నాలుగున్నర రోజులు.. 22,000 కోట్లు

ABN , First Publish Date - 2020-10-22T07:03:33+05:30 IST

పండగ ఆఫర్లలో భాగంగా ఈ-కామర్స్‌ కంపెనీలు మొదటి నాలుగున్నర రోజుల్లో రూ.22,000 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించాయని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ వెల్లడించింది...

నాలుగున్నర రోజులు.. 22,000 కోట్లు

  • ఈ-కామర్స్‌ కంపెనీల పండగ సేల్స్‌: రెడ్‌సీర్‌ 


న్యూఢిల్లీ: పండగ ఆఫర్లలో భాగంగా ఈ-కామర్స్‌ కంపెనీలు మొదటి నాలుగున్నర రోజుల్లో  రూ.22,000 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించాయని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ వెల్లడించింది. సాధారణంగా ఈ-కామర్స్‌ కంపెనీలు దసరా, దీపావళి పండగల సీజన్‌లో మూడు రౌండ్ల సేల్‌ను ప్రకటిస్తాయి. మొదటి రౌండ్‌ లో అమ్మకాలు 400 కోట్ల డాలర్ల స్థాయిలో నమోదు కావచ్చని  రెడ్‌సీర్‌ అంచనా వేయగా వాస్తవ విక్రయాలు దాని కన్నా 20 శాతానికి పైబడే ఉన్నాయి. ఈ ఏడాది పండగ సీజన్‌లో ఈ-కామర్స్‌ మొత్తం విక్రయాలు 700 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండవచ్చని రెడ్‌సీర్‌ అంచనా. మూడు రౌండ్లు పూర్తయ్యే వరకు వాస్తవిక అమ్మకాలు అంచనాల్లో ఏ స్థాయికి చేరుకుంటాయో వేచి చూడాల్సిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి మొదటి రెండు రోజుల్లో ఈ-కామర్స్‌ కంపెనీలకు భారీగా ఆర్డర్లు లభించాయని రెడ్‌సీర్‌ పేర్కొంది. కంపెనీలు మాత్రం తమ అమ్మకాలను అధికారికంగా ప్రకటించలేదు. 


‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరుతో ప్రతియేటా ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించే సేల్‌ ఈనెల 16న ప్రారంభమై 21న ముగిసింది. అంతర్జాతీయ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ ఆఫర్లు ఈనెల 17న మొదలయ్యాయి. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు 16 నుంచే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. నెల పొడుగునా సేల్‌ కొనసాగించనున్నట్లు అమెజాన్‌ సంకేతాలిచ్చింది. ఈనెల 16న ప్రారంభమైన మింత్రా ‘బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌’ 22న ముగియనుంది. స్నాప్‌డీల్‌ 16-20 తేదీల్లో ఆఫర్‌ సేల్‌ను నిర్వహించింది. 


మరిన్ని ముఖ్యాంశాలు

  1. మొదటి రెండ్రోజుల్లో తమ ప్లాట్‌ఫామ్‌లోని 1.1 వర్తకులకు ఆర్డర్లు లభించాయని అమెజాన్‌ తెలిపింది. మెజారిటీ ఆర్డర్లు చిన్న నగరాలు, పట్టణాల నుంచే వచ్చాయని పేర్కొంది. 
  2. తమకు లభించిన ఆర్డర్లలో 80 శాతం మంది స్థానిక బ్రాండ్లనే ఎంచుకున్నారని.. కేవలం 20 శాతమే జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను కొనుగోలు చేశారని స్నాప్‌డీల్‌ తెలిపింది.



కోటిన్నర స్మార్ట్‌ఫోన్ల విక్రయం!

ఈ పండగ సీజన్‌లో ఈ-కామర్స్‌ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ దాదాపు 1.5 కోట్ల స్మార్ట్‌ఫోన్లు విక్రయించే అవకాశం ఉందని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ టెక్‌ఆర్క్‌ అంచనా వేసింది. అక్టోబరు-డిసెంబరు కాలానికి దేశంలో అమ్ముడయ్యే మొత్తం స్మార్ట్‌ఫోన్లలో పండగ సీజన్‌ సేల్స్‌ వాటానే 36 శాతంగా నమోదుకావచ్చని తాజా నోట్‌లో పేర్కొంది. ఈ ఏడాది మొత్తానికి దేశంలో 12.8 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోవచ్చని టెక్‌ఆర్క్‌ అంచనా. 

Updated Date - 2020-10-22T07:03:33+05:30 IST