంభించి అక్టోబరు 15 దసరా రోజున ఫైనల్‌తో ముగించనున్నట్టు సమాచారం. దుబాయ్‌, షార్జా, అబుదాబిలలో ఈ మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయి. పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడడంతో మే 4న లీగ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ‘ఐపీఎల్‌ను నిర్వహించేందుకు ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) గతంలోనే సమ్మతి తెలిపింది. ఈ విషయమై ఇరు బోర్డుల మధ్య చర్చలు కూడా ముగిశాయి.


ఇంకా ఆడాల్సిన 31 మ్యాచ్‌లు సెప్టెంబరు 19న ప్రారంభమై.. అక్టోబరు 15న ముగుస్తాయి’ అని బోర్డు అధికారి పేర్కొన్నాడు. ఇక విదేశీ ఆటగాళ్లను లీగ్‌లో ఆడించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందని, ఈ మేరకు ఆయా బోర్డులతో సంప్రదింపులు ఆరంభించిందని తెలిపాడు. 




‘టీ20’ రేసులో శ్రీలంక:

టీ20 ప్రపంచకప్‌ యూఏఈ, ఒమన్‌లో జరుగనున్నట్టు కథనాలు వెలువడినా.. అనూహ్యంగా శ్రీలంక కూడా రేసులో నిలిచింది. ఐపీఎల్‌ రెండో దశను సజావుగా నిర్వహించేందుకు బీసీసీఐ ఈ మెగా ఈవెంట్‌ను లంకకు తరలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఏ విషయమో తేల్చేందుకు బీసీసీఐకి ఈనెల 28 వరకు గడువుంది.


అయితే యూఏఈలో పొట్టి వరల్డ్‌కప్‌ జరిగితే అక్టోబరు ఒకటో తేదీ కల్లా స్టేడియాలను ఐసీసీకి అప్పగించాలి. కానీ ఐపీఎల్‌ అదేనెల 15 వరకు సాగుతుంది. ఇక అక్టోబరు 18 నుంచి జరిగే ప్రపంచక్‌పలో ఒమన్‌లో ఆరంభ మ్యాచ్‌లు జరిగినా యూఏఈలోని స్టేడియాలు మాత్రం ఐసీసీ చేతిలో ఉండాల్సిందే. అందుకే మెగా ఈవెంట్‌ నిర్వహణకై బీసీసీఐ.. లంక బోర్డుతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 


Updated Date - 2021-06-08T06:17:06+05:30 IST