వారంలోగా బీజేపీలోకి ఈటల

ABN , First Publish Date - 2021-06-03T07:53:08+05:30 IST

మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వారం రోజుల్లో కాషాయ కండువా వేసుకునే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు

వారంలోగా బీజేపీలోకి ఈటల

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన

తర్వాతే మా పార్టీలో చేరతారు

సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయం

ఆయనపై కేసుల వివరాలు తీస్తున్నం

మీడియాతో సంజయ్‌ వ్యాఖ్యలు


హైదరాబాద్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వారం రోజుల్లో  కాషాయ కండువా వేసుకునే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. తమ పార్టీ నియమావళి ప్రకారం, ఏ నాయకుడైనా పదవికి రాజీనామా చేసిన తర్వాతే చేరాల్సి ఉంటుందన్నారు. ఈటల రాజేందర్‌ సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే తమ పార్టీలో చేరుతారని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన సంజయ్‌.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌పై సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పని చేసినప్పుడు కేసీఆర్‌ అంత అవినీతిపరుడు దేశంలోనే ఎవరూ లేరు. ఆయన అవినీతికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించాం. సహారా, ఈఎ్‌సఐ కేసుల వివరాలు తీస్తున్నం. సదరు అవినీతి చిట్టా చూసి మేమే ఆశ్చర్యపోయాం. ఆయన జైలుకు వెళ్లడం ఖాయం’’ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి తెలంగాణ రావడం కేసీఆర్‌కు ఇష్టం లేదని, అందుకే పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు ఆ పార్టీ నేతలు పత్తాకు లేకుండా పోయారని విమర్శించారు.  టీఆర్‌ఎస్‌తో తాము కుస్తీ పడుతుంటే... దోస్తీ ఎక్కడ ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  కాగా, ఈటల చేరిక అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఢిల్లీలో మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశం అనంతరం ఈటల మరోసారి వారితో చర్చించారు. అలాగే, బుధవారం పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతో్‌షతో ఆయన భేటీ అయ్యారు.


నేడు హైదరాబాద్‌కు ఈటల!

బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయిన ఈటల రాజేందర్‌ గురువారం హైదరాబాద్‌ రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్ర లేదా శనివారం ఆయన ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గత నెల 30న ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి ఈటల ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. 


టీఆర్‌ఎ్‌సకు రాజకీయ సమాధి తప్పదు

2023లో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు రాజకీయ సమాధి తప్పదని, సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారని బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంజయ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌, ఒవైసీ కుటుంబాలకు మాత్రమే న్యాయం జరిగిందని మండిపడ్డారు. కరోనా నియంత్రణలో విఫలమైన కేసీఆర్‌.. ప్రజల దృష్టి మళ్లించడానికి రాజకీయ గిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-03T07:53:08+05:30 IST