‘ఈబీసీ నేస్తం’కు బడ్జెట్‌ కేటాయింపు

ABN , First Publish Date - 2021-04-21T09:52:11+05:30 IST

ఆర్థికంగా వెనుకబడిన 45-60 ఏళ్ల వయసు అగ్రవర్ణ పేదల కోసం జగన్‌ ప్రభుత్వం రూపొందించిన ఈబీసీ నేస్తం పథకానికి 2021-22 బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రవర్ణ పేదలకు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున

‘ఈబీసీ నేస్తం’కు బడ్జెట్‌ కేటాయింపు

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా వెనుకబడిన  45-60 ఏళ్ల వయసు అగ్రవర్ణ పేదల కోసం జగన్‌ ప్రభుత్వం రూపొందించిన ఈబీసీ నేస్తం పథకానికి 2021-22 బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రవర్ణ పేదలకు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో 32 లక్షల మంది ఈబీసీ మహిళలు ఉన్నారని, అందులో 45-60 మధ్య వయసువారు 13.97 శాతం(4.47 లక్షల మంది) ఉన్నారని గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.15 వేలు చెల్లిస్తే ఏడాదికి రూ.670.56 కోట్లు, మూడేళ్లకు రూ.2011.68 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ ఆర్థిక సాయం ద్వారా అగ్రవర్ణ పేద మహిళల జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు అవకాశముంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కుటుంబ ఆదాయం గ్రామీణులకైతే రూ.10 వేల లోపు, పట్టణాల్లో అయితే రూ.12 లోపు ఉండాలి. 3 ఎకరాల్లోపు మాగాణి, 10 ఎకరాల్లోపు మెట్ట భూములు కలిగిన వారు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు అయి ఉండరాదు.  నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు అర్హులు కారు. మున్సిపాలిటీల్లో 750 చదరపు అడుగులపైన స్థలం ఉంటే అనర్హులవుతారు.

Updated Date - 2021-04-21T09:52:11+05:30 IST