నేడే ఈద్‌-ఉల్‌-ఫితర్‌

ABN , First Publish Date - 2020-05-25T09:36:31+05:30 IST

ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్‌ ఉపవాస దీక్షలు ఆదివారంలో ముగిశాయి.

నేడే ఈద్‌-ఉల్‌-ఫితర్‌

లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఇళ్లల్లోనే ప్రార్థనలు 

పండుగ సామగ్రి కోనుగోళ్లతో దుకాణాల్లో సందడి

 

ఖమ్మం ఖమ్మం కల్చరల్‌/కల్లూరు/కొత్తగూడెం సాంస్కృతికం, మే 24: ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్‌ ఉపవాస దీక్షలు ఆదివారంలో ముగిశాయి. నెలవంక కనిపించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం రంజాన్‌( ఇద్‌-ఉల్‌-ఫితర్‌) పండుగ నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉండడంతో ఈ సారి ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. ఈ నేపధ్యంలో ముస్లింలు తమ ఇళ్ల వద్దనే ప్రార్థనలు నిర్వహించుకోనున్నారు. లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఈ వేసవిలో ముస్లింలు కఠినమైన ఉపవాసదీక్షలు చేశారు. ఇఫ్తార్‌ విందులకు అనుమతి లేకపోవడంతో ఉపవాసం ఉన్నవారు సొంత ఇళ్లలోనే ఏర్పాట్లు చేసుకున్నారు.  


దుకాణాల వద్ద సందడి.

రంజాన్‌ షాపింగ్‌తో ఇరుజిల్లాల్లో దుకాణాలు సందడిగా మారాయి. ఖమ్మం నగరంలోని  కమాన్‌బజార్‌, రైల్వేస్టేషన్‌ రోడ్లలో ప్రత్యేకంగా దుకాణాలను ఏర్పాటు చేయడంతో కొనుగోలుదారులతో ఆయా ప్రాంతాలు రద్దీగా కనిపించాయి. సత్తుపల్లి, మధిర, తల్లాడ వైరా, కొత్తగూడెం, ఇల్లెందు తదితర ప్రాంతాల్లోనూ రంజాన్‌ షాపింగ్‌ సందడి నెలకొంది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో గతం కంటే కొంత సందడి తక్కువగానే సందడి కనిపించింది.


ప్రముఖుల శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేయడం అభినందనీయమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ముస్లింలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎల్‌పీనేత భట్టి విక్రమార్క ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, ఎంవీ రెడ్డి, ఖమ్మం జడ్పీ అధ్యక్షుడు లింగాల కమల్‌రాజ్‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఖమ్మం నగర మేయర్‌ డాక్టర్‌ జి పాపాలాల్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.  

Updated Date - 2020-05-25T09:36:31+05:30 IST